నకిలీపై నజర్‌ | Dealers Selling Fake Seeds Warangal | Sakshi
Sakshi News home page

నకిలీపై నజర్‌

Published Sat, May 18 2019 11:55 AM | Last Updated on Sat, May 18 2019 11:55 AM

Dealers Selling Fake Seeds Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఆశించిన ఫలితాలు.. నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తు. దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయశాఖ మేలైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం.. విత్తన అక్రమాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ.. ప్రభుత్వ శాఖల సహకారంతో ముందుకెళ్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతుండడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ ఆరంభంలో రైతులు పత్తి సాగు చేస్తారు. మే 25 తర్వాత వర్షం పడితే పత్తి సాగుకు పూనుకుంటారు.

అందుకోసం రైతులు ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకునే పనిలో ఉంటారు. ఈ ప్రాంతంలోని నేలల రకాలు, రైతుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విత్తన డీలర్లు దాదాపు 35 నుంచి 40 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. పత్తి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.6వేలకు పైగా పలుకుతుండడంతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి కనబరిచే అవకాశాలున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఖరీఫ్‌ 59,484 హెక్టార్లలో మొత్తం సాగు చేశారు.

ఈ ఏడు ఖరీఫ్‌కు పత్తి విత్తనాలు 6 లక్షలు అవసరం ఉంటుందని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అంచనాలు పంపించింది. ఒక్కో ఎకరానికి 2 విత్తన ప్యాకెట్లు వినియోగించాల్సి ఉండగా అందులో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్‌ ధర ఈ ఏడాది రూ.730 చొప్పున నిర్ణయించారు. వ్యవసాయశాఖతోపాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. గతంలో కొంద రు అనుమతులు లేకుండా పలు కంపెనీలకు చెందిన నకిలీ విత్తనాలను విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బోల్‌గార్డ్‌ టెక్నాలజీ 2(బీటీ 2) పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉంది. అలాంటిది.. గత ఏడాది బీటీ–3 విత్తనాల విక్రయం కూడా జరిగింది.

తనిఖీలు..
నకిలీ, అక్రమంగా విత్తనాలను విక్రయించకుండా, రైతులు ఆ విత్తనాల బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి గతంలో జిల్లాకు నకిలీ విత్తనాలు వివిధ కంపెనీల పేరిట వచ్చిన, విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థ పునరావృతం కాకుండా వ్యవపాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. వివిధ కంపెనీల పేరిట, ఎలాంటి కంపెనీల పేరు లేకుండా లూజుగా ఉన్న విత్తనాలను విక్రయించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఇటువంటి అక్రమార్కులను నిలువరించేందుకు వ్యవసాయశాఖ తనిఖీ బృందాలను నియమించే చర్యలకు పూనుకుంది. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించే చర్యలు చేపట్టారు. బృందాలతోపాటు విజిలెన్స్‌ బృందాలు కూడా జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటాయి.

మండల, జిల్లాస్థాయిలో బృందాలు
టాస్క్‌ఫోర్స్‌ బృందాలను మండల, జిల్లాస్థాయిల్లో నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వ్యవసాయ శాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారులుంటారు. ఒక మండల, వ్యవసాయ డివిజన్‌ అధికారిని మరో మండల, వ్యవసాయ డివిజన్‌కు తనిఖీ బాధ్యులుగా నియమించనున్నారు. బృందంలో స్థానిక రెవెన్యూ అధికారి, ఓ పోలీస్‌ అధికారిని కూడా నియమించుకుంటారు. కలెక్టర్‌ సూచనల మేరకు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాస్థాయి తనిఖీ బృందాన్ని నియమించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement