![Telangana: TS GOVT Disbursed Rythu Bharosa to Farmers With 2 Acre Land](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/RAITHU-BAROSA-1.jpg.webp?itok=p0ym_Bl0)
13.24 లక్షల మంది రైతులకు రూ.1,092 కోట్లు విడుదల
ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.2,218.49 కోట్లు ఖాతాల్లో జమ
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న రైతులకు రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 13.24 లక్షల మంది రైతులకు చెందిన 18.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు ఈ మొత్తం నిధులను కేటాయించారు. దీంతో కలిపి ఇప్పటివరకు మూడు విడతల్లో 36.97 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సొంతదారులైన 34.69 లక్షల మంది రైతులకు రూ.2,218.49 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లయింది.
గణతంత్ర దినోత్సవం నుంచి..
రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందజేసే కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆ మేరకు ముందుగా ఎంపిక చేసిన 563 గ్రామీణ మండలాల్లోని 563 రెవెన్యూ గ్రామాల (577 గ్రామ పంచాయతీలు)కు చెందిన 4,41,911 మంది రైతులకు చెందిన 9.48 లక్షల ఎకరాలకు జనవరి 27వ తేదీన రూ.569 కోట్లు విడుదల చేశారు.
ఈ గ్రామాల్లో ఎకరాలతో సంబంధం లేకుండా మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా డబ్బులను జమ చేశారు. తర్వాత ఈ 577 గ్రామ పంచాయతీలను మినహాయించి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం విస్తీర్ణం లోపు గల (9.29 లక్షల ఎకరాలకు) 17.03 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు విడుదల చేశారు. తాజాగా సోమవారం రూ.1,092 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
సిద్దిపేటలో అత్యధికంగా..
మూడు దఫాలుగా విడుదలైన రైతు భరోసా కింద సిద్దిపేట జిల్లా రైతులు అత్యధిక సంఖ్యలో లబ్ధి పొందారు. ఈ జిల్లాలోని 1,86,241 మంది రైతుల ఖాతాల్లోకి రూ.116. 26 కోట్లు జమయ్యాయి. ఇక్కడ సుమారు 1.94 లక్షల ఎకరాలకు రైతుభరోసా అందింది. తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన 1.85 లక్షల మంది రైతులకు రూ.113.33 కోట్లు విడుదలయ్యాయి. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1.82 లక్షల మంది రైతులకు రూ.116.26 కోట్లు జమ కాగా, అతి తక్కువగా మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో కేవలం 4,981 మంది రైతులకు 3.82 కోట్లు జమయ్యాయి. అంటే ఈ జిల్లాలో రెండెకరాల లోపు 6,370 ఎకరాలు మాత్రమే సాగుయోగ్యమైన భూములు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ జిల్లాలో సాగు భూములన్నీ చాలావరకు రియల్ వెంచర్లు, విద్యాసంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలుగా మారిపోవడంతో వాటిని రైతుభరోసా పోర్టల్ నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment