► బదిలీ అయిన ఉద్యోగులకు స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులు
► కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోని వైనం
► అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం ఉద్యోగుల క్యూ
► జాబితాలు సిద్ధం చేసి పంపుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం క్లైమాక్స్‌కు చేరింది. కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధి అనుమతి లేనిదేఅక్కడ ఉద్యోగంలో చేరేందుకు కుదరని పరిస్థితి. నిబంధనలు బేఖాతరు చేస్తూ తమకు అనుకూలంగా లేనివారిని వేరే చోటికి పంపించడంతో పాటు తమవారికి పోస్టింగులు ఇప్పించు కోవడానికి నేతలు రంగం సిద్ధం చేశారు. సోమవారంతో బదిలీలకు గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: రెవెన్యూశాఖలో ఇటీవల జిల్లా కలెక్టర్ నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. వారికి పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలో కొంత మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. పిట్టలవానిపాలెం, రొంపిచర్ల, నకరికల్లుకు బదిలీ అయిన తహసీల్దార్లను స్థానిక ప్రజా ప్రతినిధులు జాయిన్ కావద్దని ఒత్తిడి తేవడంతో వారికి ఎటూ పాలుపోవడంలేదు. తమకు తెలియకుండా ఎలా వస్తారని, తమకు నచ్చిన వారిని తామే ఇక్కడకు తెప్పించుకుంటామని వారితో తేల్చి చెప్పడంతో బదిలీ అయిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి రావెల్ కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో ఓ భూమి వ్యవహారంలో తహసీల్దారు కోర్టు ఆదేశాలను అమలు చేసి మంత్రి ఆగ్రహానికి గురయ్యారు.
సెలవులో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో ఆ తహసీల్దార్‌కు బదిలీ తప్పేలాలేదు. రొంపిచర్ల తహసీల్దార్‌కు పదవీ విరమణకు గడువు కేవలం రెండు నెలలు ఉంది. పదవీ విరమణకు ఆరునెలల లోపు సర్వీసు ఉన్న వారిని అధికారికంగా బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆయన్ను దుర్గిరాలకు బదిలీ చేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ బదిలీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించినా ఆయన ఆదేశాలు పట్టించుకోక పోవడం గమనార్హం. రెవెన్యూ శాఖలో అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకు 20 శాతం మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు వివరాలు పంపించాల్సిందిగా డివిజన్, మండల కార్యాలయాలకు కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బదిలీల జాబితాను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఎంపీడీవోల బదిలీల్లో సైతం...
జిల్లాలో ఎంపీడీవోల బదిలీల్లో సైతం తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నట్టు సమాచారం. బదిలీలకు సంబంధించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ సమావేశమై చర్చించినట్లు తెలిసింది. 20 శాతం అంటే దాదాపు 15 మందికి పైగా ఎంపీడీవోలకు స్థానచలనం తప్పదని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట మండల ఎంపీడీవోను బదిలీ చేయాలని సూచించినట్టు తెలిసింది. స్థానిక ఎంపీపీకి, ఎంపీడీవోకు నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న వట్టిచెరుకూరు మండల ఎంపీడీవోను సైతం తమ మాట ఖాతరు చేయడం లేదని ఇప్పటికే బదిలీ చేయాలని ఆధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ స్థానంలో పిడుగురాళ్ల ఎంపీడీవోను సిఫార్సు చేసినట్టు సమాచారం.
ప్రత్తిపాడు ఎంపీడీవో గుంటూరు రూరల్ ఎంపీడీవోగా వచ్చేందుకు మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మేడికొండూరు ఎంపీడీవో సైతం ఈ నెల చివరికి రిటైర్ అవుతున్నారు. బొల్లాపల్లి, మాచవరం ఎంపీడీవోలు ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నూజెండ్ల, దాచేపల్లి, పెదనందిపాడు మండల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాపట్ల, మంగళగిరి మండలాల ఎంపీడీవోలు బదిలీలకోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా బదిలీల ప్రక్రియ ఆన్‌లైనా, మాన్యువలా అన్న సందిగ్ధం ఉద్యోగుల్లో నెలకొంది.
రేపటితో ముగియనున్న బదిలీల దరఖాస్తు గడువు
బదిలీల దరఖాస్తు గడువు సోమవారంతో ముగుస్తుండడంతో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకోవడం కోసం అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను పంపినట్టు సమాచారం.
మేం రమ్మంటేనే రండి!
Published Sun, Jun 19 2016 12:51 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
Advertisement