inclusion
-
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
బీజేపీ చేరికల కమిటీకి ఈటల రాజీనామా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ పదవికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా, మరో సీనియర్ నేత అమిత్ షాను కోరినట్లు సమాచారం. ఇటీవల నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఈటల తనను చేరిక కమిటీ నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. చేరికల కమిటీ సమావేశంలోనూ పాల్గొనేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించడం లేదు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు టికెట్ భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్లకుండా సాధ్యం కాదని, అది చాలా కష్టమని ఈటల వాళ్ల వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే గెలుపు గుర్రాలు వస్తే కాదంటామా ? అని ఈటలకు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ పరిణామం.. తదనంతర ఫలితాలపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీలో చేరికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చేరికలు ఆగిపోవడానికి మీరంటే మీరు కారణమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు రాష్ట్ర నేతలు. -
బీజేపీలోకి తగ్గిన చేరికలు.. వెనుకంజ ఎందుకో..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఏ విధంగానైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీలను దెబ్బ కొట్టాలని, తమ పార్టీ బలం పెంచుకోవాలని వ్యూహం రచించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్, ఇంకా రాజయ్య యాదవ్‌లతో పాటు మాజీ ఐఏఎస్ తేజావత్ రామచంద్రునాయక్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ తదితరులు బీజేపీలో చేరారు. కానీ ఇటీవల కాలంలో చేరికలు లేకపోవడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవానికి వచ్చినప్పుడే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేరికల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెనుకంజ ఎందుకో.. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ పరంగా పెద్దెత్తున కార్యక్రమాలు చేపడుతున్నా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగోవిడత ›ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినా.. చేరికలు పెద్దగా లేకపోవడం పార్టీ ముఖ్య నేతలకు మింగుడు పడడం లేదని తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది వారికి అంతుచిక్కడం లేదు. అయితే ఇప్పటికే పార్టీలో చేరిన కొత్త నాయకులు, కొన్నేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతలు, పాత తరం నేతల మధ్య సమన్వయ లేమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలానా స్థానాల నుంచి పోటీపై వారు హామీ కోరుతున్నట్టు తెలుస్తోంది. తమ వెంట వచ్చేవారికి సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్లు కూడా నేతలు చేస్తున్నట్టు సమాచారం.. ముందస్తు హామీకి నాయకత్వం నో! ఎవరికీ ముందస్తు హామీ ఇవ్వొద్దని, బేషరతుగా చేర్చుకోవాలని నాయకత్వం నిబంధన విధించడం కూడా రాష్ట్ర పార్టీకి ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు. టికెట్, తదితరాలపై హామీ ఇవ్వకపోవడం, చేరికలపై స్పష్టమైన విధానమేదీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు. -
అందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి..
న్యుఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమనేది సమ్మిళిత వృద్ధి సాధన దిశగా కీలక అడుగని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడగలదని పేర్కొన్నారు. ప్రజలందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నిర్మల ఈ విషయాలు తెలిపారు. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 46 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవగా, ఆ అకౌంట్లలో రూ.1.74 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆమె వివరించారు. జేఏఎం (జన ధన – ఆధార్ – మొబైల్) ద్వారా బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సత్వరం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. టీ20ల ప్రభావం కారణంగా వన్డేల్లో డబుల్ హండ్రెడ్ చేయడమే గగనమైన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెటర్ ట్రిపుల్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కో్ర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ కేవలం 272 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team's first ODI against New Zealand 🇦🇺That's his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3— Cricket Australia (@CricketAus) June 14, 2022 ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నీరో.. అంధుల వన్డే క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాక్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్లో టాప్ స్కోర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మసూద్ జాన్ రికార్డు బద్దలైంది. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) సాధించడం విశేషం. ఎనిమిదో ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు.. కివీస్‌పై వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నీరో మరో రికార్డును కూడా తర ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. చదవండి: ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..! -
భారత్‌లో స్కోర్‌తో యూకే వర్సిటీలో సీటు
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షల నాణ్యతా ప్రమాణాల్ని బ్రిటన్‌కు చెందిన బెల్ఫాస్ట్ యూనివర్సిటీ పరిశీలిస్తోంది. తమ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రమాణాలకు లోబడి భారత్‌లో ఏయే యూనివర్సిటీల ఎంట్రన్స్ పరీక్ష స్కోర్లు ఉంటాయో అన్వేషిస్తున్నామని బెల్ఫాస్ట్ వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ చెప్పారు. భారత్‌లో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)లో విద్యార్థులు సాధించిన స్కోర్లనే తమ వర్సిటీలో ప్రవేశ పరీక్షకు అర్హతగా పరిగణిస్తామని గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. ఇతర ఎంట్రన్స్ పరీక్షల నాణ్యతను పరిశీలించడానికి ఇప్పుడు సిద్ధమైంది. ‘ప్రతిభగల విద్యార్థుల్ని ఆకర్షించడం కోసం భారత్‌లో విశ్వసనీయత కలిగిన ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చే స్కోర్లు తమ వర్సిటీకి ఎంతవరకు పనికి వస్తాయో పరీక్షించి చూస్తున్నాం. అలాగని మేము ఏ యూనివర్సిటీని తగ్గించి చూడటం లేదు. మా యూనివర్సిటీ ప్రమాణాలకు సరితూగే ఎంట్రన్స్ పరీక్షల స్కోర్ల కోసం చూస్తున్నాం’’అని చెప్పారు. యూకే ప్రభుత్వం భారత్ విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనల్ని సరళీకృతం చేయడంవల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు, యూకేకి మంచే జరుగుతుందని వీసీ చెప్పారు. భారత్‌లో నాణ్యతా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలను గుర్తించడానికి ఇక్కడ కొన్ని సంస్థల్ని భాగస్వాములుగా చేసుకొని అన్వేషణ కొనసాగిస్తున్నట్టు గ్రీర్ వెల్లడించారు. -
దీపావళి నుంచి పేమెంట్ బ్యాంక్ సేవలు
కోలకత్తా: పేటీఎం బ్యాంక్ ఇక పేమెంట్ బ్యాంకు గా అవతరించేందుకు అవసరమైన చర్యలు మరింత వేగవంతమయ్యాయి. తమ పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్టు బ్యాంక్ ఉపాధ్యక్షురాలు రుచితా తనేజా అగర్వాల్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో మాట్లాడుతూ ఆమె ఆ విషయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్ బీఐ నుంచి తుది లైసెన్సుల అనంతరం కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన పేమెంట్ బ్యాంకు ద్వారా సరికొత్త వ్యాపార విధానాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పారు. ధనార్జన తమ లక్ష్యంకాదని, ఇప్పటివరకు ఆర్థిక సేవలు అందుబాటులోలేని పేదలకు ఈ సేవలు చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రజలనుంచి వసూలు చేసే ఫీజు విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించనున్నామని ఆమె తెలిపారు. ఈ బ్యాంకు సాయంతో చిన్నపట్టణాలకూ పేటీఎంను విస్తరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోన్లు, ఇతర ఆర్థిక సేవల కల్పనలో బ్యాంకులు , ఎన్ బీఎఫ్ సీతో చర్చల్నిముమ్మరం చేసినట్టు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు యుటిలిటీ బిల్లులు, కిరాణా, రైలు టిక్కెట్లు, పాఠశాల ఫీజు తదితర రోజువారీ చెల్లింపులు సులభంగా వేగంగా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. పేమెంట్ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఉత్పత్తులు అందించేందుకు పలు బ్యాంకులు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫిజికల్ టచ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ప్రస్తుతం పేటీఎంను 20 నగరాల్లోని 13.5 కోట్ల మందితో నెలకు సుమారు 75-90 మిలియన్ల లావాదేవీలకు సమీపిస్తున్నట్టు తెలిపారు. 8 లక్షల మంది చిన్న వ్యాపారులు, సర్వీసు ప్రొవైడర్ల భాగస్వామ్యంతో ఈ సంవత్సరాంతానికి 1 మిలియన్ లక్ష్యాన్ని చేరుకునే ప్రణాళికతో ఉన్నట్టు అగర్వాల్ చెప్పారు -
త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు. -
పోటీ పరీక్షల్లో గిరిజన భాషలు!
జార్ఖండ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) పరీక్షలలో గిరిజన భాషలను అనుమతిస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక ప్రజలు వారి ప్రాంతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొనేందుకు ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో ఇంతకుముందు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, ఒరియా భాషలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హో, ఖోర్తా, ముందారి, పంచ్ పర్గనియా, కుర్మలి, నాగ్ పురి, సంతాలి, కుందుఖ్ మొదలైన గిరజన భాషలు కూడ చేరనున్నాయి. దీనికితోడు గతేడాది వరకూ వందమార్కులకే నిర్వహించిన పరీక్షను ఇకపై 200 మార్కులకు నిర్వహించాలని, సివిల్ సర్వీస్ మెయిన్ పేపర్ లోని మూడో పేపర్ లో ఈ భాషలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభా వ్యవహారాల మంత్రి సరయు రాయ్ నేతృత్వంలో రూపొందించిన కొత్త ఫార్మాట్‌ను అసెంబ్లీ కమిటీ సిఫార్స్ చేసింది. అలాగే ప్రస్తుతం జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా జార్ఖండ్ చరిత్ర, సమాజం, వ్యవస్థల గురించిన ప్రశ్నలను కూడా పరీక్షాపత్రంలో పొందు పరచనుంది. సోషల్ సైన్సెస్ పేపర్-2 లో రాష్ట్ర సంబంధిత ప్రశ్నలకు 40 శాతం మార్కుల వెయిటేజీని జేపీఎస్సీ మెయిన్ పరీక్షలో ఇవ్వనుంది. ప్రజలు వారి ప్రాంతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా తెలుసుకునేందుకు ఈ తాజా ప్రయత్నం జరిగింది. ఇదే విధంగా ఎస్సెస్సీ పేపర్-2 లో కూడ అన్ని గిరిజన భాషలు పొందుపరుస్తున్నట్లు జార్ఘండ్ ప్రభుత్వం తెలిపింది.