crop season start
-
జూన్‌లో ఇంధన అమ్మకాలు జూమ్..
న్యూఢిల్లీ: పంటల సీజన్, ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన విక్రయాలు పెరుగుతున్నాయి. జూన్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. పంటల సీజన్ ప్రారంభ దశ కావడంతో డీజిల్ విక్రయాలు కరోనా ముందు స్థాయికి ఎగిశాయి. రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేశాయి. జూన్‌లో డీజిల్ అమ్మకాలు (2021 జూన్‌తో పోలిస్తే) 35.2 శాతం పెరిగి, 7.38 మిలియన్ టన్నులకు చేరాయి. 2019 జూన్‌తో (కరోనా పూర్వం) పోలిస్తే ఇది 10.5 శాతం, 2020 జూన్‌తో పోలిస్తే 33.3 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది మేలో నమోదైన 6.7 మిలియన్ టన్నులతో పోలిస్తే 11.5 శాతం అధికం. వ్యవసాయం, రవాణా రంగాల్లో వినియోగం పెరగడం వల్ల డీజిల్‌కు డిమాండ్ ఎగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ రిటైల్ సంస్థల్లో పెట్రోల్ విక్రయాలు జూన్‌లో 29 శాతం పెరిగి 2.8 మిలియన్ టన్నులకు చేరాయి. 2020 జూన్‌తో పోలిస్తే ఇది 36.7 శాతం, 2019 అదే నెలతో పోలిస్తే 16.5 శాతం అధికం. నెలవారీగా చూస్తే 3.1 శాతం ఎక్కువ. గతేడాది ఇదే వ్యవధిలో బేస్ తక్కువగా నమోదు కావడం కూడా జూన్‌లో గణాంకాలు మెరుగ్గా ఉండటానికి కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి. అటు, గత నెల వంట గ్యాస్ అమ్మకాలు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరాయి. విమానయాన రంగం రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు రెట్టింపై 5,35,900 టన్నులుగా నమోదయ్యాయి. విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో సుంకాల నష్టం దాదాపు భర్తీ .. దేశీయంగా ఉత్పత్తయ్యే, విదేశాలకు ఎగుమతి చేసే చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే దఖలు పడనుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు వల్ల వాటిల్లే సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని నాలుగింట మూడొంతుల మేర ప్రభుత్వం భర్తీ చేసుకోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు దాకా కొనసాగించిన పక్షంలో ఖజానాకు కనీసం రూ. 72,000 కోట్ల మేర ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
నకిలీ కట్టడికి నిఘా
యాచారం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏ మూలనా నాసిరకమైన, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఏ దుకాణాల్లో నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరికితే ఆ దుకాణాన్ని సీజ్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేసి వ్యాపారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ముందుకు సాగుతోంది. వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయ శాఖ ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆయా డివిజన్లలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. గతేడాది నాసిరకమైన పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఏడీఏ, హయత్‌నగర్ ఏఓలను వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది. రెండోమారు తనిఖీలకు సిద్ధం.. జిల్లాలో మారోమారు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్లలోని తనిఖీల కోసం వ్యవసాయ శాఖ టీంలను ఏర్పాటు చేసింది. ఐదు డివిజన్లలోని ఓ డివిజన్‌కు చెందిన ఏడీఏ, ఏఓను టీంగా నియమించి మరో డివిజన్లోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక టీంలను నియమించిన వ్యవసాయ శాఖ ఎప్పుడైనా తనిఖీలకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఓ మారు తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈ నెల చివరలో, జూన్ మొదటి వారంలో తనిఖీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రైతు సమగ్ర సర్వే సందర్భంలోనూ నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలని ఆదేశాలను అధికారలు జారీచేశారు. ఏ మండలంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గానీ పట్టుబడితే ఆ మండల ఏఓతో పాటు ఆ గ్రామ ఏఈఓలపై చర్యలకు వెనుకాడేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో అత్యధికంగా పత్తి సాగు చేయనున్న దృష్ట్యా నకిలీ విత్తనాల సరఫరా ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 230 దుకాణాలపై ప్రత్యేక నీఘా.. జిల్లాలోని ఐదు డివిజన్లల్లో అనుమతులున్న 230 ఫర్టిలైజర్స్, సీడ్స్, ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్యవసాయ శాఖ నిఘా పెట్టింది. అనుమతులు పొందిన వ్యాపారులు నింబంధనల ప్రకారం మళ్లీ రెన్యూవల్ చేసుకున్నారా, క్రయ, విక్రయాలపై సరైన విధంగా రికార్డులు నమోదు చేస్తున్నారా, అధిక లాభాల కోసం అక్రమ పద్ధతిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసుకుంటున్నారా అనే విషయాలపై దృష్టి పెట్టింది. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతం నుంచి లక్షలాది ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను తెచ్చిన వ్యాపారులు అధిక లాభాల కోసం రైతులకు విక్రయించారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి లేక రైతులు నిండా మునిగారు. -
ఆశల సాగు ఆరంభం
రైతులు తమ ఆశల సాగు ఆరంభించారు. ఉదయాన్నే పలుగు..పార పట్టి ఎద్దులు.. ట్రాక్టర్లతో పొలంబాట పట్టారు. ఏ మాయదారి తెగుళ్లు రాకుండా విత్తనాలకు మందులు చల్లి.. నాగళ్లతో దుక్కిదున్ని విత్తు వేశారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం, నరసనేకుంట, తాటిచెర్ల, కమ్మూరు గ్రామాల్లో గురువారం రైతులు ఇలా ముంగారు సేద్యం చేశారు. - సాక్షి ఫొటోగ్రాఫర్