
అయినా ముందే చేరుకోవాలి
రేపట్నుంచే ఇంటర్ పరీక్షలు.. ప్రతి ప్రశ్నపత్రానికీ యూనిక్ సీరియల్ నంబర్.. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్... అన్నిచోట్లా సీసీ కెమెరాలు
హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ రూం: ఇంటర్ బోర్డ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఆ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తెచ్చామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను గరిష్టంగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. ఈసారి ప్రతీ ప్రశ్నపత్రానికి యూనిక్ సీరియల్ నంబర్ ఇచ్చామని, పేపర్ ఎవరిదో తేలికగా కనిపెట్టొచ్చన్నారు.
హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు(TSBIE) నుంచి పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,532 పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించామని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరిచి, పరీక్ష అయ్యాక సీల్ చేస్తామని చెప్పారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి కలిపి మొత్తం 9,96,971 మంది ఇంటర్ పరీక్షలు(Intermediate exams) రాయబోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్, ఇతర అధికారులతో కలిసి కృష్ణఆదిత్య సోమవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థులకు సూచనలు
⇒ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 వరకూ చేరుకోవాలి. అంతకు ముందు వచ్చినా అనుమతిస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. అయితే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిది.
⇒ tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు. దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే పరీక్ష కేంద్రం జీపీఎస్ చూసుకోవచ్చు. దీనిద్వారా ముందే పరీక్ష కేంద్రాన్ని గుర్తించొచ్చు. ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు.
⇒ రిస్ట్‌వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్, సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రానికి అనుమతించరు. స్మార్ట్‌వాచీలు వస్తున్న నేపథ్యంలో రిస్ట్‌వాచీలను తొలిసారి నిషేధించారు.
⇒ హాల్‌టికెట్‌పై సమాచారం, మాధ్యమం తప్పుగా ఉంటే అధికారుల దృష్టికి తేవాలి. ప్రైవేట్ కాలేజీలు ఏ కారణంగానూ హాల్‌టికెట్లు నిరాకరించొద్దు. ఒకవేళ నిరాకరిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment