Fake Seed Company
-
‘నకిలీ’ దందా !
బూర్గంపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఈ విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వేలాది నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టుబడుతున్నాయి. జిల్లాలో నిషేధిత బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు దొడ్డిదారిన సరఫరా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ దాడుల్లో తేటతెల్లమవుతోంది. టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు విత్తన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ దాడులు జరుగుతుండడంతో నకిలీ విత్తన వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశాలున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు విత్తన వ్యాపారులు.. ప్రభుత్వం నిషేధించిన బీజీ–3, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మే నెల మొదటి వారంలోనే నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అయ్యాయి. వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచి, రైతుల అవసరాలను బట్టి ప్యాకింగ్ చేయించి విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాలను రైతులకు నమ్మకం కలిగేలా అత్యంత పకడ్బందీగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు వాడితే పురుగు మందులు కొట్టే పని ఉండదని, ఒకవేళ చేలో కలుపు పడితే నిరభ్యంతరంగా గడ్డిమందు కొట్టుకోవచ్చని, పత్తి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులను నమ్మిస్తున్నారు. దీంతో కొందరు రైతులు వారి మాటలు నమ్మి ఈ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాది నకిలీ విత్తన ప్యాకెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీసులు, వ్యవసాయశాఖ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 3వేలకు పైగా నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. జిల్లాలో 15 మంది వ్యాపారులపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ దాడులతో అప్రమత్తమైన అక్రమ వ్యాపారులు తమ వద్దనున్న నకిలీ విత్తనాలను రహస్య ప్రాంతాలకు తరలించారు. కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లలోని అనేక మండలాల్లో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యాయి. ఈ సమాచారంతో వ్యవసాయ, పోలీస్‌శాఖలు అప్రమత్తమై సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులను ఇంకా విస్తృతం చేయాలని రైతులు కోరుతున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ముందే విక్రయాలు... జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవలేదు. ఎండలు మండిపోతున్నాయి. విత్తనాలు వేసేందుకు ఏ మాత్రం అనువైన వాతావరణం లేదు. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం గత పది రోజుల నుంచే గుట్టుచప్పుడు కాకుండా రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన కొందరు రైతులు తొలకరికి ముందే పొడి దుక్కుల్లో వేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోతే వేసిన విత్తనాలు నష్టపోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్లీ విత్తనాల కోసం పరుగులు తీస్తే నకిలీ విత్తనాలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు ఇప్పటి వరకు పత్తి విత్తనాల విక్రయాలకు వ్యవసాయశాఖ అనుమతులు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు ఖమ్మం నుంచి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. దీంతో స్థానిక విత్తన డీలర్లు తమ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో తమకు నమ్మకమైన రైతులకు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విత్తనాలను విక్రయిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం డివిజన్లో 25 శాతం మేర విత్తనాల విక్రయాలు జరిగాయి. సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి గింజలు వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అధికారులు రైతులు విత్తనాలు వేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంది. విత్తన విక్రయాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రత్యేక నిఘా పెడుతున్నాం నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి పంపించి నకిలీ విత్తనాల అమ్మకాలపై నిఘా పెట్టాం. రైతులు కూడా వర్షాలు పడిన తరువాతే విత్తనాలు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ అనుమతులు రాకుండా విత్తనాలు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌రావు, ఏడీఏ, మణుగూరు -
విత్తన కంపెనీల ప్రచార హోరు
బేల(ఆదిలాబాద్): ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో పత్తి విత్తన కంపనీలు ఊదరగొడుతున్నాయి. ప్రచార రథాలు, మైక్సెట్లు, కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తిస్తున్నాయి. ఆకర్షించేలా ప్రకటనలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ప్రచారం చేపడుతూ రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రైతులను సమీకరించి సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్నారు. అధిక దిగుబడి వస్తుందంటూ నమ్మబలుకుతూ బుట్టలో వేసుకుంటున్నారు. కొందరు దళారులు నకిలీ, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ బీటీ పత్తి విత్తనాలను సరఫరా చేసే కొన్ని సంస్థలు వందల రకాలను మార్కెట్లో ఇప్పటికే సంసిద్ధం చేశాయి. రైతులు అప్రమత్తంగా ఉండకపోతే పంటలు నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. నాణ్యమైన పత్తి బీటీ విత్తనం 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.730కు లభిస్తుండగా నకిలీ విత్తనాల ప్యాకెట్ రూ.400నుంచి రూ.600 వరకు విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొందరు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లకు పలు కంపనీలు విదేశీ, విహార యాత్రలకు అవకాశం కల్పిస్తూ అధిక మొత్తంగా విత్తనాలు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నకిలీ విత్తనాలపై నిఘా వేసి, పూర్తిస్థాయిలో అరికట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో.. జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూములున్నాయి. దీంతో ప్రధాన పంటగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,46,960 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతేడాది వర్షభావ పరిస్థితులు ఉండడంతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎక్కువ భూముల్లో నీటి సౌకర్యం లేకపోవడం, వర్షాధారంతో కూడా అధికంగా పత్తి పంట సాగు చేసే వీలుండటంతోనే కొన్నేళ్ల నుంచి పత్తిపంటపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కృత్రిమ కొరత ఇలా.. తొలకరి చినుకులు మొదలైతే రైతులు విత్తనాలకోసం విత్తన విక్రయకేంద్రాల ఎదుట బారులు తీరుతారు. ఇదే అదనుగా భావించి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు. ఇదే సమయంలో కొత్త రకం విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు అంటగడుతుంటారు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అప్పు రుపేణా.. జిల్లాలో కొంతమంది దళారులు రైతులకు అప్పు రూపేణా విత్తనాలు అందిస్తుంటారు. ఇలాంటి సమయంలో నకిలీ విత్తనాలు అంటగడుతుంటారు. వారు ఇచ్చే విత్తనాలు తీసుకోవడమే గానీ, కావాలనుకున్న కంపనీల విత్తనాలు ఇవ్వరు. పంట పండినా, పండకపోయినా పంట దిగుబడి వచ్చే సమయంలో ఇచ్చిన సరుకుకు వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙నకిలీ విత్తనాలను గుర్తించేందుకు వాటిని తయారు చేసిన కంపనీ పేరు, లోగో, బ్యాచ్, లాట్ నంబర్, తయారు చేసిన తేదీ, వాడకానికి గరిష్ఠ గడువు వంటివి ఖచ్చితంగా పరిశీలించాలి. ∙గుర్తింపు పొందిన డీలర్ల నుంచే కొనుగోలు చేయాలి. ∙ఐఎస్ఓ స్టీక్కర్ ఉందో లేదో గమనించాలి. ∙జెర్మినేషన్(మొలకెత్తే శాతం) వివరాలు చూడాలి. ∙ఎలాంటి అనుమానాలున్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. -
నకిలీపై నజర్
సాక్షి, వరంగల్ రూరల్: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయశాఖ మేలైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు. మే 25 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు. అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 35 నుంచి 40 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకు పైగా పలుకుతుండడంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఖరీఫ్ 59,484 హెక్టార్లలో మొత్తం సాగు చేశారు. ఈ ఏడు ఖరీఫ్‌కు పత్తి విత్తనాలు 6 లక్షలు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అంచనాలు పంపించింది. ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయశాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొంద రు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్ టెక్నాలజీ 2(బీటీ 2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది. తనిఖీలు.. నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజుగా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయశాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి. మండల, జిల్లాస్థాయిలో బృందాలు టాస్క్‌ఫోర్స్ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించనున్నారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు. -
నకిలీ కట్టడికి నిఘా
యాచారం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏ మూలనా నాసిరకమైన, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఏ దుకాణాల్లో నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరికితే ఆ దుకాణాన్ని సీజ్‌చేసి లైసెన్స్‌లు రద్దుచేసి వ్యాపారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ముందుకు సాగుతోంది. వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయ శాఖ ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఆయా డివిజన్లలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. గతేడాది నాసిరకమైన పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడిన వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఏడీఏ, హయత్‌నగర్ ఏఓలను వ్యవసాయ శాఖ సస్పెండ్ చేసింది. రెండోమారు తనిఖీలకు సిద్ధం.. జిల్లాలో మారోమారు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్లలోని తనిఖీల కోసం వ్యవసాయ శాఖ టీంలను ఏర్పాటు చేసింది. ఐదు డివిజన్లలోని ఓ డివిజన్‌కు చెందిన ఏడీఏ, ఏఓను టీంగా నియమించి మరో డివిజన్లోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక టీంలను నియమించిన వ్యవసాయ శాఖ ఎప్పుడైనా తనిఖీలకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఓ మారు తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈ నెల చివరలో, జూన్ మొదటి వారంలో తనిఖీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రైతు సమగ్ర సర్వే సందర్భంలోనూ నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలని ఆదేశాలను అధికారలు జారీచేశారు. ఏ మండలంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గానీ పట్టుబడితే ఆ మండల ఏఓతో పాటు ఆ గ్రామ ఏఈఓలపై చర్యలకు వెనుకాడేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో అత్యధికంగా పత్తి సాగు చేయనున్న దృష్ట్యా నకిలీ విత్తనాల సరఫరా ఉండే అవకాశం ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 230 దుకాణాలపై ప్రత్యేక నీఘా.. జిల్లాలోని ఐదు డివిజన్లల్లో అనుమతులున్న 230 ఫర్టిలైజర్స్, సీడ్స్, ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్యవసాయ శాఖ నిఘా పెట్టింది. అనుమతులు పొందిన వ్యాపారులు నింబంధనల ప్రకారం మళ్లీ రెన్యూవల్ చేసుకున్నారా, క్రయ, విక్రయాలపై సరైన విధంగా రికార్డులు నమోదు చేస్తున్నారా, అధిక లాభాల కోసం అక్రమ పద్ధతిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసుకుంటున్నారా అనే విషయాలపై దృష్టి పెట్టింది. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతం నుంచి లక్షలాది ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను తెచ్చిన వ్యాపారులు అధిక లాభాల కోసం రైతులకు విక్రయించారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి లేక రైతులు నిండా మునిగారు. -
నకిలీ విత్తన కంపెనీలను వదిలిపెట్టం: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతాంగాన్ని నిలువునా ముంచిన కంపెనీలను వదిలిపెట్టేది లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో మిర్చి, సోయాబీన్ పంటలు వేసిన రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని, అందుకే నకిలీ విత్తన కంపెనీలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంను కోర్టులో దాఖలు చేసినట్టుగా మంగళవారం వెల్లడించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న కోర్టు, రైతుల నష్టానికి విత్తన కంపెనీలు బాధ్యత వహించాల్సిందేనని, నకిలీ విత్తనాలతో ప్రమేయమున్న విత్తన కంపెనీలను కేసులో చేర్చాలని హైకోర్టు సూచించినట్టుగా రేవంత్ చెప్పారు. విత్తన కంపెనీలనూ ప్రతివాదులుగా చేయండి రేవంత్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాల వల్ల కలిగిన నష్టాన్ని సదరు కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖలు చేసిన వ్యాజ్యంలో విత్తన కంపెనీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ రేవంత్‌రెడ్డికి ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలంటే, విత్తన కంపెనీల వాదనలు వినడం తప్పనిసరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి అంగీకరించడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అనర్థమే
► జేఏసీ చైర్మన్ కోదండరాం ► ఈ నెల 23న రైతు దీక్ష...పోస్టర్ ఆవిష్కరణ ► నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని వదులుకుంటే ఆహార సంక్షోభంతో అనర్థం తప్పదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. రైతు సమస్యలపై ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే రైతు దీక్ష పోస్టర్‌ను జేఏసీ, రైతు జేఏసీ నేతలతో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ సరళీకరణ విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతును ఆదుకోవాలనే పట్టింపు ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పారిశ్రామికాభివృద్ధికి సమాంతరంగా వ్యవసాయరంగానికి చేయూతనందించాలని సూచించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో అశాంతి, అస్థిరత తలెత్తుతాయని హెచ్చరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై చేతివృత్తులు కూడా ఆధారపడి ఉన్నాయనే అంశాన్ని పాల కులు విస్మరిస్తున్నారని అన్నారు. చెరువుల్లోకి నీరు రావడంతో రైతులు గొర్రెలు కోసుకుంటూ, సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైందికాదని కోదండరాం అన్నారు. నీళ్లు రావడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని, ఆదాయం పెరగకుండా సంతోషం ఎక్కడిది? రైతు అందాల్సిన ఆదాయం గురించి ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టి, మేలైన విత్తనాలను అందించకుండా, సాగుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చకుండా, ఎరువులను సకాలంలో ఇవ్వకుండా, మార్కెట్లో దోపిడీని అరికట్టకుండా, ఆదాయం పెరగకుండా రైతు సంతోషంగా ఎలా ఉంటాడని కోదండరాం ప్రశ్నించారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి ఒక విధానాన్ని, నకిలీ విత్తనాలను అరికట్టడానికి విత్తనచట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో రైతుకు సగటున 94 వేల రూపాయల అప్పుందన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని విమర్శించారు. కావేరి, పయనీర్, మోన్శాంటో, నూజివీడు వంటి పెద్దపెద్ద కంపెనీలు నకిలీ విత్తనాల సరఫరా చేసినా కేసులు పెట్టడం లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే ఏటా రైతులు నష్టపోతారని ఆయన హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీ అతిపెద్ద కుంభకోణమని రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు విమర్శించారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుంటే వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. సమావేశంలో రైతు జేఏసీ నేతలు కన్నెగంటి రవి, పిట్టల రవీందర్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తన కంపెనీలతో సంబంధాలు
సీఎం కేసీఆర్ కుటుంబంపై మల్లు భట్టివిక్రమార్క ధ్వజం ► ఖమ్మంలో రైతు ఆక్రందన ధర్నా ► రైతుల గోడు వినకపోతే వారి ఆగ్రహానికి గురవుతారు ► మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి ► రైతులకు పరిహారం అందించకపోతే.. సీఎం ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం ఖమ్మం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబానికి నకిలీ విత్తన కంపెనీలతో సంబంధాలున్నాయని.. అందుకే ఆ కంపెనీలపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. పంటనష్టపోరుున రైతులకు పరిహారం అందించాలని, నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన రైతు ఆక్రందన ధర్నాలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఉదయం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో ప్రారంభమైన ఈ యాత్ర మధిర, వైరా నియోజకవర్గాల మీదుగా సుమారు 85 కిలోమీటర్ల మేర సాగి ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంది. విక్రమార్క మాట్లాడుతూ రెండేళ్లుగా రైతులు పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒకపక్క రైతులు పంట నష్టపోరుు ఇబ్బందుల పాలైతే వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రైతులు పండుగ చేసుకుంటున్నారని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పనిలేక పంటపొలాల్లో తిరుగుతున్నారని విమర్శలు చేసే మంత్రులు ఒక్కసారి పంటపొలాలను పరిశీలిస్తే పంటనష్టపోరుున రైతుల ఆవేదన తెలుస్తుందన్నారు. రైతు పక్షాన మాట్లాడుతుంటే వ్యవసాయ మంత్రి మాత్రం కాంగ్రెస్‌పార్టీది బ్రాందీ-గాంధీ వాదమని విమర్శిస్తున్నారని, ఆ వాదం ఎవరిదో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా విత్తన కంపెనీలకు లెసైన్సులు ఇవ్వడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలు సాగాయని, దీని వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే నకిలీ విత్తన కంపెనీలపై, లెసైన్సులు ఇచ్చిన ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నష్టానికి బాధ్యులైన వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంట్ అందించామన్నారు. అరుుతే, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం కేంద్రం అందించిన రూ.800 కోట్లను కాంట్రాక్టర్లకు కట్టబెడుతుందన్నారు. వెంటనే రైతులకు పంటనష్టపరిహారం అందించకపోతే అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని, సీఎం దొరక్కపోతే అవసరమైతే ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల ఆవేదన ఆక్రోషంలా మారకముందే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి దుదిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం నిద్ర మత్తులో తూగుతుందని, అందువల్లే రాష్ట్రంలోని రైతుల ఆక్రందనలు వారికి వినిపించడం లేదన్నారు. మిర్చి రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు, పత్తి రైతులు ఎకరాకు రూ.40 వేల వరకు నష్టపోయారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అరుుతం సత్యం, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తోపులాట ఎర్రుపాలెం మండలం జమలాపురం నుంచి ప్రారంభమైన రైతు ఆక్రందన యాత్ర సాయంత్రం ఖమ్మంకు చేరుకోగానే రోటరీ నగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం డీఎస్పీ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలోని ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించమని భట్టికి చెప్పారు. అరుుతే, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కార్యకర్తలు తొలగించేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం ర్యాలీని ముందుకు సాగించేం దుకు అనుమతి ఇవ్వడంతో ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంది. -
పీడీ యాక్ట్ పెట్టాలి
నకిలీ విత్తన కంపెనీలపై టీటీడీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న విత్తన కంపెనీలు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు డిమాండ్ చేశారు. ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా నిషేధించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం టీడీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అయితే నకిలీ విత్తన భాండాగారంగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. మిర్చి, పత్తి వంటి విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఆయా కంపెనీల ద్వారా రైతులకు ప్రభుత్వం ఇప్పించాలని లేదా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. శనగ విత్తనాల ధరను ఒకేసారి 90 శాతానికి పైగా పెంచి, రైతుకిచ్చే సబ్సిడీని 51 శాతం నుంచి 31 శాతానికి తగ్గించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సెప్టెం బర్ 20తో ముగిసిన ఖరీఫ్ కాలానికి రూ.17,800 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించగా, బ్యాంకులు రూ.8 వేల కోట్లు మాత్రమే రుణాలిచ్చాయన్నారు.