త్వరలో బ్యాంకుల్లా పోస్టాఫీసులు!
న్యూఢిల్లీః త్వరలో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరున దగ్గరలోని పోస్టాఫీసులే బ్యాంకులుగా పనిచేసే విధానాన్ని 2017 మార్చి నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను తెచ్చింది. దీంతో 2019 నాటికల్లా మొత్తం దేశంలోని 50 జిల్లా కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుం మారుమూల ప్రాంతాల్లో ఉన్న 139,000 పోస్టాఫీసులతో కలిపి భారతదేశంలో 154,000 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో ముందుగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉండే సుమారు 650 కార్యాలయాల్లో పోస్టల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చి, వాటిని మారుమూల ప్రాంతాలతో అనుసంధానం చేస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తెస్తామని, ప్రపంచంలోనే పోస్టల్ సేవలను అందించడంలో మన దేశం ఇంచుమించుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా అతి పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉందని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుత ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు 400 కోట్ల రూపాయల ఈక్విటీలు, 400 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంటులతో మొత్తం 800 కోట్ల రూపాయలను వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి తెలిపారు. ఇందుకోసం మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 1.7 లక్షల మంది పోస్ట్ మ్యాన్ లకు అవసరాన్ని బట్టి స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్ లను అందిస్తామని, దీంతో ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లను సులభంగా చేరుకోగల్గుతారన్నారు. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ కలిగిన 5000 ఏటీఎం లను కూడ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు శాఖ యోచిస్తున్నట్లు తెలిపారు.