
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరణ
యోనోతోపాటు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లపై లభ్యం
ముంబై: తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడికి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ పరిష్కారం కొనుగొంది. జన్‌నివేష్ సిప్ పేరుతో రూ.250 నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ దీన్ని ప్రారంభించారు. రూ.250 సిప్ తనకు అత్యంత ఇష్టమైన స్వప్నాల్లో ఒకటని బుచ్ పేర్కొన్నారు. ఈ తరహా అతి స్వల్ప పెట్టుబడుల ఉత్పత్తులు లక్షలాది మందికి సంపద సృష్టిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
‘భారత్ వృద్ధి చెందే క్రమంలో సంపద సృష్టి జరుగుతుంది. చిన్న మొత్తాల రూపంలో అయినా ప్రతి ఒక్కరికీ అందాలి. జన్‌నివేష్ అంటే నా దృష్టిలో అర్థం ఇదే’ అని మాధవి పేర్కొన్నారు. గతంలో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రూ.100, రూ.500 సిప్‌లు ప్రవేశపెట్టినప్పటికీ అధిక నిర్వహణ వ్యయాల కారణంగా వాటికి కొనసాగించలేకపోయినట్టు చెప్పారు. సూక్ష్మ సిప్‌లు ఆర్థికంగా లాభసాటి కావాలంటే, రెండేళ్లలోపే వాటికి సంబంధించి లాభం–నష్టంలేని స్థితి(స్టేబుల్‌గా ఉండేలా)ని సాధించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు
‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో రూ.250 సిప్ ద్వారా మొదటిసారి ఇన్వెస్టర్లు, అసంఘటిత రంగంలోని చిన్న మొత్తాల పొదుపరులను ఆకర్షించగలం’ అని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిషోర్ ప్రకటించారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా చేరువ చేసే దిశగా తాము ఉత్పత్తుల అభివృద్ధి, ప్రక్రియలు, టెక్నాలజీలపై దృష్టి సారిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్‌తోపాటు పేటీఎం, జెరోదా, గ్రోవ్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రతీ యూజర్ జన్‌నివేష్ సిప్‌ను పొందొచ్చని ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment