సమాజానికి ‘ఎక్స్‌రే’! | Telangana CM Revanth Reddy Speech At Samvidhan Rakshak Abhiyaan In Delhi | Sakshi
Sakshi News home page

సమాజానికి ‘ఎక్స్‌రే’!

Published Wed, Nov 27 2024 6:02 AM | Last Updated on Wed, Nov 27 2024 6:02 AM

Telangana CM Revanth Reddy Speech At Samvidhan Rakshak Abhiyaan In Delhi

వయనాడ్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకాగాంధీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే 

కలగణన తప్పనిసరి

ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ‘సంవిధాన్‌ రక్షక్‌ అభియాన్‌’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాల్సిందే.. ఈ అంశంలో రాహుల్‌  చేసే పోరాటాలకు తోడుగా నిలుస్తాం 

ఇది రాజ్యాంగాన్ని రక్షించే గాంధీ పరివార్‌కు.. మార్చాలని చూసే మోదీ పరివార్‌కు మధ్య యుద్ధం 

సోనియా, ఖర్గే, రాహుల్‌ల నేతృత్వంలో ‘సామాజిక న్యాయం 3.0’ ఉద్యమం 

ప్రజలంతా ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలవాలని విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని... ఇది సమాజానికి ‘ఎక్స్‌రే’వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ‘మెగా హెల్త్‌ చెకప్‌’జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం చేపట్టే మూడో ఉద్యమంలో కులగణన భాగమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్‌ రక్షక్‌ అభియాన్‌’కార్యక్రమంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ, బీఆర్‌ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి తెచ్చారు. 140 కోట్ల మంది పేదలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ద్వారా పేదలకు భూమి హక్కులు కలి్పంచి వారి గౌరవాన్ని రెట్టింపు చేశారు. అది చరిత్రలో 1.0గా నిలిచింది. ఇక 2.0లో భాగంగా రాజీవ్‌గాంధీ మొదలు పీవీ నర్సింహారావు వరకు మండల్‌ కమిషన్‌ ద్వారా ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు తెచ్చారు. ఐఐటీ, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు సామాజిక న్యాయం చేశారు. 

ఎంత జనాభా ఉంటే అంత హక్కు 
ఇక 3.0లో భాగంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల నిర్దేశంలో రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశీ్మర్‌ వరకు పాదయాత్ర చేసి... నిరుద్యోగులు, పేదలు, రైతులను కలసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ‘జిత్‌నీ భాగీ దారీ.. ఉత్‌నీ హిస్సే దారీ (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)’అని నినదించారు. ఈ కులగణన అనేది ఎక్స్‌రే వంటిది. సమాజానికి ఇది ‘మెగా హెల్త్‌ చెకప్‌’వంటిదే. దేశంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన తప్పనిసరి. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన మొదలుపెట్టాం. 92శాతం పూర్తయింది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాం. సామాజిక న్యాయం చేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాల్సిందే. కులగణన చేసేంతవరకు మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ఒత్తిడి తెస్తూనే ఉంటారు.

గాంధీ పరివార్‌.. మోదీ పరివార్‌ మధ్య యుద్ధం
దేశంలో ప్రస్తుతం మోదీ పరివార్, గాంధీ పరివార్‌‡ అని రెండు వర్గాలే ఉన్నాయి. ఇందులో గాంధీ పరివార్‌ రాజ్యాంగాన్ని రక్షించాలని భావిస్తుంటే... మోదీ పరివార్‌ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలంతా రాజ్యాంగ రక్షకులైన గాంధీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి. గతంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచి్చన నల్లచట్టాలపై రాహుల్‌ దృఢంగా నిలబడి కొట్లాడారు. రాహుల్‌ పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసింది. అదే రీతిలో కులగణనపై కొట్లాడాలి. ఈ అంశంలో రాహుల్‌ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా మేముంటాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఖర్గేతో భేటీ.. ప్రియాంకకు శుభాకాంక్షలు 
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడిగా కొంతసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జనగణన ప్రక్రియ సాగుతున్న తీరును వివరించినట్టు సమాచారం. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. డిసెంబర్‌ ఒకటి నుంచి జరగనున్న ప్రజా పాలన దినోత్సవాల ఏర్పాట్లపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల వయనాడ్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకా గాం«దీని రేవంత్, భట్టి విక్రమార్క కలసి శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement