
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్‌ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్‌కతాలోని భవానిపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పీఎస్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్ రోడ్‌లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్‌ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్‌ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్‌ఎం హెచ్చరించింది.
నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది.
