
ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలి చ్చిన కూటమి ప్రభుత్వం
కీలకమైన రెవెన్యూ శాఖలో అత్యధికంగా 36 జీవోలు
పవన్ పంచాయతీరాజ్ శాఖలోనూ ఇదే తంతు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి, పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని చెప్పారు.
ఆ రహస్య జీవోలన్నీ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని అన్నారు. తాము ఏ వివరాలను గోప్యంగా ఉంచబోమని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని, ఇదే పారదర్శక పాలనకు సాక్ష్యమంటూ గత ఏడాది ఆగస్టు 30న ప్రకటించిన చంద్రబాబు, పవన్.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వివరించారు.
కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖలో 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 4, ఆర్థిక శాఖకు చెందినవి 5, ఇరిగేషన్‌లో 6, హోంశాఖలో 4 జీవోలు రహస్యంగా ఇచ్చారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారని, ఇవన్నీ కీలకమైన జీవోలేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలన్నీ బహిర్గతం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment