Netaji death controversy
-
స్పై వస్తున్నాడు
నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. కె. రాజశేఖర్ రెడ్డి కథ అందించి, నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు గ్యారీ బీహెచ్. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘భారతదేశ అత్యుత్తమమైన రహస్య కథగా ‘స్పై’ మూవీ ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం,కన్నడ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జూన్ 29న విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా, ఆర్యన్ రాజేష్ ఓ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
నేతాజీ ఆచూకీ గురించి నేటికీ తెలియని మిస్టరీ!
న్యూఢిల్లీ: నేతాజీ మరణానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. అంతేకాదు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ బూడిదను డీఎన్ఏ విశ్లేషణకు పంపాలని తృణమాల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ...నేతాజీ ఆచూకీ గురించి నేటికీ మాకు తెలియదు. తాము అధికారంలోకి రాగానే దానిపై పని చేస్తామని కేంద్రం చెప్పింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను విడుదల చేసి, వర్గీకరించాం అని కేంద్రం పేర్కొంది. కానీ వాస్తవానికి అవి ఏం జరగలేదు. అని అన్నారు. అయితే నేతాజీ మరణానికి సంబంధించిన వివాదం బెంగాల్లో తీవ్ర భావోద్వేగ సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదని చాలామంది ఇప్పటికీ నమ్ముతుండటం విశేషం. అయితే 2017లో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆగస్ట్ 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు కేంద్రం ధృవీకరించింది. పైగా నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను నిర్వీర్యం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ఇంకోవైపు నేతాజీకి సంబంధించిన ఇంటెలీజెన్స్ బ్యూరో ఫైల్స్ ఇప్పటికీ ప్రజా బాహుళ్యంలో లేవని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రే "నేతాజీ ఫైల్స్" వర్గీకరణను డి-క్లాసిఫికేషన్ చేయాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు మన్‌కీ బాత్‌లో ఇండియా గేట్‌కి సమీపంలో దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మోదీ హామీ ఇచ్చారంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. (చదవండి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం) -
నేతాజీపై సమాచారం : రష్యా వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై తమ వద్ద రికార్డుల్లో ఎలాంటి సమాచారం లేదని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. నేతాజీకి సంబంధించిన సమాచారం గురించి 2014 నుంచి రష్యా ప్రభుత్వాన్ని భారత్ పలుమార్లు కోరుతున్న సంగతి తెలిసిందే. నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి పత్రాలు లేవని, భారత్ వినతి మేరకు పరిశోధన చేపట్టినా ఈ అంశంపై అధిక సమాచారం అందించే ఎలాంటి పత్రాలూ లభ్యం కాలేదని రష్యా ప్రభుత్వం వెల్లడించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ బుధవారం పార్లమెంట్లో పేర్కొన్నారు . ఆగస్ట్ 1945కు పూర్వం, ఆ తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నారా..? 1945 ఆగస్ట్‌లో ఆయన రష్యాకు పారిపోయారా అని భారత్ తెలుసుకోవాలని భావిస్తోంది. సహాయ నిరాకరణోద్యమానికి ప్రచారం చేపట్టిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటిష్ అధికారులు జైలులో పెట్టడంతో భారత్‌లో బ్రిటిష్ పాలనను కూలదోసేందుకు ఆయన 1941లో జర్మనీ నాజీ మద్దతు కోరేందుకు దేశం విడిచిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో సోవియట్ రష్యాలో మద్దతు కూడగట్టేందుకు నేతాజీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
'1945, ఆ తర్వాత బోస్ రష్యా వెళ్లారా?'!
లండన్: భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో పర్యటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో నేతాజీ విషయమై భారత్-రష్యా మధ్య కొనసాగిన లేఖలను బోస్ మనవడు ఆశిష్ రాయ్ లండన్‌లో విడుదల చేశారు. నేతాజీకి సంబంధించి భారత ప్రభుత్వం వర్గీకరించిన పత్రాల్లో ఈ లేఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. 1954లో నేతాజీ ఎక్కడున్నాడనే విషయమై 1991లో, 1995లో భారత్-రష్యా ప్రభుత్వాల మధ్య కొనసాగిన సంప్రదింపుల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. రికార్డుల ప్రకారం చూసుకుంటే 1945లోనే సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్టు భావిస్తున్నారు. అయితే 1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన రష్యాలోకి ప్రవేశించారా? అంటూ భారత్ ప్రభుత్వం ఆ దేశాన్ని ఆరాతీసింది. నేతాజీ రష్యాకు ఎప్పుడైనా వచ్చారా, అక్కడ నివసించారా అన్న విషయాలు తెలియజేయాలని కోరుతూ రష్యా ఫెడరేషన్‌కు 1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి 1992 జనవరిలో రష్యా ప్రత్యుత్తరమిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ తమ దేశంలో కొన్నిరోజులు ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది. 1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్ కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది. రెండు ప్రభుత్వాల మధ్య కొనసాగిన ఈ లేఖలు కొందరు అనుకుంటున్నట్టు నేతాజీ ముందే నిష్క్రమించలేదని స్పష్టం చేస్తున్నాయని ఆశిష్ రాయ్ పేర్కొన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే భారత్‌లో ఈ వాదనను చాలామంది విశ్వసించడం లేదు. ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతాజీ అదృశ్యంపై మిస్టరీని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార రహస్య పత్రాల వర్గీకరణ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.