
బతికుండగానే నరకం చూస్తున్న వృద్ధులు
తల్లిదండ్రులకు ఛీత్కారాలు.. భరించలేని వేధింపులు
ఆస్తిపాస్తులు లాక్కొని.. ఆగం చేస్తున్న బిడ్డలు
వయోవృద్ధుల సంక్షేమశాఖ కాల్ సెంటర్‌కు ఫిర్యాదుల వెల్లువ
అత్యధికం ఆస్తులకు సంబంధించిన కేసులే..
చిత్రంలో కనిపిస్తున్నామె పేరు రామేశ్వరమ్మ(65). ఈమెది మాడ్గుల మండల కేంద్రం. భర్త బ్రహ్మచారి 23 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమెకు ఏకైక ఆధారం భర్త సంపాదించిన ఇల్లు ఒక్కటే. ఎవరికీ తెలియకుండా కుమారుడు ఇంటిని తన పేరున రాయించుకున్నాడు.
ఆ తర్వాత తల్లి సహా ఇద్దరు చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్డాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ రామేశ్వరమ్మ ఏడాది క్రితం ఇబ్రహీంపట్నం ఆర్డీఓను ఆశ్రయించింది. ఇప్పటికీ న్యాయం దక్కలేదు. తలదాచుకునేందుకు ఇల్లు లేకపోవడంతో వీధుల్లో బతుకీడుస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవిత చరమాంకంలో అండగా నిలబడాల్సిన కన్నబిడ్డలు.. ఆ తల్లిదండ్రుల పాలిట కర్కోటకులుగా ప్రవర్తిస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు.. ఉన్న ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులు రాసి ఇవ్వాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇంకొందరు ప్రత్యక్ష దాడులకు పాల్పడటంతోపాటు బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు.
విధిలేని పరిస్థితుల్లో కొంతమంది జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖను ఆశ్రయించి, న్యాయం పొందుతుండగా, మరికొంత మంది ఆత్మాభిమానం చంపుకొని జీవించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 2023–24లో 1,105 ఫిర్యాదులు అందగా, వాటిలో 979 కేసులు పరిష్కారమయ్యాయి.
ఈ ఏడాది జనవరి 25 వరకు 107 ఫిర్యాదులు అందగా, 69 పరిష్కారం అయ్యాయి. నిజానికి ప్రొటెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మెయింటెనెన్స్ 2007 యాక్ట్ ప్రకారం ఫిర్యాదు చేసిన 90 రోజుల్లోనే తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. మెజారిటీ కేసుల్లో రెండు మూడేళ్లైనా విచారణ పూర్తి కావడం లేదు.
కఠినచర్యలు తప్పవు
వనస్థలిపురం సచివాలయనగర్‌కు చెందిన వృద్ధురాలు కె.రత్నమణి ఇటీవల జిల్లా వయోజన వృద్ధుల సంక్షేమశాఖను ఆశ్రయించింది. కొడుకు అమృతరాజ్, కోడలు పద్మ తన ఆస్తులను లాగేసుకుని ఆ తర్వాత తన సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపి, తుది ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఇలా ఇప్పటికే ఎనిమిది కేసుల్లో తీర్పులు ఇచ్చాం. వృద్ధులు/తల్లిదండ్రులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయిస్తాం. బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఆర్డీఓతో విచారణ జరిపించి..వారిచ్చే నివేదిక ఆధారంగా తుది ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇప్పటికే మెజారిటీ కేసులను పరిష్కరించాం. – సంధ్యారాణి, రంగారెడ్డి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ విభాగం అధికారి
సత్వర న్యాయం చేయాలి
విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసును సాగదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు భారంగా భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. వృద్ధులపై దాడులకు పాల్పడే కొడుకులు, కోడళ్లపై కఠినచర్యలు తీసుకోవాలి. అప్పుడే సమాజంలో వృద్ధులకు రక్షణ పెరుగుతుంది. – మధుసూదన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్
తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారాలి
పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే ఎక్కడ పాడవుతారో అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. తన తర్వాత తన ఆస్తి తన పిల్లలకే చెందుతుందని చెబుతుంటారు. సొంతకాళ్లపై నిలబడకుండా చేస్తున్నారు. దీంతో వారు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చివరకు తనకే వస్తుందనే భావనలో ఉండిపోతున్నారు.
బలవంతంగా ఆస్తులన్నీ తమ పేరుపై రాయించుకొని చివరకు వారిని ఇంటి నుంచి గెంటివేస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై పిల్లలకు హక్కులుండవు. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపైనే పిల్లలకు హక్కులు ఉంటాయి. విదేశీయుల మాదిరిగా ఇండియన్ పేరెంట్ మైండ్‌సెట్ కూడా మారాలి. అప్పుడే ఆస్తి వివాదాలు, గొడవలు తగ్గుతాయి – విశేష్, సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment