మాయా విత్తనం | Private Companies Selling Adulterated Seeds in Telangana | Sakshi
Sakshi News home page

మాయా విత్తనం

Published Sat, Aug 17 2019 2:49 AM | Last Updated on Sat, Aug 17 2019 4:46 AM

Private Companies Selling Adulterated Seeds in Telangana - Sakshi

పెద్ద కంపెనీలూ కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేయడం ఆవేదన కలిగిస్తోంది. కల్తీ విత్తనాలు ఏవో మాకు తెలియడంలేదు. రైతులకు ఇచ్చాక అవి మొలకెత్తకపోవడంతో వారు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాం. రీసైక్లింగ్‌ చేస్తున్న కంపెనీల వివరాలను అధికారులకు తెలియజేశాం.  – పృథ్వీ, విత్తన డీలర్, ఖమ్మం 
 
కంపెనీలు విత్తనాలను కల్తీ చేస్తున్న వ్యవహారం మా దృష్టికి వచ్చింది. గడువు తీరిన వాటిలో కొన్ని విత్తనాలను మరోసారి లేబొరేటరీలో పరీక్షించి మొలకెత్తే లక్షణం ఉన్న వాటిని అమ్ముకోవడానికి అనుమతి ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా గడువు తీరిన విత్తనాలను గోదాముల్లో గుర్తించాం. వాటిని అలా ఉంచడం నేరం. విత్తనాలను రీసైక్లింగ్‌ చేయకూడదు. ఈ విషయంలో 15 కంపెనీలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం.  – రాహుల్‌ బొజ్జా, కమిషనర్, వ్యవసాయశాఖ

సాక్షి, హైదరాబాద్‌ : ఆరుగాలం శ్రమించి పంట పండించే అన్నదాతలతో విత్తన కంపెనీలు ఆటలాడుతున్నాయి. కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ విత్తనం.. ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాం గం కుదేలవుతోంది. చిన్న కంపెనీలే కాకుండా బడా కంపెనీలు కూడా ఈ విత్తన దందా కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆయా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉండటమే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. 

భారీ కుంభకోణం... 
రాష్ట్రంలో రీసైక్లింగ్‌ విత్తన కుంభకోణం భారీగా జరుగుతోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్‌ చేసిన విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్‌ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్‌ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యధేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా 15 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్‌ వ్యవహారం బయటపడింది. దీంతో పలు పెద్ద కంపెనీలపైనా దాడులు చేయడానికి అనుమతించాలని కిందిస్థాయి సిబ్బంది కోరినా.. ఉన్నతస్థాయి నుంచి ఆమోదం రావడంలేదని తెలిసింది. వీరికి అనేకమంది పెద్దలు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయా కంపెనీలు చేయూత ఇవ్వడమే కారణమన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో వాటిపై కన్నెత్తి చూడడానికి కూడా వెనకాడుతున్నట్లు సమాచారం.
 

రీసైక్లింగ్‌ ఇలా జరుగుతోంది..  
రాష్ట్రానికి అవసరమైన హైబ్రీడ్‌ విత్తనాలను ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తుంటాయి. మొక్కజొన్న, వరి, బఠానీ, సోయాబీన్, పత్తి వంటి హైబ్రీడ్‌ రకాలన్నింటినీ కంపెనీలే అభివృద్ధి చేసి రైతులకు ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటాయి. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అనుమతి ఇస్తుంది. మొదటిసారి విక్రయించిన విత్తన ప్యాకెట్లకు ఏడాదిన్నర గడువు ఉంటుంది. ఆ గడువు తీరాక ఆయా విత్తనాలను తిరిగి డీలర్ల నుంచి కంపెనీలు వెనక్కి తీసుకోవాలి. అలా వెనక్కు తీసుకున్న విత్తనాలను లేబొరేటరీలో పరీక్షించిన తర్వాత అందులో మొలకెత్తే లక్షణాలున్న విత్తనాలను వేరుచేసి మరోసారి విక్రయించేందుకు ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. అలాంటి విత్తనాలకు తొమ్మిది నెలల గడువుతో అమ్మడానికి వ్యవసాయశాఖ అనుమతి ఇస్తుంది. ఇలా రెండోసారి విక్రయించే విత్తన ప్యాకెట్లపై రీవాలిడేటెడ్‌ అని తప్పనిసరిగా ముద్రించాలి. కానీ కంపెనీలు మాత్రం అలా ముద్రించడంలేదు. పైగా వాటి గడువును ఏడాదిన్నరగా పేర్కొంటూ కొత్త విత్తనాలుగా మళ్లీ అమ్మేస్తున్నాయి. ఇక్కడితోనూ ఊరుకోవడంలేదు. ఇలా రెండోసారి గడువు తీరిన విత్తనాలను మూడోసారి కూడా రీసైక్లింగ్‌ చేసి రైతులకు అంటగడుతున్నాయి. ఇలాంటివాటిని కొత్త విత్తనాలతో కలిపేసి విక్రయిస్తున్నారని విజిలెన్స్‌ దాడుల్లో వెల్లడైంది. ఇలా కొత్త విత్తనాల్లో కాలం చెల్లిన విత్తనాలను కలపడం వల్ల మొత్తం విత్తనాలన్నీ కల్తీ అయిపోతాయని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడోసారి రీసైక్లింగ్‌ చేసిన తర్వాత ఏమాత్రం పనికిరాని విత్తనాలను బయో కంపెనీలకు విక్రయిస్తామంటూ వ్యవసాయశాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. కానీ అలా చేయకుండా వాటిని నాలుగోసారి రీసైక్లింగ్‌ చేసి కొత్త వాటితో కలిపి మళ్లీ విక్రయించి రైతులను నిలువునా ముంచేస్తున్నారు.

పలు రాష్ట్రాలకూ సరఫరా.. 
తెలంగాణలో తయారయ్యే విత్తనాల్లో రాష్ట్రానికి సరిపోను మిగిలిన వాటిని దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు కూడా ఈ రీసైక్లింగ్‌ విత్తనాలు తరలి వెళ్తున్నాయి. కేవలం ఒకే ఒక కంపెనీ సరఫరా చేసిన విత్తనాలే రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు సరిపడా ఉంటాయని సమాచారం. అంటే మొత్తం రాష్ట్రంలో సరఫరా చేసిన విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్‌ విత్తనాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఏమాత్రం పనికిరాని విత్తనాలను గోదాముల్లోనే ఉంచకూడదు. ఒకవేళ ఉంటే, తమ వద్ద అలాంటి విత్తనాలు ఉన్నాయనే సమాచారాన్ని ఆయా కంపెనీలు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేయాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించడంలేదు. ఇటీవల జరిపిన దాడుల్లో అనేక కంపెనీల గోదాముల్లో ఈ విత్తనాలు కనిపించాయి. మేడ్చల్‌లో ఉన్న ఒక కంపెనీయే దాదాపు 1200 టన్నుల వివిధ రకాల రీసైక్లింగ్‌ విత్తనాలను సరఫరా చేసినట్లు తేలింది. మొత్తం 15 కంపెనీలు దాదాపు 20వేల టన్నుల రీసైక్లింగ్‌ విత్తనాలు సరఫరా చేసినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement