నీ హామీ బంగారం గానూ! | tdp government cheeting in Loan waiver | Sakshi
Sakshi News home page

నీ హామీ బంగారం గానూ!

Published Thu, Mar 10 2016 3:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

నీ హామీ బంగారం గానూ! - Sakshi

నీ హామీ బంగారం గానూ!

తాకట్టు బంగారం.. ఇంటికి రానట్టే!
నోటీసులు అందుకున్న 69 వేల మంది రైతన్నలు
రూ.360 కోట్ల మేర ఇప్పటికీ మాఫీ కాని వైనం
వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చేసుకోవాల్సిన దుస్థితి
కొత్తపల్లి ఎస్బీఐలో ఇప్పటికే బంగారం వేలం
మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి

 
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ‘మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారా? ఆ బంగారం మీ ఇంటికి రావాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటెయ్యండి.’ అంటూ ఎన్నికల ముందు ఎడాపెడా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా జిల్లాలో ఏకంగా 69వేల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. వీరంతా బ్యాంకుల్లో ఉంచిన తమ బంగారం వేలం కాకుండా కాపాడుకునేందుకు అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు చేసి మరీ రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు ఇప్పటికీమాఫీ కాకపోవడంతో వీరంతా వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోవడమో..

ఆ పరిస్థితి లేకపోతే వేలంలో బంగారాన్ని కోల్పోవడమో జరిగింది. జిల్లాలో సుమారు 50 నుంచి 60 మేరకు వేలం ప్రకటనలు వెలువడ్డాయి. ఆత్మకూరు కొత్తపల్లి మండలంలో ఎస్‌బీఐ బ్యాంకు ఏకంగా 12 మందికి చెందిన బంగారు నగలను వేలం వేసి విక్రయించింది. మరోవైపు ఆస్పరి మండలంలో ఏకంగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినప్పటికీ బంగారు నగలను వేలం వేసినట్టు తమ దృష్టికి రాలేదని అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొనడం పట్ల జిల్లా రైతాంగం భగ్గు మంటోంది.

 69 వేల మందికి నోటీసులు
జిల్లాలో మొత్తం లక్షా 21 వేల మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.625 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాలన్నీ కేవలం జాతీయ బ్యాంకులల్లో తీసుకున్నవే. ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టినవి వీటికి అదనం. అయితే, ఎన్నికల నేపథ్యంలో బంగారం రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. రుణాలను సకాలంలో చెల్లించలేదు. తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత బంగారం పెట్టి తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయలేదు. ఫలితంగా సమయం మించిపోయినప్పటికీ రుణాలను చెల్లించలేదంటూ రైతులకు నోటీసుల పర్వం మొదలయింది. అంతేకాకుండా పత్రికల్లో అన్నదాతల పేర్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. రుణాలు చెల్లించకపోవడంతో బంగారాన్ని వేలం వేస్తామని ప్రకటించారు. ఈ విధంగా 69వేల మందికి చెందిన రూ.360 కోట్ల రుణాలను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాకుండా వీరి పేర్లను బ్యాంకుల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు.

ఈ విధంగా జిల్లాలో 69 వేల మంది అన్నదాతలకు బ్యాంకర్ల నుంచి నోటీసులు అందాయి. వీరు తీసుకున్న రూ.360 కోట్ల రుణాలు మాఫీ కాలేదు. రూ.265 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయినట్టు తేల్చారు. వీరికి కూడా సదరు మొత్తం ఇంకా బ్యాంకులో డిపాజిట్ కాని పరిస్థితి. ఫలితంగా వీరిలోనూ కొందరు నోటీసులు అందుకున్న సందర్భాలూ లేకపోలేదు.
   
 ఆత్మగౌరవంతో ఆటలు
వాస్తవానికి అన్నదాతలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తారు. ఏకంగా తమ పేర్లతో పాటు పత్రికల్లో ప్రకటనలు రావడం, రుణాలు కట్టకపోతే బంగారాన్ని వేలం వేస్తామనడం, బ్యాంకుల ముందు నోటీసు బోర్డుల్లో తమ పేర్లు ప్రత్యక్షం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతినింది. దీంతో అనేక మంది రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేసి మరీ రుణాలను తీర్చేశారు. మరికొంతమంది అధిక వడ్డీకి రుణాలను రీ-షెడ్యూల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆలూరు నియోజకవర్గం.. ఆస్పరి మండలంలో నాగలింగడు అనే రైతు ఎస్‌బీఐ బ్యాంకులో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 3 తులాల బంగారాన్ని పెట్టి తీసుకున్న రూ.28 వేల రుణం తీర్చలేదంటూ ఎస్‌బీఐ బ్యాంకు సిబ్బంది వేలానికి సిద్ధం కావడంతో ఆత్మగౌరవం దెబ్బతిని ఈ పనికి పూనుకున్నారు.

 
 వడ్డీకి తెచ్చి కట్టినా..
 నాకు 4 ఎకరాల పొలం ఉంది. 2012లో ఎస్బీఐ మార్కెట్‌యార్డు బ్రాంచ్‌లో రూ.35వేల అప్పు తీసుకున్నా. పెట్టుబడులకు చాలక భార్య ఆభరణాలను ఐసీఐసీఐ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి మరో రూ.95వేలు అప్పు చేసినా. ఎన్నికల ముందు చంద్రబాబు తాకట్టు రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పడంతో వడ్డీ కూడా కట్టలేదు. ప్రభుత్వం వచ్చినాక ఎస్బీఐలో రూ.7వేలు మాత్రమే మాఫీ అయింది. తాకట్టు అప్పును చెల్లించకపోతే నగలను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించినారు. దిక్కుతోచక బయట వ్యాపారి వద్ద రూ.3లకు వడ్డీకి తెచ్చి రూ.1.20లక్షలు చెల్లించినా. చంద్రబాబు మాటలు నమ్మి దారుణంగా మోసపోయినా.  - రామదాసు, కల్లుబావి రైతు, ఆదోని
 
 కుమార్తె బంగారు పోగొట్టా
2013లో కుటుంబ అవసరాలు, పంటల సాగుకు భార్య సొత్తుతో పాటు అల్లునికి నచ్చజెప్పి కుమార్తెకు చెందిన 60 గ్రాముల బంగారు బ్యాంకులో పెట్టిన. రూ.1.20 లక్షల రుణం తీసుకున్నా. ఆ ఏడాది పంటలు సరిగా పండకపోవడంతో వడ్డీ కూడా కట్టలేకపోయిన. మరుసటి యేడు సాగు చేసిన పంటలు కూడా చేతికి అందల్యా. అప్పుడే వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పంట రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రాణం లేసొచ్చింది. కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తి. ప్రభుత్వం వచ్చినాక కూడా అదిగో.. ఇదిగో అని సెప్పి లాస్టుకి పైస కూడా మాఫీ చేయల్యా. మూడు సంవత్సరాలు వడ్డీ కూడా కట్టలేదని బ్యాంకోల్లు బంగారం వేలం ఏసిరి. చంద్రబాబు మాట నమ్మి నా కూతురి బంగారం పోగొట్టిన. - మూరబోయిన నరసింహుడు, తువ్వపల్లె రైతు, రుద్రవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement