వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో దొంగ వ్యాపారం
► బీటీ పేరుతో లూటీ
► గుంటూరు అడ్డాగా యథేచ్ఛగా నకిలీ విత్తనాల విక్రయాలు
► ప్రధాన కంపెనీల బ్యాగుల పోలికతో మోసగిస్తున్న వైనం
► విజిలెన్స్ శాఖ దాడులతో వెలుగుచూస్తున్న అక్రమాలు
► పత్తి విత్తనాల విక్రయం రైతులను మోసగిస్తున్న వ్యాపారులు
► పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా విత్తనాలను తయారు చేసి అక్రమార్కులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులూ చెబుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, అమరావతి:- నకిలీ విత్తనాలకు గుంటూరు అడ్డాగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ప్రాంతాల నుంచి కొన్ని ప్రధాన కంపెనీలకు చెందిన జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో ఫెయిల్ అయిన విత్తనాలను తీసుకొచ్చి కొందరు వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. జిన్నింగ్ మిల్లులో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని శుభ్రం చేసి అందమైన ప్యాకెట్‌గా, ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టి రైతులకు అమ్ముతున్నారు.
గత ఏడాది నిలువునా మునిగిన రైతులు...
నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాల సరఫరా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. విత్తనాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొంత మంది వ్యాపారులు రైతులకు మాయ మాటలు చెప్పి నిలువునా మోసం చేస్తున్నారు..
విజిలెన్స్ దాడులతో....
పిడుగురాళ్లలోని రెండు దుకాణాల్లో‘ న్యూటన్’ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చింది. బీటీ అనుమతి లేకుండానే వర్ష 666, దివ్య 333 పేరుతో విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రెండు దుకాణాల నుంచి 946 ప్యాకెట్లు.. దాదాపు రూ.7.50 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
జీఏసీ (జెనెటిక్ ఇంజినీర్ అప్రూవల్ కమిటీ)అనుమతి ఇస్తెనే బీటీ అనుమతి వస్తుంది. అలాంటి అనుమతులు ఈ విత్తనాలకు ఏమీ లేనట్టు తెలిసింది. వీరు ఓ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యాపారులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
విజిలెన్స్ వారు చెప్పిన విషయాలపై ఆరా తీయగా వీరికి 2014 నుంచి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేనట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
చర్యలు తీసుకుంటున్నాం
నకిలీ విత్తనాలను ఆరికట్టేందుక అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం.. పత్తి విత్తనాల కొరత లేదు.. జిల్లాలో 3.20 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. ఇప్పటికే జిల్లాలో 85 నుంచి 90 వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు డీలర్ల వద్దకు వచ్చాయి. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆథరైజ్డ్ డీలర్ల నుంచే బీటీ విత్తనాలు కొనుగోలు చేయాలి. - కృపాదాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు