ప్రత్తిపాటి నోట... ఓటి మాట | Gold loans, the banks' notices | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాటి నోట... ఓటి మాట

Published Thu, Mar 10 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ప్రత్తిపాటి నోట... ఓటి మాట

ప్రత్తిపాటి నోట... ఓటి మాట

బంగారం రుణాలపై బ్యాంకుల నోటీసులు
మంత్రి తెలియదనడంపై మహిళల మండిపాటు
బాబును నమ్మినందుకు నట్టేట ముంచారని శాపనార్థాలు
ఏడాది క్రితం తీసుకున్న అప్పులూ చెల్లించాలని అప్పుడే ఒత్తిడి

 
 తెనాలి : ‘వస్తున్నా....మీకోసం’ పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు దగాపడ్డారు. ‘ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు...మీ నగలు మీరు తీసుకుందురు’ అనే వాగ్దానాలకు పొంగిపోయిన ఆడపడుచులు తీవ్రంగా భంగపడ్డారు. అధికారంలోకి వచ్చాక బాబు తీరు మారిపోయింది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో రుణ పరిమితి తగ్గించి, వాయిదాల పద్ధతిలో మాఫీ అన్న ముఖ్యమంత్రి మాటల గారడీకి అంతా నివ్వెర పోయారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినవారిపై ప్రభుత్వ పెద్దలు బుకాయింపునకు దిగుతున్నారు. బంగారు నగలపై రుణాలు తీసుకున్న ఖాతాదారులకు బ్యాంకులు మళ్లీ ఇప్పుడు వేలం నోటీసులు పంపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని బుధవారం శాసనసభలో ప్రస్తావిస్తే, అటువంటి సమాచారమేదీ తనకు తెలియదని రా్రష్ట వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిస్సిగ్గుగా ప్రకటించటం చూసిన ప్రజలు మండిపడుతున్నారు.

 ఏడాదిగా కరవు ఛాయలు..
 జిల్లాపై ఏడాదిగా కరవు ఛాయలు ముసురుకున్నాయి. ఖరీఫ్‌లో వరి, పత్తి, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గాయి. ఫలితంగా జిల్లాలోని రైతులు రూ.800 కోట్లకు పైగా నష్టపోయివుంటారని అంచనా. ప్రస్తుత రబీలోనూ పంటల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతులు ఎందరికో  చంద్రబాబు హామీనిచ్చినట్టు రుణమాఫీ జరగలేదు. అన్ని లెక్కలు సరిచూసుకుని మాఫీ పరిధిలోకి వచ్చిన రైతులకు తొలి విడతగా ఖాతాలో పడిన డబ్బులు కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు.

 శాపనార్థాలు పెడుతున్న మహిళలు...
 గురజాల దగ్గర్లోని మాడుగులకు చెందిన కౌలురైతు సంకురాత్రి భూదేమ్మను రుణమాఫీపై కదిలిస్తే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూడేళ్ల క్రితం గురజాల ఎస్‌బీఐలో నగలు తాకట్టుపెట్టి రూ.35 వేల రుణం తీసుకుంది. బాబు హామీని నమ్మినందుకు రుణమాఫీ చేయకపోగా తన నగలను వేలం వేశారని తెలుసుకుని నివ్వెరపోయినట్టు చెబుతూ శాపనార్థాలు పెట్టసాగింది.  తెనాలి సమీపంలోని కొలకలూరు మహిళ రమాదేవి మూడేళ్ల క్రితం రూ.54 వేలు రుణం తీసుకున్నారు. ఇప్పటికి రూ.37 వేలు వడ్డీకింద చెల్లించినా, రుణమాఫీ కాలేదనీ, ఏం చేయాలో తెలియడం లేదన్నారు.

 ప్రకటన వ్యయం  రైతునెత్తిపైనే...
 బ్యాంకు నోటీసులు అందుకున్న రైతులు కలవరపడుతూ ఏదొకవిధంగా వడ్డీ చెల్లిస్తామని వెళితే ప్రతికలో వేలం ప్రకటన వ్యయాన్ని కూడా వారినుంచి బ్యాంకులు రాబడుతున్నాయి. పత్రికలో వేసినందుకంటూ తననుంచి రూ.750 అదనంగా వసూలుచేశారని సింగరయ్య అనే మరో రైతు చెప్పటం ఇందుకు నిదర్శనం.  వార్షిక సంవత్సరం ఆఖరు కావటంతో బ్యాంకులన్నీ కొద్దిరోజులుగా బంగారు ఆభరణాల నగల వేలం నోటీసులను పంపుతున్నాయి.జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల రైతులు వీటిని అందుకుంటున్నారు.  బాబు రుణమాఫీ హామీ కారణంగా  బ్యాంకులకు ఎదురైన చేదు అనుభవాలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదిక్రితం తీసుకున్న రుణాలనూ చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులతో ఒత్తిడిచేస్తున్నట్టు కొలకలూరు రైతు శివనాగేంద్రం చెప్పారు. వాస్తవాలిలా ఉంటే, ఇప్పటికీ రుణాలు మాఫీ కాని రైతులు ఉన్నారనీ, నగలపై రుణాల చెల్లింపు డిమాండుతో నోటీసులు జారీచేస్తున్నారని తెలియదని స్వయానా మంత్రి చెప్పటంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
 
 నోటీసుల పేరుతో బ్యాంకుల ఒత్తిడి...
ఇలాంటి నేపథ్యంలో బ్యాంకులు వేలం నోటీసులు పంపటం, వేలం ప్రకటనలను పత్రికల్లో ప్రచురించటం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఖరీఫ్‌లో పంట రుణాలతో పెట్టుబడులు సరిపోక, స్థానికంగా ఉండే రైతులు, వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నారు. పంటలు వచ్చే ముందు చివరి విడత అవసరాలకు బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పు తీసుకున్నారు. దాదాపు 2.50 లక్షల రైతులు ఈ విధంగా ఆభరణాలపై అప్పులు తీసుకుని వుంటారని అంచనా. ఈ క్రమంలో నోటీసుల పేరుతో బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైనపుడు క ంగుతిన్న రైతులు పరువు పోతుందన్న గుండె గుబులుతో అందినకాడల్లా అప్పులు చేసి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేయించుకొన్నారు. ఆ పరపతి కూడా లేని రైతులు తమ నగలను వదిలేసుకున్నారు.
 
 నోటీసులు ఇచ్చారు
 2013లో ఆంధ్రాబ్యాంక్‌లో బంగారంపెట్టి రూ.1.2లక్షలు తీసుకున్నాం. రుణమాఫీ కాకపోవడంతో కొంత నగదు చెల్లించాం. మిగిలిన నగదు కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలిశెట్టి సుధారాణి, కొలకలూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement