
న్యుఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమనేది సమ్మిళిత వృద్ధి సాధన దిశగా కీలక అడుగని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడగలదని పేర్కొన్నారు. ప్రజలందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నిర్మల ఈ విషయాలు తెలిపారు.
2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 46 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవగా, ఆ అకౌంట్లలో రూ.1.74 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆమె వివరించారు. జేఏఎం (జన ధన – ఆధార్ – మొబైల్) ద్వారా బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సత్వరం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు.