
హైదరాబాద్: ఉగాది లోపు అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు క్యూకడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు కావాలంటూ ఢిల్లీ విమానం ఎక్కేవందుకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఢిల్లీలో ఉండగా, ఈరోజు(గురువారం) సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురు ఎస్టీ, ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.
తమ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విన్నవించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి రెండు రోజుల క్రితం హైకమాండ్ కసరత్తు చేసింది. డీనిలో భాగంగా పలువురు రాష్ట్ర ముఖ్యనేతలకు ఢిల్లీ పిలిచి క్యాబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించింది హైకమాండ్. అయితే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి.. ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశం ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నంలో భాగంగా పలువురు నేతలు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది.