Fake seed business
-
వరంగల్ లో నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్న పోలీసులు
-
మాయా విత్తనం
పెద్ద కంపెనీలూ కల్తీ విత్తనాలు అంటగట్టి మోసం చేయడం ఆవేదన కలిగిస్తోంది. కల్తీ విత్తనాలు ఏవో మాకు తెలియడంలేదు. రైతులకు ఇచ్చాక అవి మొలకెత్తకపోవడంతో వారు మమ్మల్ని నిలదీస్తున్నారు. ఈ విషయంపై వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాం. రీసైక్లింగ్ చేస్తున్న కంపెనీల వివరాలను అధికారులకు తెలియజేశాం. – పృథ్వీ, విత్తన డీలర్, ఖమ్మం కంపెనీలు విత్తనాలను కల్తీ చేస్తున్న వ్యవహారం మా దృష్టికి వచ్చింది. గడువు తీరిన వాటిలో కొన్ని విత్తనాలను మరోసారి లేబొరేటరీలో పరీక్షించి మొలకెత్తే లక్షణం ఉన్న వాటిని అమ్ముకోవడానికి అనుమతి ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా గడువు తీరిన విత్తనాలను గోదాముల్లో గుర్తించాం. వాటిని అలా ఉంచడం నేరం. విత్తనాలను రీసైక్లింగ్ చేయకూడదు. ఈ విషయంలో 15 కంపెనీలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. – రాహుల్ బొజ్జా, కమిషనర్, వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి పంట పండించే అన్నదాతలతో విత్తన కంపెనీలు ఆటలాడుతున్నాయి. కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ విత్తనం.. ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాం గం కుదేలవుతోంది. చిన్న కంపెనీలే కాకుండా బడా కంపెనీలు కూడా ఈ విత్తన దందా కొనసాగిస్తున్నాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆయా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉండటమే ఇందుకు కారణమనే ప్రచారం సాగుతోంది. భారీ కుంభకోణం... రాష్ట్రంలో రీసైక్లింగ్ విత్తన కుంభకోణం భారీగా జరుగుతోంది. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటలకు సంబంధించి రీసైక్లింగ్ చేసిన విత్తనాలనే పలు కంపెనీలు సరఫరా చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం నివ్వెరపరుస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడినా చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈ వ్యవహారం యధేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా 15 కంపెనీలపై చేసిన దాడుల్లో రీసైక్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో పలు పెద్ద కంపెనీలపైనా దాడులు చేయడానికి అనుమతించాలని కిందిస్థాయి సిబ్బంది కోరినా.. ఉన్నతస్థాయి నుంచి ఆమోదం రావడంలేదని తెలిసింది. వీరికి అనేకమంది పెద్దలు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయా కంపెనీలు చేయూత ఇవ్వడమే కారణమన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో వాటిపై కన్నెత్తి చూడడానికి కూడా వెనకాడుతున్నట్లు సమాచారం. రీసైక్లింగ్ ఇలా జరుగుతోంది.. రాష్ట్రానికి అవసరమైన హైబ్రీడ్ విత్తనాలను ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తుంటాయి. మొక్కజొన్న, వరి, బఠానీ, సోయాబీన్, పత్తి వంటి హైబ్రీడ్ రకాలన్నింటినీ కంపెనీలే అభివృద్ధి చేసి రైతులకు ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటాయి. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అనుమతి ఇస్తుంది. మొదటిసారి విక్రయించిన విత్తన ప్యాకెట్లకు ఏడాదిన్నర గడువు ఉంటుంది. ఆ గడువు తీరాక ఆయా విత్తనాలను తిరిగి డీలర్ల నుంచి కంపెనీలు వెనక్కి తీసుకోవాలి. అలా వెనక్కు తీసుకున్న విత్తనాలను లేబొరేటరీలో పరీక్షించిన తర్వాత అందులో మొలకెత్తే లక్షణాలున్న విత్తనాలను వేరుచేసి మరోసారి విక్రయించేందుకు ప్రత్యేక అనుమతి తీసుకుంటారు. అలాంటి విత్తనాలకు తొమ్మిది నెలల గడువుతో అమ్మడానికి వ్యవసాయశాఖ అనుమతి ఇస్తుంది. ఇలా రెండోసారి విక్రయించే విత్తన ప్యాకెట్లపై రీవాలిడేటెడ్ అని తప్పనిసరిగా ముద్రించాలి. కానీ కంపెనీలు మాత్రం అలా ముద్రించడంలేదు. పైగా వాటి గడువును ఏడాదిన్నరగా పేర్కొంటూ కొత్త విత్తనాలుగా మళ్లీ అమ్మేస్తున్నాయి. ఇక్కడితోనూ ఊరుకోవడంలేదు. ఇలా రెండోసారి గడువు తీరిన విత్తనాలను మూడోసారి కూడా రీసైక్లింగ్ చేసి రైతులకు అంటగడుతున్నాయి. ఇలాంటివాటిని కొత్త విత్తనాలతో కలిపేసి విక్రయిస్తున్నారని విజిలెన్స్ దాడుల్లో వెల్లడైంది. ఇలా కొత్త విత్తనాల్లో కాలం చెల్లిన విత్తనాలను కలపడం వల్ల మొత్తం విత్తనాలన్నీ కల్తీ అయిపోతాయని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడోసారి రీసైక్లింగ్ చేసిన తర్వాత ఏమాత్రం పనికిరాని విత్తనాలను బయో కంపెనీలకు విక్రయిస్తామంటూ వ్యవసాయశాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. కానీ అలా చేయకుండా వాటిని నాలుగోసారి రీసైక్లింగ్ చేసి కొత్త వాటితో కలిపి మళ్లీ విక్రయించి రైతులను నిలువునా ముంచేస్తున్నారు. పలు రాష్ట్రాలకూ సరఫరా.. తెలంగాణలో తయారయ్యే విత్తనాల్లో రాష్ట్రానికి సరిపోను మిగిలిన వాటిని దేశంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ రీసైక్లింగ్ విత్తనాలు తరలి వెళ్తున్నాయి. కేవలం ఒకే ఒక కంపెనీ సరఫరా చేసిన విత్తనాలే రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు సరిపడా ఉంటాయని సమాచారం. అంటే మొత్తం రాష్ట్రంలో సరఫరా చేసిన విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఏమాత్రం పనికిరాని విత్తనాలను గోదాముల్లోనే ఉంచకూడదు. ఒకవేళ ఉంటే, తమ వద్ద అలాంటి విత్తనాలు ఉన్నాయనే సమాచారాన్ని ఆయా కంపెనీలు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేయాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించడంలేదు. ఇటీవల జరిపిన దాడుల్లో అనేక కంపెనీల గోదాముల్లో ఈ విత్తనాలు కనిపించాయి. మేడ్చల్‌లో ఉన్న ఒక కంపెనీయే దాదాపు 1200 టన్నుల వివిధ రకాల రీసైక్లింగ్ విత్తనాలను సరఫరా చేసినట్లు తేలింది. మొత్తం 15 కంపెనీలు దాదాపు 20వేల టన్నుల రీసైక్లింగ్ విత్తనాలు సరఫరా చేసినట్లు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. -
నకిలీ కట్టడికి నిఘా
యాచారం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏ మూలనా నాసిరకమైన, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఏ దుకాణాల్లో నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరికితే ఆ దుకాణాన్ని సీజ్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేసి వ్యాపారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ముందుకు సాగుతోంది. వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయ శాఖ ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆయా డివిజన్లలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. గతేడాది నాసిరకమైన పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఏడీఏ, హయత్‌నగర్ ఏఓలను వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది. రెండోమారు తనిఖీలకు సిద్ధం.. జిల్లాలో మారోమారు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్లలోని తనిఖీల కోసం వ్యవసాయ శాఖ టీంలను ఏర్పాటు చేసింది. ఐదు డివిజన్లలోని ఓ డివిజన్‌కు చెందిన ఏడీఏ, ఏఓను టీంగా నియమించి మరో డివిజన్లోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక టీంలను నియమించిన వ్యవసాయ శాఖ ఎప్పుడైనా తనిఖీలకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఓ మారు తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈ నెల చివరలో, జూన్ మొదటి వారంలో తనిఖీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రైతు సమగ్ర సర్వే సందర్భంలోనూ నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలని ఆదేశాలను అధికారలు జారీచేశారు. ఏ మండలంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గానీ పట్టుబడితే ఆ మండల ఏఓతో పాటు ఆ గ్రామ ఏఈఓలపై చర్యలకు వెనుకాడేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో అత్యధికంగా పత్తి సాగు చేయనున్న దృష్ట్యా నకిలీ విత్తనాల సరఫరా ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 230 దుకాణాలపై ప్రత్యేక నీఘా.. జిల్లాలోని ఐదు డివిజన్లల్లో అనుమతులున్న 230 ఫర్టిలైజర్స్, సీడ్స్, ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్యవసాయ శాఖ నిఘా పెట్టింది. అనుమతులు పొందిన వ్యాపారులు నింబంధనల ప్రకారం మళ్లీ రెన్యూవల్ చేసుకున్నారా, క్రయ, విక్రయాలపై సరైన విధంగా రికార్డులు నమోదు చేస్తున్నారా, అధిక లాభాల కోసం అక్రమ పద్ధతిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసుకుంటున్నారా అనే విషయాలపై దృష్టి పెట్టింది. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతం నుంచి లక్షలాది ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను తెచ్చిన వ్యాపారులు అధిక లాభాల కోసం రైతులకు విక్రయించారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి లేక రైతులు నిండా మునిగారు. -
వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో దొంగ వ్యాపారం
► బీటీ పేరుతో లూటీ ► గుంటూరు అడ్డాగా యథేచ్ఛగా నకిలీ విత్తనాల విక్రయాలు ► ప్రధాన కంపెనీల బ్యాగుల పోలికతో మోసగిస్తున్న వైనం ► విజిలెన్స్ శాఖ దాడులతో వెలుగుచూస్తున్న అక్రమాలు ► పత్తి విత్తనాల విక్రయం రైతులను మోసగిస్తున్న వ్యాపారులు ► పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా విత్తనాలను తయారు చేసి అక్రమార్కులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులూ చెబుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి:- నకిలీ విత్తనాలకు గుంటూరు అడ్డాగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ప్రాంతాల నుంచి కొన్ని ప్రధాన కంపెనీలకు చెందిన జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో ఫెయిల్ అయిన విత్తనాలను తీసుకొచ్చి కొందరు వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. జిన్నింగ్ మిల్లులో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని శుభ్రం చేసి అందమైన ప్యాకెట్‌గా, ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టి రైతులకు అమ్ముతున్నారు. గత ఏడాది నిలువునా మునిగిన రైతులు... నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాల సరఫరా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. విత్తనాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొంత మంది వ్యాపారులు రైతులకు మాయ మాటలు చెప్పి నిలువునా మోసం చేస్తున్నారు.. విజిలెన్స్ దాడులతో.... పిడుగురాళ్లలోని రెండు దుకాణాల్లో‘ న్యూటన్’ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చింది. బీటీ అనుమతి లేకుండానే వర్ష 666, దివ్య 333 పేరుతో విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రెండు దుకాణాల నుంచి 946 ప్యాకెట్లు.. దాదాపు రూ.7.50 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జీఏసీ (జెనెటిక్ ఇంజినీర్ అప్రూవల్ కమిటీ)అనుమతి ఇస్తెనే బీటీ అనుమతి వస్తుంది. అలాంటి అనుమతులు ఈ విత్తనాలకు ఏమీ లేనట్టు తెలిసింది. వీరు ఓ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యాపారులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ వారు చెప్పిన విషయాలపై ఆరా తీయగా వీరికి 2014 నుంచి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేనట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చర్యలు తీసుకుంటున్నాం నకిలీ విత్తనాలను ఆరికట్టేందుక అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం.. పత్తి విత్తనాల కొరత లేదు.. జిల్లాలో 3.20 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. ఇప్పటికే జిల్లాలో 85 నుంచి 90 వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు డీలర్ల వద్దకు వచ్చాయి. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆథరైజ్డ్ డీలర్ల నుంచే బీటీ విత్తనాలు కొనుగోలు చేయాలి. - కృపాదాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు