యాసంగి సీజన్‌కు విధివిధానాలు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున సాగు ‘యోగ్యమైన’భూములకు రైతుభరోసా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించి అందుకు అనుగుణంగా ఆర్థిక లెక్కలు వేసుకుంటోంది.
సాగు ‘యోగ్యత’ప్రకారం సగటున రాష్ట్రంలో కోటి ఎకరాలకు రైతుభరోసా పరిమితం అయ్యే అవకాశం ఉంది. రైతుల వద్ద ఉన్న సాగుయోగ్యమైన పట్టా భూములనే పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. గణతంత్ర దినోత్సవం నాటికి పూర్తిస్థాయి లెక్కలుకట్టి ఎకరాకు రూ. 6 వేల చొప్పున యాసంగికి రూ. 5,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు అమలు..
రాష్ట్రంలో సాగుచేసే భూములు 1.48 కోట్ల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇందులో వానాకాలం సీజన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్క జొన్నతోపాటు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు రికార్డు ఉంది. ఇంతకు మించి ఏ సీజన్‌లోనూ పంటల విస్తీర్ణం పెరగలేదు.
మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు అన్ని రకాల ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే ‘పార్ట్–బీ’కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి పార్ట్–బీని మినహాయించారు. అయినా 1.52 కోట్ల ఎకరాలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. అంటే 1.30 కోట్ల ఎకరాల సాగుభూమితోపాటు మరో 22 లక్షల ఎకరాల సాగులో లేని భూమికి కూడా రైతుబంధు లభించింది.
రెండు సీజన్‌లలో రైతుబంధు దక్కిన సాగులో లేని భూమి 97.51 లక్షల ఎకరాలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇటీవల రైతుబంధు పథకం లెక్కలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2023–24 సంవత్సరంలో ప్రభుత్వం రెండు సీజన్‌లకు కలిపి 97.51 లక్షల ఎకరాల్లోని సాగులో లేని భూమికి రూ. 4,875.62 కోట్లు చెల్లించిందని తెలిపారు. అంటే సగటున ఒక సీజన్‌కు 48.70 లక్షల ఎకరాలకుగాను రూ. 2,438 కోట్లు చెల్లించినట్లు చెప్పడం గమనార్హం. ఇందులో యాసంగి సీజన్‌లో సాగు చేయని భూముల లెక్కలు కూడా ఉన్నాయి. కొత్త పథకంలో వానాకాలంలో సాగై యాసంగిలో సాగు చేయని భూములకు కూడా రైతుభరోసా ఇవ్వనున్నారు.
అయితే రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకొని ‘పార్ట్–బీ’కేటగిరీ భూములతోపాటు రాళ్లు, రప్పులు, కొండలు, గుట్టలు, రోడ్లు, నాలా మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలగించి రైతుకు సంబంధించిన సాగు చేసే పట్టా భూములనే లెక్కతేల్చి పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనా ప్రకారం కోటి ఎకరాలలోపు భూములనే సాగుయోగ్యమైన పట్టా భూములుగా వ్యవసాయ శాఖ తేలి్చనట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి తుది జాబితాను ప్రభుత్వం రూపొందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment