వచ్చే విద్యా సంవత్సరం పునరావృతం కాకుండా చర్యలు
3 నుంచి 22 వరకు 10 రోజులు ప్రాక్టికల్ పరీక్షలు
సమస్యల పరిష్కారానికి 92402 05555 టోల్‌ఫ్రీ నంబర్
ఇంటర్మిడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీలకు అనుమతుల జారీలో నిబంధనలు పక్కాగా పాటిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీలకు అనుమతుల జారీలో పొరపాట్లు జరిగింది నిజమేనని అంగీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ, వాణిజ్య భవనాల్లో నిర్వహిస్తున్న 207 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 180 కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 27 కాలేజీల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉందని వివరించారు. శనివారం ఇంటర్మిడియట్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు. 2025–26 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో వసతులపై మరింత లోతుగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తామన్నారు.
3,246 కాలేజీలకు అనుబంధ గుర్తింపు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,246 జూనియర్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని కృష్ణ ఆదిత్య చెప్పారు. ఇందులో 424 ప్రభుత్వ కాలేజీలు, 1,346 ప్రభుత్వ రంగ కాలేజీలు, 1,476 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయని వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,336 మంది, రెండో సంవత్సరంలో 5,07,956 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని తెలిపారు. సోమవారం (3వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ పరీక్షల కోసం 1,812 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
బైపీసీ నుంచి 98,952 మంది, ఎంపీసీ నుంచి 2,34,853 మంది కలిపి మొత్తం 3,33,805 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. వొకేషనల్ కేటగిరీకి సంబంధించి 463 కేంద్రాల్లో 95,247 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోర్డు కార్యాలయం నుంచి పరిశీలిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా ప్రతి జిల్లాకు ఒక డి్రస్టిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. సమస్యలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 92402 05555 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment