జార్ఖండ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) పరీక్షలలో గిరిజన భాషలను అనుమతిస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక ప్రజలు వారి ప్రాంతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొనేందుకు ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో ఇంతకుముందు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, ఒరియా భాషలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో హో, ఖోర్తా, ముందారి, పంచ్ పర్గనియా, కుర్మలి, నాగ్ పురి, సంతాలి, కుందుఖ్ మొదలైన గిరజన భాషలు కూడ చేరనున్నాయి. దీనికితోడు గతేడాది వరకూ వందమార్కులకే నిర్వహించిన పరీక్షను ఇకపై 200 మార్కులకు నిర్వహించాలని, సివిల్ సర్వీస్ మెయిన్ పేపర్ లోని మూడో పేపర్ లో ఈ భాషలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనసభా వ్యవహారాల మంత్రి సరయు రాయ్ నేతృత్వంలో రూపొందించిన కొత్త ఫార్మాట్‌ను అసెంబ్లీ కమిటీ సిఫార్స్ చేసింది. అలాగే ప్రస్తుతం జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా జార్ఖండ్ చరిత్ర, సమాజం, వ్యవస్థల గురించిన ప్రశ్నలను కూడా పరీక్షాపత్రంలో పొందు పరచనుంది. సోషల్ సైన్సెస్ పేపర్-2 లో రాష్ట్ర సంబంధిత ప్రశ్నలకు 40 శాతం మార్కుల వెయిటేజీని జేపీఎస్సీ మెయిన్ పరీక్షలో ఇవ్వనుంది. ప్రజలు వారి ప్రాంతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా తెలుసుకునేందుకు ఈ తాజా ప్రయత్నం జరిగింది. ఇదే విధంగా ఎస్సెస్సీ పేపర్-2 లో కూడ అన్ని గిరిజన భాషలు పొందుపరుస్తున్నట్లు జార్ఘండ్ ప్రభుత్వం తెలిపింది.
పోటీ పరీక్షల్లో గిరిజన భాషలు!
Published Fri, Apr 8 2016 12:07 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement
Advertisement