
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ‘రైతు భరోసా’ పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది. రైతుల వద్ద ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్క తేలింది. రాష్ట్రంలోని 10,277 గ్రామాల్లో 2,10,864 ఎకరాల విస్తీర్ణంలోని భూములు సాగు యోగ్యమైనవి కావని గుర్తించారు. అంటే ఇవి ‘రైతు భరోసా’కు అర్హత లేనివని నిర్ధారించారన్నమాట.
అయితే గ్రామసభల్లో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీటిలో 5 నుంచి 10 శాతం వరకు భూములను వ్యవసాయానికి యోగ్యమైనవిగా నిర్ధారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటీ రెండురోజుల్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కను నిర్ధారించుకుని,ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది.
తర్జన భర్జనల అనంతరం తెరపైకి ‘యోగ్యత’
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రైతుబంధు (పస్తుతం రైతు భరోసా) పథకం కింద గుట్టలు, కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్వారీలకు కూడా పెట్టుబడి సాయం అందించారని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా ఎవరికి వర్తింప జేయాలనే విషయమై సిఫారసు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు.
ఈ మేరకు చర్చోప చర్చలు, కూడికలు, తీసివేతలు జరిపిన మంత్రులు.. తొలుత సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందజేయాలని, ఎకరాకు ఒక సీజన్‌కు రూ. 6,000 చొప్పున అందించాలంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో సాగైన భూములకే రైతుభరోసా అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు గత నాలుగేళ్లుగా సాగులో లేని భూముల వివరాలను క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు పంపించి సర్వే చేయాలని ఆదేశించారు. గత కొన్నేళ్లుగా సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడంతో పాటు కాలేజీలు, కోళ్ల ఫారాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, గుట్టలు, కొండలు, ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న భూముల ఫ్రీజింగ్ (రైతు పట్టా పాస్ పుస్తకాల్లో సాగు యోగ్యం కాని భూములుగా నిర్ధారించడం)కు కూడా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌తో కలిసి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ సర్వే చేశారు.
కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా?
రాష్ట్రంలోని 600 గ్రామీణ మండలాల్లోని 10,622 గ్రామాలకు గాను వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్న 10,277 గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు.. వాటిలో 2,10,864 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేని భూములని తేల్చారు. గతసారి ‘రైతుబంధు’ పథకం కింద 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. 2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ ప్రారంభం కాగా, ఆ సీజన్‌లో రూ.7,624 కోట్లను 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ లెక్కన 2 లక్షల పైచిలుకు ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా నిర్ణయిస్తే కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా అందే అవకాశం ఉందని అధికారులంటున్నారు.
హైదరాబాద్ శివార్లలో రియల్ వెంచర్లు, కళాశాలలు!
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రియల్ వెంచర్లుగా, కళాశాలలు, కోళ్ల ఫారాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన సర్వేలో.. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యం కాని పట్టా భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాలో 28,287 ఎకరాల సాగు యోగ్యం కాని భూములకు ఇప్పటివరకు 11 విడతల్లో రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందినట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని 18,190 ఎకరాలను వ్యవసాయ యోగ్యత లేని పట్టా భూములుగా తేల్చారు.
ఆ తర్వాత స్థానంలో మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా (14,444 ఎకరాలు), సంగారెడ్డి జిల్లా (12,174 ఎకరాలు), నల్లగొండ (12,040 ఎకరాలు) ఉన్నాయి. మెదక్, మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కామారెడ్డి, తదితర జిల్లాల్లో కూడా సాగుయోగ్యం కాని భూములకు రైతుబంధు అందినట్లు తేలింది. ఈ భూములన్నిటినీ ఇప్పుడు ఫ్రీజ్ చేయడంతో వాటికి రైతుభరోసా అందే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment