
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు.
తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు.