ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపడుతున్న వ్యవసాయ శాఖ సిబ్బంది
యాచారం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏ మూలనా నాసిరకమైన, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఏ దుకాణాల్లో నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరికితే ఆ దుకాణాన్ని సీజ్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేసి వ్యాపారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ముందుకు సాగుతోంది. వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయ శాఖ ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆయా డివిజన్లలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. గతేడాది నాసిరకమైన పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఏడీఏ, హయత్‌నగర్ ఏఓలను వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది.
రెండోమారు తనిఖీలకు సిద్ధం..
జిల్లాలో మారోమారు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్లలోని తనిఖీల కోసం వ్యవసాయ శాఖ టీంలను ఏర్పాటు చేసింది. ఐదు డివిజన్లలోని ఓ డివిజన్‌కు చెందిన ఏడీఏ, ఏఓను టీంగా నియమించి మరో డివిజన్‌లోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక టీంలను నియమించిన వ్యవసాయ శాఖ ఎప్పుడైనా తనిఖీలకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఓ మారు తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈ నెల చివరలో, జూన్ మొదటి వారంలో తనిఖీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రైతు సమగ్ర సర్వే సందర్భంలోనూ నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలని ఆదేశాలను అధికారలు జారీచేశారు. ఏ మండలంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గానీ పట్టుబడితే ఆ మండల ఏఓతో పాటు ఆ గ్రామ ఏఈఓలపై చర్యలకు వెనుకాడేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో అత్యధికంగా పత్తి సాగు చేయనున్న దృష్ట్యా నకిలీ విత్తనాల సరఫరా ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
230 దుకాణాలపై ప్రత్యేక నీఘా..
జిల్లాలోని ఐదు డివిజన్లల్లో అనుమతులున్న 230 ఫర్టిలైజర్స్, సీడ్స్, ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్యవసాయ శాఖ నిఘా పెట్టింది. అనుమతులు పొందిన వ్యాపారులు నింబంధనల ప్రకారం మళ్లీ రెన్యూవల్ చేసుకున్నారా, క్రయ, విక్రయాలపై సరైన విధంగా రికార్డులు నమోదు చేస్తున్నారా, అధిక లాభాల కోసం అక్రమ పద్ధతిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసుకుంటున్నారా అనే విషయాలపై దృష్టి పెట్టింది. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతం నుంచి లక్షలాది ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను తెచ్చిన వ్యాపారులు అధిక లాభాల కోసం రైతులకు విక్రయించారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి లేక రైతులు నిండా మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment