Minister prattipati pullaravu
-
మేం రమ్మంటేనే రండి!
► బదిలీ అయిన ఉద్యోగులకు స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులు ► కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోని వైనం ► అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం ఉద్యోగుల క్యూ ► జాబితాలు సిద్ధం చేసి పంపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం క్లైమాక్స్‌కు చేరింది. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధి అనుమతి లేనిదేఅక్కడ ఉద్యోగంలో చేరేందుకు కుదరని పరిస్థితి. నిబంధనలు బేఖాతరు చేస్తూ తమకు అనుకూలంగా లేనివారిని వేరే చోటికి పంపించడంతో పాటు తమవారికి పోస్టింగులు ఇప్పించు కోవడానికి నేతలు రంగం సిద్ధం చేశారు. సోమవారంతో బదిలీలకు గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రెవెన్యూశాఖలో ఇటీవల జిల్లా కలెక్టర్ నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలో కొంత మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. పిట్టలవానిపాలెం, రొంపిచర్ల, నకరికల్లుకు బదిలీ అయిన తహసీల్దార్లను స్థానిక ప్రజా ప్రతినిధులు జాయిన్ కావద్దని ఒత్తిడి తేవడంతో వారికి ఎటూ పాలుపోవడంలేదు. తమకు తెలియకుండా ఎలా వస్తారని, తమకు నచ్చిన వారిని తామే ఇక్కడకు తెప్పించుకుంటామని వారితో తేల్చి చెప్పడంతో బదిలీ అయిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి రావెల్ కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో ఓ భూమి వ్యవహారంలో తహసీల్దారు కోర్టు ఆదేశాలను అమలు చేసి మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. సెలవులో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో ఆ తహసీల్దార్‌కు బదిలీ తప్పేలాలేదు. రొంపిచర్ల తహసీల్దార్‌కు పదవీ విరమణకు గడువు కేవలం రెండు నెలలు ఉంది. పదవీ విరమణకు ఆరునెలల లోపు సర్వీసు ఉన్న వారిని అధికారికంగా బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన్ను దుర్గిరాలకు బదిలీ చేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ బదిలీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించినా ఆయన ఆదేశాలు పట్టించుకోక పోవడం గమనార్హం. రెవెన్యూ శాఖలో అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకు 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు వివరాలు పంపించాల్సిందిగా డివిజన్, మండల కార్యాలయాలకు కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బదిలీల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంపీడీవోల బదిలీల్లో సైతం... జిల్లాలో ఎంపీడీవోల బదిలీల్లో సైతం తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నట్టు సమాచారం. బదిలీలకు సంబంధించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ సమావేశమై చర్చించినట్లు తెలిసింది. 20 శాతం అంటే దాదాపు 15 మందికి పైగా ఎంపీడీవోలకు స్థానచలనం తప్పదని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట మండల ఎంపీడీవోను బదిలీ చేయాలని సూచించినట్టు తెలిసింది. స్థానిక ఎంపీపీకి, ఎంపీడీవోకు నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న వట్టిచెరుకూరు మండల ఎంపీడీవోను సైతం తమ మాట ఖాతరు చేయడం లేదని ఇప్పటికే బదిలీ చేయాలని ఆధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ స్థానంలో పిడుగురాళ్ల ఎంపీడీవోను సిఫార్సు చేసినట్టు సమాచారం. ప్రత్తిపాడు ఎంపీడీవో గుంటూరు రూరల్ ఎంపీడీవోగా వచ్చేందుకు మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మేడికొండూరు ఎంపీడీవో సైతం ఈ నెల చివరికి రిటైర్ అవుతున్నారు. బొల్లాపల్లి, మాచవరం ఎంపీడీవోలు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నూజెండ్ల, దాచేపల్లి, పెదనందిపాడు మండల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాపట్ల, మంగళగిరి మండలాల ఎంపీడీవోలు బదిలీలకోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా బదిలీల ప్రక్రియ ఆన్‌లైనా, మాన్యువలా అన్న సందిగ్ధం ఉద్యోగుల్లో నెలకొంది. రేపటితో ముగియనున్న బదిలీల దరఖాస్తు గడువు బదిలీల దరఖాస్తు గడువు సోమవారంతో ముగుస్తుండడంతో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం కోసం అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను పంపినట్టు సమాచారం. -
వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో దొంగ వ్యాపారం
► బీటీ పేరుతో లూటీ ► గుంటూరు అడ్డాగా యథేచ్ఛగా నకిలీ విత్తనాల విక్రయాలు ► ప్రధాన కంపెనీల బ్యాగుల పోలికతో మోసగిస్తున్న వైనం ► విజిలెన్స్ శాఖ దాడులతో వెలుగుచూస్తున్న అక్రమాలు ► పత్తి విత్తనాల విక్రయం రైతులను మోసగిస్తున్న వ్యాపారులు ► పట్టించుకోని వ్యవసాయశాఖ అధికారులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా విత్తనాలను తయారు చేసి అక్రమార్కులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఈ నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు విజిలెన్స్ అధికారులూ చెబుతున్నారు. కట్టడి చేయాల్సిన వ్యవసాయశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి:- నకిలీ విత్తనాలకు గుంటూరు అడ్డాగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ప్రాంతాల నుంచి కొన్ని ప్రధాన కంపెనీలకు చెందిన జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)లో ఫెయిల్ అయిన విత్తనాలను తీసుకొచ్చి కొందరు వ్యాపారులు విక్రయాలు చేపట్టారు. జిన్నింగ్ మిల్లులో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వాటిని శుభ్రం చేసి అందమైన ప్యాకెట్‌గా, ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టి రైతులకు అమ్ముతున్నారు. గత ఏడాది నిలువునా మునిగిన రైతులు... నకిలీ విత్తనాల వల్ల గత ఏడాది పల్నాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. నకిలీ విత్తనాల విక్రయాల సరఫరా నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని వ్యవసాయశాఖ చెబుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. విత్తనాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ కొంత మంది వ్యాపారులు రైతులకు మాయ మాటలు చెప్పి నిలువునా మోసం చేస్తున్నారు.. విజిలెన్స్ దాడులతో.... పిడుగురాళ్లలోని రెండు దుకాణాల్లో‘ న్యూటన్’ కంపెనీ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ దాడులతో వెలుగులోకి వచ్చింది. బీటీ అనుమతి లేకుండానే వర్ష 666, దివ్య 333 పేరుతో విత్తనాలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. రెండు దుకాణాల నుంచి 946 ప్యాకెట్లు.. దాదాపు రూ.7.50 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జీఏసీ (జెనెటిక్ ఇంజినీర్ అప్రూవల్ కమిటీ)అనుమతి ఇస్తెనే బీటీ అనుమతి వస్తుంది. అలాంటి అనుమతులు ఈ విత్తనాలకు ఏమీ లేనట్టు తెలిసింది. వీరు ఓ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నట్లు వ్యాపారులు విజిలెన్స్ అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజిలెన్స్ వారు చెప్పిన విషయాలపై ఆరా తీయగా వీరికి 2014 నుంచి ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేనట్టు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చర్యలు తీసుకుంటున్నాం నకిలీ విత్తనాలను ఆరికట్టేందుక అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం.. పత్తి విత్తనాల కొరత లేదు.. జిల్లాలో 3.20 లక్షల ప్యాకెట్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. ఇప్పటికే జిల్లాలో 85 నుంచి 90 వేల ప్యాకెట్ పత్తి విత్తనాలు డీలర్ల వద్దకు వచ్చాయి. నకిలీ విత్తనాలతో మోసపోకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆథరైజ్డ్ డీలర్ల నుంచే బీటీ విత్తనాలు కొనుగోలు చేయాలి. - కృపాదాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు -
ప్రకృతి వ్యవసాయానికి చేయూత
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి కొరిటెపాడు(గుంటూరు): సహజ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక కృషిభవన్‌లో సహజ వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సహజ వ్యవసాయంపై రాష్ట్ర వ్యాప్తంగా 39 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్‌కు 300 మంది రైతులను కేటాయింంచి, మొత్తం 39 వేల మంది రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడింంచారు. దీనిలో భాగంగా ఆవు కొనుగోలుకు ప్రభుత్వం రూ.10 వేలు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని సూచించారు. పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతులు, పొగాకు మ్యాన్ఫాక్చర్స్, ఎక్స్‌పోర్టర్లతో కలసి శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడే జిల్లాల్లో గుంటూరు ప్రథమ స్థానంలో ఉందన్నారు. భూములు నిస్సారంగా మారుతున్నాయని చెప్పారు. సహజ వ్యవసాయంలో దిగుబడి తగ్గినా ధరలు అధికంగా ఉంటాయని తెలిపారు. జేడీఏ కృపాదాసు, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి, వ్యవసాయాధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
నీ హామీ బంగారం గానూ!
తాకట్టు బంగారం.. ఇంటికి రానట్టే! నోటీసులు అందుకున్న 69 వేల మంది రైతన్నలు రూ.360 కోట్ల మేర ఇప్పటికీ మాఫీ కాని వైనం వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చేసుకోవాల్సిన దుస్థితి కొత్తపల్లి ఎస్బీఐలో ఇప్పటికే బంగారం వేలం మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారా? ఆ బంగారం మీ ఇంటికి రావాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యండి.’ అంటూ ఎన్నికల ముందు ఎడాపెడా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా జిల్లాలో ఏకంగా 69వేల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. వీరంతా బ్యాంకుల్లో ఉంచిన తమ బంగారం వేలం కాకుండా కాపాడుకునేందుకు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు చేసి మరీ రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు ఇప్పటికీమాఫీ కాకపోవడంతో వీరంతా వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోవడమో.. ఆ పరిస్థితి లేకపోతే వేలంలో బంగారాన్ని కోల్పోవడమో జరిగింది. జిల్లాలో సుమారు 50 నుంచి 60 మేరకు వేలం ప్రకటనలు వెలువడ్డాయి. ఆత్మకూరు కొత్తపల్లి మండలంలో ఎస్బీఐ బ్యాంకు ఏకంగా 12 మందికి చెందిన బంగారు నగలను వేలం వేసి విక్రయించింది. మరోవైపు ఆస్పరి మండలంలో ఏకంగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినప్పటికీ బంగారు నగలను వేలం వేసినట్టు తమ దృష్టికి రాలేదని అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొనడం పట్ల జిల్లా రైతాంగం భగ్గు మంటోంది. 69 వేల మందికి నోటీసులు జిల్లాలో మొత్తం లక్షా 21 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.625 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాలన్నీ కేవలం జాతీయ బ్యాంకులల్లో తీసుకున్నవే. ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టినవి వీటికి అదనం. అయితే, ఎన్నికల నేపథ్యంలో బంగారం రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. రుణాలను సకాలంలో చెల్లించలేదు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత బంగారం పెట్టి తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయలేదు. ఫలితంగా సమయం మించిపోయినప్పటికీ రుణాలను చెల్లించలేదంటూ రైతులకు నోటీసుల పర్వం మొదలయింది. అంతేకాకుండా పత్రికల్లో అన్నదాతల పేర్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. రుణాలు చెల్లించకపోవడంతో బంగారాన్ని వేలం వేస్తామని ప్రకటించారు. ఈ విధంగా 69వేల మందికి చెందిన రూ.360 కోట్ల రుణాలను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాకుండా వీరి పేర్లను బ్యాంకుల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. ఈ విధంగా జిల్లాలో 69 వేల మంది అన్నదాతలకు బ్యాంకర్ల నుంచి నోటీసులు అందాయి. వీరు తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు మాఫీ కాలేదు. రూ.265 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయినట్టు తేల్చారు. వీరికి కూడా సదరు మొత్తం ఇంకా బ్యాంకులో డిపాజిట్ కాని పరిస్థితి. ఫలితంగా వీరిలోనూ కొందరు నోటీసులు అందుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఆత్మగౌరవంతో ఆటలు వాస్తవానికి అన్నదాతలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తారు. ఏకంగా తమ పేర్లతో పాటు పత్రికల్లో ప్రకటనలు రావడం, రుణాలు కట్టకపోతే బంగారాన్ని వేలం వేస్తామనడం, బ్యాంకుల ముందు నోటీసు బోర్డుల్లో తమ పేర్లు ప్రత్యక్షం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతినింది. దీంతో అనేక మంది రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేసి మరీ రుణాలను తీర్చేశారు. మరికొంతమంది అధిక వడ్డీకి రుణాలను రీ-షెడ్యూల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆలూరు నియోజకవర్గం.. ఆస్పరి మండలంలో నాగలింగడు అనే రైతు ఎస్బీఐ బ్యాంకులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 3 తులాల బంగారాన్ని పెట్టి తీసుకున్న రూ.28 వేల రుణం తీర్చలేదంటూ ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది వేలానికి సిద్ధం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతిని ఈ పనికి పూనుకున్నారు. వడ్డీకి తెచ్చి కట్టినా.. నాకు 4 ఎకరాల పొలం ఉంది. 2012లో ఎస్బీఐ మార్కెట్‌యార్డు బ్రాంచ్‌లో రూ.35వేల అప్పు తీసుకున్నా. పెట్టుబడులకు చాలక భార్య ఆభరణాలను ఐసీఐసీఐ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి మరో రూ.95వేలు అప్పు చేసినా. ఎన్నికల ముందు చంద్రబాబు తాకట్టు రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పడంతో వడ్డీ కూడా కట్టలేదు. ప్రభుత్వం వచ్చినాక ఎస్బీఐలో రూ.7వేలు మాత్రమే మాఫీ అయింది. తాకట్టు అప్పును చెల్లించకపోతే నగలను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించినారు. దిక్కుతోచక బయట వ్యాపారి వద్ద రూ.3లకు వడ్డీకి తెచ్చి రూ.1.20లక్షలు చెల్లించినా. చంద్రబాబు మాటలు నమ్మి దారుణంగా మోసపోయినా. - రామదాసు, కల్లుబావి రైతు, ఆదోని కుమార్తె బంగారు పోగొట్టా 2013లో కుటుంబ అవసరాలు, పంటల సాగుకు భార్య సొత్తుతో పాటు అల్లునికి నచ్చజెప్పి కుమార్తెకు చెందిన 60 గ్రాముల బంగారు బ్యాంకులో పెట్టిన. రూ.1.20 లక్షల రుణం తీసుకున్నా. ఆ ఏడాది పంటలు సరిగా పండకపోవడంతో వడ్డీ కూడా కట్టలేకపోయిన. మరుసటి యేడు సాగు చేసిన పంటలు కూడా చేతికి అందల్యా. అప్పుడే వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పంట రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రాణం లేసొచ్చింది. కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తి. ప్రభుత్వం వచ్చినాక కూడా అదిగో.. ఇదిగో అని సెప్పి లాస్టుకి పైస కూడా మాఫీ చేయల్యా. మూడు సంవత్సరాలు వడ్డీ కూడా కట్టలేదని బ్యాంకోల్లు బంగారం వేలం ఏసిరి. చంద్రబాబు మాట నమ్మి నా కూతురి బంగారం పోగొట్టిన. - మూరబోయిన నరసింహుడు, తువ్వపల్లె రైతు, రుద్రవరం -
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
► బంగారం రుణాలపై బ్యాంకుల నోటీసులు ► మంత్రి తెలియదనడంపై మహిళల మండిపాటు ► బాబును నమ్మినందుకు నట్టేట ముంచారని శాపనార్థాలు ► ఏడాది క్రితం తీసుకున్న అప్పులూ చెల్లించాలని అప్పుడే ఒత్తిడి తెనాలి : ‘వస్తున్నా....మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు దగాపడ్డారు. ‘ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు...మీ నగలు మీరు తీసుకుందురు’ అనే వాగ్దానాలకు పొంగిపోయిన ఆడపడుచులు తీవ్రంగా భంగపడ్డారు. అధికారంలోకి వచ్చాక బాబు తీరు మారిపోయింది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణ పరిమితి తగ్గించి, వాయిదాల పద్ధతిలో మాఫీ అన్న ముఖ్యమంత్రి మాటల గారడీకి అంతా నివ్వెర పోయారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినవారిపై ప్రభుత్వ పెద్దలు బుకాయింపునకు దిగుతున్నారు. బంగారు నగలపై రుణాలు తీసుకున్న ఖాతాదారులకు బ్యాంకులు మళ్లీ ఇప్పుడు వేలం నోటీసులు పంపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని బుధవారం శాసనసభలో ప్రస్తావిస్తే, అటువంటి సమాచారమేదీ తనకు తెలియదని రా్రష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిస్సిగ్గుగా ప్రకటించటం చూసిన ప్రజలు మండిపడుతున్నారు. ఏడాదిగా కరవు ఛాయలు.. జిల్లాపై ఏడాదిగా కరవు ఛాయలు ముసురుకున్నాయి. ఖరీఫ్‌లో వరి, పత్తి, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గాయి. ఫలితంగా జిల్లాలోని రైతులు రూ.800 కోట్లకు పైగా నష్టపోయివుంటారని అంచనా. ప్రస్తుత రబీలోనూ పంటల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతులు ఎందరికో చంద్రబాబు హామీనిచ్చినట్టు రుణమాఫీ జరగలేదు. అన్ని లెక్కలు సరిచూసుకుని మాఫీ పరిధిలోకి వచ్చిన రైతులకు తొలి విడతగా ఖాతాలో పడిన డబ్బులు కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు. శాపనార్థాలు పెడుతున్న మహిళలు... గురజాల దగ్గర్లోని మాడుగులకు చెందిన కౌలురైతు సంకురాత్రి భూదేమ్మను రుణమాఫీపై కదిలిస్తే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూడేళ్ల క్రితం గురజాల ఎస్బీఐలో నగలు తాకట్టుపెట్టి రూ.35 వేల రుణం తీసుకుంది. బాబు హామీని నమ్మినందుకు రుణమాఫీ చేయకపోగా తన నగలను వేలం వేశారని తెలుసుకుని నివ్వెరపోయినట్టు చెబుతూ శాపనార్థాలు పెట్టసాగింది. తెనాలి సమీపంలోని కొలకలూరు మహిళ రమాదేవి మూడేళ్ల క్రితం రూ.54 వేలు రుణం తీసుకున్నారు. ఇప్పటికి రూ.37 వేలు వడ్డీకింద చెల్లించినా, రుణమాఫీ కాలేదనీ, ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ప్రకటన వ్యయం రైతునెత్తిపైనే... బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు కలవరపడుతూ ఏదొకవిధంగా వడ్డీ చెల్లిస్తామని వెళితే ప్రతికలో వేలం ప్రకటన వ్యయాన్ని కూడా వారినుంచి బ్యాంకులు రాబడుతున్నాయి. పత్రికలో వేసినందుకంటూ తననుంచి రూ.750 అదనంగా వసూలుచేశారని సింగరయ్య అనే మరో రైతు చెప్పటం ఇందుకు నిదర్శనం. వార్షిక సంవత్సరం ఆఖరు కావటంతో బ్యాంకులన్నీ కొద్దిరోజులుగా బంగారు ఆభరణాల నగల వేలం నోటీసులను పంపుతున్నాయి.జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల రైతులు వీటిని అందుకుంటున్నారు. బాబు రుణమాఫీ హామీ కారణంగా బ్యాంకులకు ఎదురైన చేదు అనుభవాలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదిక్రితం తీసుకున్న రుణాలనూ చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులతో ఒత్తిడిచేస్తున్నట్టు కొలకలూరు రైతు శివనాగేంద్రం చెప్పారు. వాస్తవాలిలా ఉంటే, ఇప్పటికీ రుణాలు మాఫీ కాని రైతులు ఉన్నారనీ, నగలపై రుణాల చెల్లింపు డిమాండుతో నోటీసులు జారీచేస్తున్నారని తెలియదని స్వయానా మంత్రి చెప్పటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోటీసుల పేరుతో బ్యాంకుల ఒత్తిడి... ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు వేలం నోటీసులు పంపటం, వేలం ప్రకటనలను పత్రికల్లో ప్రచురించటం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఖరీఫ్‌లో పంట రుణాలతో పెట్టుబడులు సరిపోక, స్థానికంగా ఉండే రైతులు, వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నారు. పంటలు వచ్చే ముందు చివరి విడత అవసరాలకు బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పు తీసుకున్నారు. దాదాపు 2.50 లక్షల రైతులు ఈ విధంగా ఆభరణాలపై అప్పులు తీసుకుని వుంటారని అంచనా. ఈ క్రమంలో నోటీసుల పేరుతో బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనపుడు క ంగుతిన్న రైతులు పరువు పోతుందన్న గుండె గుబులుతో అందినకాడల్లా అప్పులు చేసి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకొన్నారు. ఆ పరపతి కూడా లేని రైతులు తమ నగలను వదిలేసుకున్నారు. నోటీసులు ఇచ్చారు 2013లో ఆంధ్రాబ్యాంక్‌లో బంగారంపెట్టి రూ.1.2లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ కాకపోవడంతో కొంత నగదు చెల్లించాం. మిగిలిన నగదు కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలిశెట్టి సుధారాణి, కొలకలూరు -
జనసంద్రంగా కోటప్పకొండ
మహాశివరాత్రి సందర్భంగా త్రికోటేశ్వరుడికి విశేష పూజలు నరసరావుపేట రూరల్ : ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ సోమవారం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు శివ నామ స్మరణతో మారుమోగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి త్రికోటేశ్వరుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత బిందతీర్దంతో అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి, యాగశాలలో చండీ, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పలువురు భక్తులు మెట్లకు పూజ చేస్తూ కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి కూడా భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాదాలు, తాగు నీరు పంపిణీ చేశాయి. ప్రముఖుల రాక.. స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, సినీ హీరో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. హీరో శ్రీకాంత్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. -
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
► సీబీఐతో విచారణ చేయించాలి.. ► మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలి ► ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ► రాజధాని దురాక్రమణపై ► వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు (గుంటూరు) : భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం రాజధాని ప్రాంతంలో జరిగిందని, దానిలో ప్రభుత్వ పెద్దలు ఉండడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నిప్పులు చెరిగారు. తక్షణమే దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను భయపెట్టి, పొలాలు, అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మకాల్లో ఆయనకు ఆయనే సాటి ... మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని, ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాలిపోతారని, ఇసుక, మట్టి, పత్తి అమ్ముకోవడంతో ఆయనకు ఆయనే సాటి అని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెర తీశారన్నారు. కోర్ కేపిటల్, పరిశ్రమలు ఎక్కడ వస్తాయో పూర్తిగా తెలిసిన మంత్రులు భూములు రేట్లు తగ్గేలా చేశారని ఆరోపించారు. బినామీల ద్వారా 90 ఎకరాలు.. అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, నష్ట పరిహారం రాదని భయపెట్టిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు బినామీల ద్వారా 90 ఎకరాలు కొనుగోలు చేశారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బట్టల దుకాణం నిర్వహించే విజయవాడకు చెందిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తి అన్ని ఎకరాలు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. సురేష్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందని, ఈసీలు సైతం అతని పేరుపైనే ఉన్నాయని, వాటికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. నాలుగు రోజలు క్రితమే మంత్రి ప్రత్తిపాటి అసైన్డ్ ల్యాండ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబుకు సంబంధించిన భూములు సైతం ఆయన భార్య, బావమరిది పేరుతో ఉన్నాయని తెలుస్తోందన్నారు. తక్షణమే రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో సైతం పూర్తి సాక్ష్యాలతో నిరూపించామని, పత్తి కోనుగోళ్లలో భారీ అవినీతి జరిగితే, విచారణకు అతీగతీ లేదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి... పార్టీ సీఈసీ సభ్యులు రావి వెంకటరమణ మాట్లాడుతూ లక్షల కోట్ల కుంభకోణానికి టీడీపీ నేతలు తెర లేపారని విమర్శించారు. రాజధాని పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ ల్యాండ్‌లో ఎవరు పొజిషన్లో ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అసైన్డ్ ల్యాండ్ చట్ట ప్రకారం ఆ భూములు కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సైతం ఓ డీఎస్పీతో కలసి ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. -
జనంలోకి వెళితే.. నిలదీస్తున్నారు
► టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ► ఎమ్మెల్యేల సీరియస్ ► అగ్రి జోన్ ఎత్తేయాలని డిమాండ్ ► రేషన్ కార్డులు, పింఛను కోతలపై నిరసన సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ అంతర్గత సమావేశం సోమవారం వాడీవేడిగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలుఅంశాలపై ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిం చారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు తమను నిలదీస్తున్నారని సీరియస్ అయ్యారు. అగ్రిజోన్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టంచేశారు. తక్షణం అగ్రిజోన్ను ఎత్తివేయించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య తదితరులు చెప్పినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా మంచినీటి సమస్య ఎదురైందని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ, మచిలీపట్నం డివిజన్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ గతంలో నాలుగు టీఎంసీల నీరు వది లితే ఒకటిన్నర టీఎంసీలు భూమిలోనే ఇంకిపోయిందన్నారు. మరో రెండు టీఎంసీల నీరు వదులుతామని హామీ ఇచ్చారు. విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ, ఏలూరు కాల్వ మళ్లింపు వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డును పాకలు తొల గించకుండా డివైడర్ సైజు తగ్గించి కలిపే అవకాశాలను పరిశీలించి చర్చించేందుకు ఎన్‌హెచ్ రోడ్డు సేఫ్టీ విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల తొలగింపు అనివార్యమైతే రామవరప్పాడు, ప్రసాదంపాడులలోనే నిర్మించి ఇవ్వాలన్నారు. వేలిముద్రలు పడలేదని రేషన్ ఇవ్వకపోవడాన్ని పలువురు ఎమ్మెల్యేలు నిలదీశారు. ఈ-పోస్ విధానంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, తంగిరాల సౌమ్య, కాగిత వెంకట్రావ్, ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘ఆకర్ష్’పై అంతర్మథనం
నాడు కార్యకర్తలే దేవుళ్లంటూ బాబు ప్రశంసల వర్షం నేడు కొత్తగా చేరేవారికి తాయిలాల వల తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ అధినేత తీరు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చెలరేగుతున్న వివాదాలు ఆది నుంచి జెండా మోసిన వారికి పలకరింపులు కూడా కరువు కొత్తవారిని అందలమెక్కిస్తున్నారంటూ కినుక తమ సంగతి తేల్చాలని తమ్ముళ్ల డిమాండ్ సాక్షి ప్రతినిధి, గుంటూరు టీడీపీ అధినేత ఆకర్ష్ పథకం తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చుపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. రెండేళ్లు గడిచినా నామినేటెడ్ పదవులు కట్టబెట్టకుండా చూద్దాం.. చేద్దాం అంటూ దాటవేత ధోరణి అవలంభించిన ప్రజా ప్రతినిధులు, మంత్రుల వద్దకు వెళ్లి తమ సంగతి తేల్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు పట్టుపడుతున్నారు. ఎన్నికల తర్వాత కార్యకర్తలే దేవుళ్లు.. వారి రుణం తీర్చుకుంటాం.. అంటూ వారి త్యాగాల గురించి స్తుతించిన టీడీపీ నాయకులు కార్తకర్తలను విస్మరించి కొత్త వ్యక్తులను పార్టీలోకి తెచ్చి వారికి పదవులు కేటాయించాలని చూస్తుండటంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఆకర్ష్ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ చిన్నాచితక నాయకులను ఆకర్షించాలని పార్టీ అధినేత ద్వారా సంకేతాలు అందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో ఉన్న కార్యకర్తలను విస్మరించి, కొత్తగా చేరుతున్నవారికి తాయిలాలు, ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఫలితాల తరువాత గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు చేసిన త్యాగాలు వర్ణిస్తూ ప్రసంగాలు చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో తమకు మంచి అవకాశం రాబోతుందని ఆశించారు. సీన్ కట్ చేస్తే.... జెండాలు మోసిన కార్యకర్తల పరిస్థితి ఇప్పుడు టీడీపీలో అయోమయంగా తయారైంది. మా మంత్రిగారు, మా ఎమ్మెల్యే అంటూ అంటిపెట్టుకొని తిరిగిన వారికి చుక్కెదురైంది. ఇక మంత్రుల నియోజకవర్గాల్లో కొంతకాలంగా వారి దర్శన భాగ్యమే కష్టంగా మారింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో అయితే తమ సమస్యలు చెప్పుకొని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలవాలని వచ్చిన వారికి ఆయన నుంచి స్పందన కరువైంది. ఒకటి రెండు పొడిమాటలు, చేద్దాం..చూద్దాం అనడం మినహా స్పష్టమైన హామీ కరువైంది. ఇంటి లోపలికి వెళ్లడం మాట అలా ఉంచి బయటకు వచ్చినప్పుడు తమ ైవె పు చూసి పలకరిస్తారని ఆశిస్తున్న ఆశావాహులకు అమాత్యులు కనీసం వారివైపు కూడా చూడకపోవటంతో నిరసన వ్యక్తం అవుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. తమ అభిమాన నాయకుడు మంత్రి అయ్యాడని, ఎమ్మెల్యే అయ్యాడని తమను అందలం ఎక్కిస్తారని కలలు కన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఎన్నికలకు ముందు చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించారు. పార్టీ అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని హామీల వర్షం కురిపించి పార్టీలో చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి ప్రస్థానం ఇక్కడే ముగిసిపోయింది. పార్టీలో వారి స్థానం ఏమిటో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు సీనియర్లు తమ సంగటేమిటని మంత్రుల వద్ద ప్రస్తావిస్తే పార్టీ అధినేత సూచించిన దాని ప్రకారం కొత్తవారికి ఇప్పట్లో పదవుల విషయంపై స్పష్టత లేదని సమాధామిచ్చారు. దీంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఈ క్రమంలో కొత్త వారిని కూడా పార్టీలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీని ఎప్పుటి నుంచో నమ్ముకొని ఉన్న తమను కాదని కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వటం తమ్ముళ్లలో మరింత నిరాశ నిసృహలకు కారణమవుతుంది. పుకార్లను తిప్పికొడుతున్న పార్టీ నేతలు.. తమ పార్టీ కేడర్‌లో కలకలం సృష్టించేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా టీడీపీ నేతలు అసరిస్తున్న అక్రమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యత్నాలు ప్రారంభించారు. బెజవాడ పశ్చిమలో కలకలం.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీలో కలకలం ఆరంభమైంది. ఆ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ టీడీపీలో చేరడంతో మిగిలిన నేతల్లో కలకలం ఆరంభమైంది. మొదటి నుంచి పార్టీని బతికించిన అనేక మంది నాయకుల సేవలను పరిగణనలోకి తీసుకోకుండా అధినేత చంద్రబాబు జలీల్‌ఖాన్ చేర్చుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీ ఇక్కడ మూడు ముక్కలు కావడం ఖాయమని, వర్గాలు, గ్రూపులుగా మారిపోతుందనే అభిప్రాయం వినపడుతోంది. ఇక జలీల్‌ను నమ్మి ఆయన వెంటనే కొనసాగుతున్న కొందరు ద్వితీయ శ్రేణినాయకులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీ పునర్మిణానికి సమాయత్తం అవుతున్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం మంత్రి ప్రత్తిపాటి
వర్గీకరణ సున్నిత అంశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటని ప్రశ్నించగా, అది సున్నితమైన అంశమని, ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని సమాధానం దాటవేశారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, మద్దాళి గిరిధర్, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు (గుంటూరు) : రైతులకు గిట్టుబాబు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నామని, త్వరలో మినుములు, శనగలు, పెసలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మోన్శాంటో హైబ్రిడ్ పత్తి విత్తనాల వేసిన చాలామంది రైతులు పింక్‌బౌల్ పురుగు సోకి నష్టపోయారని తెలిపారు. మోన్శాంటో కంపెనీ(ప్యాకెట్‌పై) వసూలుచేస్తున్న రూ.180 ఈ ఏడాది మానుకోవాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన అధునాత యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఏపీ ఆగ్రోస్ ద్వారా కొన్ని వ్యవసాయ యంత్ర పరికరాలను తయారీదారుల నుంచే నేరుగా రైతులకు అందజేనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి వివరించారు. -
దండెత్తారు!
తాగునీటి సమస్యపై గళమెత్తిన అధికార, విపక్షాలు నిధులున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈపై చర్యకు మంత్రి ప్రత్తిపాటి ఆదేశం వాడి వేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గుంటూరు వెస్ట్ : జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు ఉండి, ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శుక్రవారం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తాగునీటి సమస్యపై వేడి వేడిగా చర్చ జరిగింది. తాగునీటి సమస్యపై పార్టీలకు అతీతంగా సభ్యులు గళం విప్పడంతో ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ జి.శర్మపై క్రమశిక్షణ చర్యలు తీసు కోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కలెక్టర్ కాంతిలాల్‌దండేను ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే జెడ్పీ అక్కౌంట్స్ ఆఫీసర్ సీహెచ్.రవిచంద్రారెడ్డి 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లా ఆదాయ వనరులు, ఖర్చులు, మిగులు బడ్జెట్ తదితర అంశాలను సభలో చదివి వినిపించారు. సభ్యులందరూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం అజెండాలోని తొలి అంశమైన గ్రామీణ నీటి సరఫరాపై చర్చ ప్రారంభించారు.చుండూరు ఎంపీపీ ఉయ్యూరు అప్పిరెడ్డి మాట్లాడుతూ పంప్‌హౌస్ విద్యుత్ కనెక్షన్ నిమిత్తం ఏడాది క్రితం రూ.4.40 లక్షల డీడీ తీసి అధికారులకు అందజేశానని, నేటికీ కనెక్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. మాచర్ల జెడ్పీటీసీ ఎస్.గోపిరెడ్డి మాట్లాడుతూ ట్యాంకర్ల ద్వారా సరిపడ సరఫరా కావడం లేదన్నారు.పిడుగురాళ్ల జెడ్పీటీసీ వి.రామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు తాగునీటి సరఫరా నిమిత్తం కోట్ల రూపాయలతో నిర్మించిన పైపులైన్ వృథాగా మారిందన్నారు. దానిని వెంటనే పూర్తిచేసి తాగునీరు సరఫరా జరిగేలా చూడాలని కోరారు. అమృతలూరు జెడ్పీటీసీ చందోలు పృథ్వీలత మాట్లాడుతూ మండలంలోని ప్యాపర్రులో సరఫరా అవుతున్న తాగునీరు పచ్చరంగులో ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాచేపల్లి జెడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలోని సభ్యులను మార్చే అధికారం ఎవరికి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఉన్నప్పటికీ, వారు లేరనే కారణంతో నలుగురు సభ్యుల్ని మార్చారని తెలిపారు. 6 నెలల నుంచి అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లాపల్లి జెడ్పీటీసీ కిన్నెర సంతోషమ్మ మాట్లాడుతూ రెండేళ్ల నుంచి అడుగుతు న్నా సమస్యలను పరిష్కరించడం లే దన్నారు. తమ మండలానికి గుర్తింపు ఉందో లేదో చెప్పాలని కోరారు. బోర్లు వేసి నీటిని అందించాలని అన్నారు. బెల్లంకొండ జెడ్పీటీసీ దేవళ్ల రేవతి మాట్లాడుతూ బెల్లంకొండ, రాజుపాలెంలోని పులిచింతల పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కూడా అందడం లేదన్నారు. విద్యార్థులకు జెడ్పీ నుంచి అందిస్తున్న స్టడీ మెటీరియల్, పౌష్టికాహారం పంపిణీకి సంబంధించి సమాచారం ఉండడం లేదన్నారు. దుగ్గిరాల జెడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ నుంచి నిర్మించుకున్న మరుగుదొడ్లకు బిల్లులు మంజూరుకాక లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. -
ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ?
విలేకర్లతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొరిటెపాడు(గుంటూరు): రాజధాని శంకుస్థాపన రోజు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మంత్రి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు ముఖం చెల్లక శంకుస్థాపనకు రాలేదని ఆరోపించారు. -
ధైర్యంగా ఉండండి..ప్రభుత్వం ఆదుకుంటుంది
- ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబానికి మంత్రులు ప్రత్తిపాటి , శిద్దా పరామర్శ - రూ.5 లక్షలు పరిహారం - పొగాకు బోర్డు, వ్యాపారులతో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష టంగుటూరు : ఆత్మ స్థైర్య కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతులకు సూచించారు. ఆత్మహత్మకు పాల్పడిన పొదవారిపాలేనికి చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుంటుంబ సభ్యులను మంత్రి పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర రోడ్డురవాణా శాఖా మంత్రి సిద్దా రాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ ఆదివారం పరామర్శించారు. పొగాకు రైతులకు ధైర్యం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పంపించాడని తెలిపారు. రూ. 37.5 లక్షల అప్పు ఉందని మృతుని కుటుంబ సభ్యులు మంత్రులకు వివరించారు. ఆ కుటుంబ దయనీయ పరిస్థితిని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తుందని ప్రకటించారు. ప్రైవేట్ అప్పులు చెల్లింపు బాధ్యతను ఆర్డీవోకు అప్పగించారు. రేపే బోర్డు అధికారులు, పొగాకు వ్యాపారులతో సీఎం సమావేశం ప్రస్తుత పరిస్థితిపై చర్చించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు బోర్డు, వ్యాపారులు, ఎగుమతిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని మంత్రి పుల్లారావు తెలిపారు. గిట్టుబాటు ధరలకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని భరోసా ఇచ్చారు. అదనపు పొగాకుపై అపరాద రుసం రద్దు చేయండి అదనపు పొగాకు కొనుగోళ్లపై ప్రస్తుతం కొనసాగుతున్న అపరాద రుసుం 15 శాతం,సెస్‌లను రద్దు చేయాలని స్థానిక రైతులు, రైతు సంఘం నాయకుడు గోపి మంత్రులను కోరారు. ప్రస్తుతం రైతుల వద్ద లోగ్రేడే పొగాకు ఉందని,అందుకే అపరాద రుసుం రద్దు చేసి రైతులను ఈమేరకైనా ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకులు మంత్రుల వెంట ఉన్నారు. -
15లోపు తాగునీటి విడుదల
- డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి - కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం - సమీక్షా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి గుంటూరు వెస్ట్ : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఈనెల 15వ తేదీలోపు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శుక్రవారం వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగునీరు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో ఈనెలాఖరు నాటికి తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ గత ఏడాది కంటే అదనంగా పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ వెల్లడించారు. సబ్సిడీపై గిరిరాజ్ ఆవులను అందజేయనున్నట్లు పశుసంవర్థక శాఖాధికారి దామోదరంనాయుడు వెల్లడించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో తాగునీటి ఎద్దడి కారణంగా 83 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ గోపాలకృష్ణ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జూన్,జూలైలో కురిసిన వర్షాల వల్ల ప్రస్తుతం పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు వల్ల ఎక్కడైనా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దాణా, పసుగ్రాసం కొరత రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కంది, ఉల్లి పంటలను, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. మాచర్ల, గురజాలలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని గురజాల ఆర్డీఓను ఆదేశించారు. కరువు పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కార్మికులకు న్యాయం చేస్తాం
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు వెస్ట్ : భజరంగ్ జూట్‌మిల్లు వ్యవహారంలో కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యాజమాన్యం దిగిరాని పక్షంలో కఠినచర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ లాకౌట్‌కు నిరసనగా భజరంగ్ జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి నాయకత్వంలో ప్రతినిధులు ఆదివారం స్థానిక ఐబీలో మంత్రి పుల్లారావును కలిశారు. యాజమాన్య మొండివైఖరిని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి పుల్లారావు యాజమాన్య ధిక్కార ధోరణిని సహించే ప్రసక్తే లేదన్నారు. కార్మికమంత్రి అచ్చెన్నాయుడు, కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. జూట్‌మిల్లు పరిరక్షణ కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్య మెడలు వంచుతుందనే భావిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలతో మొదలుపెట్టి కార్మికశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మికుల్లో కోపం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం తగుచర్యలు చేపట్టాలన్నారు. మంత్రి పుల్లారావును కలిసిన వారిలో బీజేఎంఎం నాయకులు ఎబ్బూరి పాండురంగ, రాయ నాగేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సీపీఐ(ఎంఎల్) నాయకుడు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, దళితనేత చార్వాక, ఐఎన్టీయూసీ నాయకుడు ఎర్రబాబు, వైఎస్సార్ సీపీ నగర యువజన అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్, మైనార్టీ అధ్యక్షుడు టింబర్ డిపో జానీ, ఇల్లూరి బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
యోగా సర్వరోగ నివారిణి
♦ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ♦ గుంటూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గుంటూరు స్పోర్ట్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ముఖ్యభాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నగరంపాలెంలోని కేకేఆర్ పంక్షన్ ప్లాజాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అన్ని రోగాలకు యోగా సర్వరోగ నివారిణి అన్నారు. శరీరం, మెదడు చురుగ్గా పనిచేయడానికి యోగా దోహదకారి అవుతుందన్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఆయుధం కావాలన్నారు. ఆరో తరగతి నుంచి యోగాను ఓ పాఠ్యాంశంగా చేర్చితే పిల్లలు మానసిక పరిపక్వత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ మాట్లాడుతూ యోగాపై విద్యార్థులు ఆసక్తిపెంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే మాట్లాడుతూ జీవితంలో యోగా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. యోగా దినోత్సవంలో భాగంగా శిక్షకులు డాక్టర్ కె.కొండయ్య 20 రకాల ఆసనాలతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో యోగా చేయించారు. కార్యక్రమంలో యోగా శిక్షకురాలు శ్రీవిద్య, సంయుక్త కలెక్టర్-2 ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ ఉమాసుందరి, వివిధ శాఖల అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.