Krishna Aditya
-
జూనియర్ కాలేజీల అనుమతుల్లో పొరపాట్లు నిజమే!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీలకు అనుమతుల జారీలో నిబంధనలు పక్కాగా పాటిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీలకు అనుమతుల జారీలో పొరపాట్లు జరిగింది నిజమేనని అంగీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ, వాణిజ్య భవనాల్లో నిర్వహిస్తున్న 207 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 180 కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 27 కాలేజీల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని వివరించారు. శనివారం ఇంటర్మిడియట్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు. 2025–26 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో వసతులపై మరింత లోతుగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తామన్నారు. 3,246 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,246 జూనియర్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని కృష్ణ ఆదిత్య చెప్పారు. ఇందులో 424 ప్రభుత్వ కాలేజీలు, 1,346 ప్రభుత్వ రంగ కాలేజీలు, 1,476 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయని వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,336 మంది, రెండో సంవత్సరంలో 5,07,956 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని తెలిపారు. సోమవారం (3వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ పరీక్షల కోసం 1,812 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బైపీసీ నుంచి 98,952 మంది, ఎంపీసీ నుంచి 2,34,853 మంది కలిపి మొత్తం 3,33,805 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. వొకేషనల్ కేటగిరీకి సంబంధించి 463 కేంద్రాల్లో 95,247 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోర్డు కార్యాలయం నుంచి పరిశీలిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా ప్రతి జిల్లాకు ఒక డి్రస్టిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. సమస్యలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 92402 05555 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
పొలం గట్లపై కలెక్టర్ దంపతులు
సాక్షి, ఖమ్మం: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆయన సతీమణి జెడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి గురువారం పొలం గట్లపై కలియతిరిగారు. కామేపల్లి మండలం పొన్నెకల్లు-నెమలిపురి మధ్యలో ఉన్న బుగ్గవాగు చెక్ డ్యాం ఫీడర్ చానల్ పనులను ఆయన పరిశీలించారు. కట్టు కాలువ చూసేందుకు దారి లేకపోవడంతో పొలం గట్లపై కలెక్టర్ దంపతులు గంటసేపు నడిచి వెళ్లారు. వంతెన ఎక్కి వాగును దాటి... ఐటీడీఏ పీఓకు నీల్వాయివాగు కష్టాలు నీల్వాయివాగు కష్టాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) కృష్ణ ఆదిత్యకు కూడా తప్పలేదు. వాగు దాటడానికి 28 గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నిత్య కష్టాలను ఆయన చవిచూశారు. గురువారం ఇతర అధికారులతో కలసి మండలంలో ఆకస్మిక తనిఖీకి వచ్చారు. మార్గమధ్యలో ఉన్న నీల్వాయివాగు వరకు తన వాహనంలో వచ్చారు. వాగు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోగా వాగు దాటలేని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం. అక్కడే మామిడి తోటల్లో వాహనాలను నిలిపేసి పక్కనే ఉన్న అసంపూర్తి హైలెవల్ వంతెన వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు నిర్మించలేదు. ప్రజలు ఎక్కేందుకు కొద్దిపాటి మట్టి పోయించారు. వాహనాలు, బైక్‌లు కూడా దాటలేవు. వర్షాలకు మట్టి తడిసి రాకపోకలతో బురదగా మారింది. చేసేదేమీలేక ప్యాంట్, చెప్పులు పట్టుకుని.. వర్షంలో తడుస్తూ మోకాలు లోతు బురదలో జారుతూ అతికష్టం మీద 10 మీటర్ల వంతెనపైకి ఎక్కారు. దిగేచోటా అతికష్టంగా.. దిగారు. ప్రధాన రహదారి వరకు బురదలో నడుచుకుంటూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న ప్రైవేట్ వాహనం అద్దెకు మాట్లాడుకుని మండల కేంద్రానికి వచ్చి వెళ్లారు. -
కృష్ణ ఆదిత్యకు సివిల్స్‌లో99వ ర్యాంకు
నల్లగొండ అర్బన్ : నల్లగొండ పట్టణానికి చెందిన కె.కృష్ణ ఆదిత్యకు సివిల్స్‌లో 99వ ర్యాంకు దక్కింది. గురువారం వెల్లడించిన ఫలితాల్లో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు ఎస్.శంకర్రావు - సుజాత నల్లగొండలో లెక్చరర్లుగా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటుంది. వారి పెద్ద కుమారుడు కృష్ణ చైతన్య కూడా ఇప్పటికే ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. కృష్ణ ఆదిత్య స్థానిక ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో 1991 నుండి 2000వరకు 1నుండి 10వ తరగతి వరకు చదివాడు. 2002లో విజయవాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 2006లో హైదరాబాద్‌లో బీఈ పూర్తి చేశాడు. 2008లో ఎంబీఏ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్‌మెడల్ సాధించాడు. 2009లో గ్రూప్-1 లో 7వ ర్యాంకు సాధించి పోలీస్ అకాడమిలో డీఎస్పీగా శిక్షణ పూర్తి చేశాడు. 2012లో సివిల్స్ రాసి 747వ ర్యాంకు సాధించాడు. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ సాధించి ప్రస్తుతం సిమ్లాలో శిక్షణ పొందుతున్నా డు. నేడు విడుదల చేసిన 2013 సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించాడు. ఇద్దరు కుమారులు ఐఏఎస్ కావడం గర్వంగా ఉంది : శంకర్రావు- సుజాత మా ఇద్దరు కుమారులు ఐఏఎస్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. పెద్ద అబ్బాయి కృష్ణ చైతన్య 2012 సివిల్స్‌లో 143వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పొందుతున్నాడు. చిన్న అబ్బాయి కృష్ణ ఆదిత్య ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషకరం.