'1945, ఆ తర్వాత బోస్ రష్యా వెళ్లారా?'!
లండన్: భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యాలో పర్యటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో నేతాజీ విషయమై భారత్-రష్యా మధ్య కొనసాగిన లేఖలను బోస్ మనవడు ఆశిష్ రాయ్ లండన్‌లో విడుదల చేశారు. నేతాజీకి సంబంధించి భారత ప్రభుత్వం వర్గీకరించిన పత్రాల్లో ఈ లేఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. 1954లో నేతాజీ ఎక్కడున్నాడనే విషయమై 1991లో, 1995లో భారత్-రష్యా ప్రభుత్వాల మధ్య కొనసాగిన సంప్రదింపుల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. రికార్డుల ప్రకారం చూసుకుంటే 1945లోనే సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్టు భావిస్తున్నారు.
అయితే 1945 లేదా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన రష్యాలోకి ప్రవేశించారా? అంటూ భారత్ ప్రభుత్వం ఆ దేశాన్ని ఆరాతీసింది. నేతాజీ రష్యాకు ఎప్పుడైనా వచ్చారా, అక్కడ నివసించారా అన్న విషయాలు తెలియజేయాలని కోరుతూ రష్యా ఫెడరేషన్‌కు 1991 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి 1992 జనవరిలో రష్యా ప్రత్యుత్తరమిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ తమ దేశంలో కొన్నిరోజులు ఉన్నట్టు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. మరో మూడేళ్ల తర్వాత మరోసారి కూడా భారత ప్రభుత్వం రష్యాకు లేఖ రాసింది. 1945, ఆ తర్వాత ఎప్పుడైనా నేతాజీ సోవియట్ యూనియన్ కు వచ్చారా, అక్కడ కొంతకాలం ఉన్నారా అన్నది పురాతత్వ, చారిత్రక విభాగాలను సమన్వయం చేసుకొని కచ్చితంగా నిర్ధారించాలని భారత్ కోరింది. అయినా రష్యా తన పాత సమాధానాన్నే పునరావృతం చేసింది.
రెండు ప్రభుత్వాల మధ్య కొనసాగిన ఈ లేఖలు కొందరు అనుకుంటున్నట్టు నేతాజీ ముందే నిష్క్రమించలేదని స్పష్టం చేస్తున్నాయని ఆశిష్ రాయ్ పేర్కొన్నారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే భారత్‌లో ఈ వాదనను చాలామంది విశ్వసించడం లేదు. ఆ తేదీన విమాన ప్రమాదం జరిగితే.. అందుకు ఆధారాలు చూపించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతాజీ అదృశ్యంపై మిస్టరీని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార రహస్య పత్రాల వర్గీకరణ చేపట్టాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.