మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ . చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
రైతు భరోసాకు ఏటా రూ. 12 వేలు పెట్టుబడి సాయం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
గుట్టలు, రాళ్లు, రోడ్లు, పరిశ్రమలు, నాలా కన్వర్షన్, ప్రభుత్వం సేకరించిన భూములకు వర్తించదు
భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా సాయం రూ.12,000
ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’గా నామకరణం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు ఇస్తున్నాం
రేషన్‌కార్డులు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త కార్డుల జారీ
జనవరి 26 నుంచి ఈ మూడు పథకాల అమలు ప్రారంభిస్తామని వెల్లడి
రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
వారికి రైతు భరోసా వర్తించదు..
రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు.
రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు..
రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు.
భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి..
‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు.
కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది
రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు.
కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయం
సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.
జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.
మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం.
కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్‌గా హోదా పెంపు.
Comments
Please login to add a commentAdd a comment