Private sector banks
-
మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది. -
ప్రైవేటు బ్యాంకులకూ ఆ బాధ్యత ఉంది
న్యూఢిల్లీ: దేశంలో పౌరులందరినీ ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయాలన్న (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) కేంద్రం సంకల్పంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పథకాలకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయని సూచిస్తూ, నగదు సంక్షేమ పథకాల ప్రాచుర్యానికి అవి కూడా జత కలవాలన్నారు. తాజాగా జరిగిన 20వ గ్లోబల్ ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, బ్యాంకులు– ఆర్థిక సంస్థలను మూడు రంగాల్లో– కేవైసీ నిబంధనల అమలు, బ్యాంక్ ఖాతాలకు నామినీలు, సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై అత్యధిక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లోని 92 శాతం మంది పెద్దలకు కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉందని, ప్రతి సంవత్సరం 3 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరవడం జరుగుతోందని ఆయన వివరించారు. అందరికీ బ్యాంకింగ్ ఖాతాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో సమయం లేదన్న ఆయన ప్రభుత్వ పథకాల విజయవంతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర హర్షణీయమన్నారు. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
బ్యాంక్ చీఫ్‌ల పదవీ కాలం 15 ఏళ్లు
ముంబై: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్‌లలో సీఈఓ, ఎండీ, ఫుల్ టైం డైరెక్టర్ల (డబ్ల్యూ్టటీడీ) పదవీకాలాన్ని 15 ఏళ్లుగా.. ఆయా వ్యక్తులకు గరిష్టంగా 70 ఏళ్ల వయస్సును నిర్ణయిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలను జారీ చేసింది. బోర్డ్ సమావేశాలు, కమిటీ ఏర్పాటు, వయసు, పదవీకాలం, డైరెక్టర్ల వేతనాలు వంటివి ఆర్బీఐ జారీ చేసిన సూచనలలో భాగంగా ఉన్నాయి. బ్యాంక్‌లలో కార్పొరేట్ గవర్నెన్స్‌పై మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఎండీ, సీఈఓ లేదా డబ్యూటీడీలను పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డ్ ఆమోదిస్తే గనక.. కనీసం మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత.. కొన్ని షరతులకు లోబడి నియమించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బ్యాంక్‌తో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. అదేవిధంగా సీఈఓ, ఎండీ, డబ్ల్యూటీడీలు 70 ఏళ్ల వయస్సుకు మించి ఆయా పదవుల్లో కొనసాగలేరని.. అంతకంటే తక్కువ వయసు లోపే పదవీ విరమణను బోర్డ్‌లు సూచించవచ్చని పేర్కొంది. చైర్మెన్, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఎన్ఈడీ) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. ఎన్‌ఈడీల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంక్ బోర్డ్‌లో ఎనిమిది సంవత్సరాలకు మించి ఉండకూడదు. వీరి పునర్నియామకానికి కూడా మూడేళ్ల వ్యత్యాసం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్‌ఈడీల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది. -
కావాలంటే.. మీరే చెప్పండి
న్యూఢిల్లీ: రుణాలపై నెలవారీ వాయిదాలపై (ఈఎంఐ) మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు .. వారంతట వారు కోరితేనే అమలు చేయాలని ప్రైవేట్ రంగ బ్యాంకులు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. ‘మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీరిచ్చిన రీపేమెంట్ సూచనల మేరకు చెల్లింపులు యథావిధిగా జరిగిపోతాయి. కానీ, మారటోరియం కావాలనుకుంటే తెలియజేయండి‘ అంటూ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వెబ్సైట్లో రుణగ్రహీతలను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. మరోవైపు మారటోరియం కావాలనుకునే వారు (ఆప్టింగ్ ఇన్) నిర్దిష్ట ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపించాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కస్టమర్లకు సూచించింది. అటు రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ దీన్ని కాస్త భిన్నంగా అమలు చేస్తోంది. వేతన జీవులకు సాధారణంగానే ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను, ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్న ట్రేడర్లు, చిన్న స్థాయి రుణగ్రహీతలకు ఆప్ట్–అవుట్ ఆప్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. స్వయం సహాయక గ్రూపులు, ఆభరణాలపై రుణాలు .. అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలు .. ఓవర్‌డ్రాఫ్ట్‌లు తీసుకున్నవారు, క్రెడిట్ కార్డుహోల్డర్లు మొదలైనవారు ఆప్ట్–అవుట్ కేటగిరీలోకి వస్తారు. వీరు ఒకవేళ చెల్లింపులు కొనసాగించదల్చుకున్న పక్షంలో బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. మిగతా టర్మ్ లోన్లు తీసుకున్న వారు ఆప్ట్–ఇన్ కేటగిరీలోకి వస్తారు. ఇక, యాక్సిస్ బ్యాంక్.. తామింకా స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తున్నామని, ఇది పూర్తయ్యాక కస్టమర్లకు తెలియజేస్తామని వెల్లడించింది. డబ్బుంటే కట్టేయండి.. చేతిలో నగదు ఉన్న కస్టమర్లు వీలైనంత వరకూ ఈఎంఐల చెల్లింపులు కొనసాగించేందుకే ప్రాధాన్యమివ్వాలంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు సూచించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలవ్యవధి పొడిగింపునకు సమస్య ఉండదని పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా మటుకు ఆప్ట్–అవుట్ ఆప్షన్నే అమలు చేస్తున్నాయి. చెల్లింపులు కొనసాగిస్తానని కస్టమర్లు ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప.. ఆటోమేటిక్‌గా మారటోరియం వర్తింపచేస్తున్నాయి. కరోనా సంబంధించిన లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయాలు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో రుణాల ఈఎంఐల చెల్లింపులపై కొంత వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కట్టాల్సిన ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసుకోవచ్చు. ఐబీఏ వివరణ... అటు బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కూడా మారటోరియం ప్రభావాల గురించి వివరించింది. ‘మీ ఆదాయాలు దెబ్బతిన్న పక్షంలో ఆర్బీఐ ప్యాకేజీతో ప్రయోజనం పొందవచ్చు. అయితే, ఆయా రుణాలపై వడ్డీ భారం ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు కట్టాల్సిన అవసరం లేకపోయినా.. అదనపు భారం పడుతుందని గుర్తుంచుకోవాలి‘ అని పేర్కొంది. అటు క్రెడిట్ కార్డు బాకీల గురించి కూడా వివరణ ఇచ్చింది. సాధారణంగా మినిమం అమౌంట్ కూడా కట్టకపోతే క్రెడిట్ బ్యూరోలకు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా మూడు నెలల పాటు వెసులుబాటు ఉంటుందని వివరించింది. కానీ బాకీలపై భారీగా వడ్డీ ఉంటుందని హెచ్చరించింది. వడ్డీల వాయింపు... ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం స్కీము.. పైకి కనిపించినంత ప్రయోజనకరమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తాత్కాలికంగా చెల్లింపుల నుంచి ఉపశమనం లభించినా.. ఆ తర్వాత అంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుందని, మరింత భారం తప్పదని పేర్కొన్నారు. దీంతో కరోనా దెబ్బకు ఆదాయాలు కోల్పోయిన వారు .. మారటోరియం ఎంచుకుంటే మరింత కాలం రుణాల భారం మోయాల్సి రానుంది. మారటోరియం వ్యవధిలో మిగతా బాకీపై వడ్డీల వడ్డన కొనసాగుతుందని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్బీఐ తెలియజేసింది. సోదాహరణంగా వివరించింది. ఉదాహరణకు రూ. 30 లక్షల గృహ రుణం చెల్లించడానికి మరో 15 ఏళ్ల వ్యవధి ఉందనుకుందాం. మూడు నెలల మారటోరియం తీసుకుంటే.. నికరంగా అదనంగా మరో రూ. 2.34 లక్షలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది సుమారు 8 నెలల ఈఎంఐలకు సమానం. అలాగే, రూ. 6 లక్షల వాహనం రుణం రీపేమెంట్‌కు 54 నెలలు మిగిలి ఉందనుకుందాం. దీనిపై అదనంగా రూ.19,000 అదనపు వడ్డీ భారం పడుతుంది. ఇది అదనంగా 1.5 ఈఎంఐకు సమానం. -
‘యస్’బీఐ..!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్‌ను ఒడ్డున పడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తి చూపుతున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్ 2020 ముసాయిదాను ఆర్బీఐ రూపొందించింది. దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన రోజు నుంచి మూడేళ్ల దాకా వాటాలను 26 శాతం లోపు తగ్గించుకోకూడదు. యస్ బ్యాంక్ షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున లెక్కించి వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యస్ బ్యాంకు షేరు ముఖ విలువ రూ. 2తో పోలిస్తే ఇది రూ. 8 అధికం. ఇక నిర్దేశిత తేదీ నుంచి బ్యాంక్ అధీకృత మూలధనాన్ని కూడా రూ. 5,000 కోట్లకు, ఈక్విటీ షేర్ల సంఖ్యను 2,400 కోట్లకు సవరించనున్నారు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 9 దాకా అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొండిబాకీలు, నష్టాలు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఏప్రిల్ 3 దాకా నెల రోజులపాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవధిలో డిపాజిట్‌దారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అటు బ్యాంకు.. ఇతరత్రా రుణాలు ఇవ్వడానికి గానీ పెట్టుబడులు పెట్టడానికిగానీ లేదు. మారటోరియం గడువులోగానే బ్యాంకును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ చర్యలు తీసుకుందని, ఖాతాదారుల సొమ్ముకు ఢోకా లేదని భరోసా నిచ్చారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించకపోవడం, రిస్కుతో కూడుకున్న రుణాలివ్వడం వంటి ధోరణులను 2017 నుంచి రిజర్వ్ బ్యాంక్ గమనిస్తూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజ్మెంట్ను కూడా మార్చాలని ఆర్బీఐ ఆదేశించినట్లు తెలిపారు. యస్ బ్యాంక్‌లో సమస్యలు, వాటికి బాధ్యులెవరన్న అంశాలన్నింటిపైనా విచారణ జరపాలంటూ ఆర్బీఐకి ప్రభుత్వం సూచించినట్లు ఆమె వివరించారు. ‘ఖాతాదారుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీఐతో పాటు పరిస్థితులను నేను కూడా సమీక్షిస్తున్నాను. డిపాజిటర్ల సొమ్ము భద్రంగానే ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. నిర్దిష్ట 30 రోజుల్లోగానే పునర్నిర్మాణ స్కీమ్ అమల్లోకి రాగలదని, ఇన్వెస్ట్ చేసేందుకు ఎస్బీఐ ముందుకొచ్చిందని మంత్రి చెప్పారు. ఏడాది పాటు యస్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగాలు, జీతభత్యాలకు ఎలాంటి సమస్య ఉండబోదని భరోసానిచ్చారు. అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ వంటి సంస్థలకు ఇచ్చిన రుణాలు యస్ బ్యాంక్‌కు గుదిబండగా మారాయన్నారు. ఆందోళనలో కస్టమర్లు.. విత్డ్రాయల్స్పై ఆంక్షలతో యస్ బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వార్త తెలిసినప్పట్నుంచీ ఏటీఎంలు, పలు శాఖల్లో కస్టమర్లు బారులు తీరారు. తమ డిపాజిట్ల పరిస్థితి గురించి వాకబు చేస్తూ కనిపించారు. నెట్ బ్యాంకింగ్ పనిచేయకపోవడం, ఏటీఎంలలో డబ్బు లేకపోవడం తదితర ఫిర్యాదులతో బ్యాంక్ హెల్ప్‌లైన్ హోరెత్తింది. కొందరు ట్విట్టర్ వంటి వేదికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆర్బీఐ ఆంక్షలు విధించడానికి రెండు రోజుల ముందునుంచే బ్యాంకు చిక్కుల్లో ఉన్న సంకేతాలు కనిపించాయని కొందరు ఖాతాదారులు చెప్పారు. బ్యాంకింగ్ సమస్యలపై మార్చి 3, 4 తారీఖుల నుంచే పలువురు కస్టమర్లు యస్ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్లో ఫిర్యాదులు చే శారు. షేరు 85 శాతం క్రాష్.. యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయడం, విత్ డ్రాయల్స్‌పై ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం యస్ బ్యాంక్ షేర్ కుప్పకూలింది. శుక్రవారం ఒకానొక దశలో 85 శాతం దిగజారి రూ.5.55ను తాకింది. చివరకు 55 శాతం నష్టంతో రూ.16.55 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి యస్ బ్యాంక్ షేర్ రూ.47గా ఉంది. షేర్ ధర భారీగా నష్టపోవడంతో ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు. ఎల్ఐసీ మార్క్–టు–మార్కెట్ నష్టాలు రూ.617కోట్ల మేర ఉండగా, మ్యూచువల్ ఫండ్స్ మార్క్–టు–మార్కెట్నష్టాలు కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,162 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు రూ.3,300 కోట్లు నష్టపోయారు. ఇక హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నష్టాలు రూ.239 కోట్లుగా ఉన్నాయి. త్వరలో పరిష్కారమవుతుంది: ఎస్బీఐ చీఫ్ రజనీష్ కుమార్ ‘యస్ బ్యాంక్ సమస్య కేవలం ఆ బ్యాంకుకే పరిమితమైన అంశం. ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ సమస్య కాదు. యస్ బ్యాంక్ సంక్షోభానికి చాలా తొందర్లోనే పరిష్కారం లభిస్తుంది‘ అని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులో వాటాలు కొనుగోలు చేసే పక్షంలో తమకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. సత్వర చర్యలు తీసుకుంటున్నాం: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీ ఆర్థిక రంగంలో స్థిరత్వానికి సమస్యలు వాటిల్లకుండా యస్ బ్యాంక్ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. బ్యాంకును పునరుద్ధరించడానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 30 రోజుల మారటోరియం అన్నది గరిష్ట పరిమితి అని.. ఈలోగానే పరిష్కార ప్రణాళిక అమల్లోకి రాగలదని దాస్ ధీమా వ్యక్తం చేశారు. ఖాతాదారుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామన్నారు. స్వయంగా పరిస్థితి చక్కదిద్దుకునేందుకు బ్యాంకుకు తగినంత సమయం ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతోనే ఆర్బీఐ ప్రస్తుత చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఇది తొందరపాటుతనం అని కొందరు .. చాలా ఆలస్యం చేశారని మరికొందరు వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆర్బీఐ తగిన సమయంలోనే చర్యలు తీసుకుందని దాస్ చెప్పారు. డిజిటల్ పార్ట్నర్స్కు సెగ.. యస్ బ్యాంక్‌పై ఆంక్షలతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, దానిపై ఆధారపడిన ఫిన్టñ క్ సంస్థలకు సమస్యలొచ్చి పడ్డాయి. ప్రధానంగా ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థల లావాదేవీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అటు యస్ బ్యాంక్ ఖాతాల్లోకి యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా చేసే చెల్లింపులు సహా పలు లావాదేవీల సెటిల్మెంట్లపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆంక్ష లు విధించింది. ఇక, యస్ బ్యాంక్ బాండ్లలో వివిధ స్కీమ్‌ల ద్వారా చేసిన పెట్టుబడుల విలువను సున్నా స్థాయికి తగ్గించేసినట్లు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ తెలిపింది. మరోవైపు, యస్ బ్యాంక్‌లో ఖాతాలున్న షేర్, బాండ్ హోల్డర్ల నిధులు చిక్కుబడిపోకుండా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వారి షేర్లు, బాండ్లు మొదలైనవి విక్రయించిన పక్షంలో వచ్చే నిధులను వేరే బ్యాంకులో జమ చేసుకునే వీలు కల్పిస్తూ సత్వర చర్యలు తీసుకున్నాయి. పూరీ జగన్నాథునికీ కష్టాలు... యస్ బ్యాంకులో పూరీ జగన్నా«థ స్వామి ఆలయానికి సంబంధించి రూ. 545 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ డిపాజిట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రైవేట్ బ్యాంకులో జగన్నాథుడి నిధులను డిపాజిట్ చేయడం అనైతికమని, ఈ విషయంలో శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, గుడి మేనేజింగ్ కమిటీపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జగన్నాథ సేన కన్వీనర్ ప్రియదర్శి పట్నాయక్ చెప్పారు. అయితే, అధికారులు చర్యలేమీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు. మరోవైపు, ఈ మొత్తాన్ని మార్చి నెలాఖరులోనే ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులోకి మళ్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని.. ఈలోగానే తాజా పరిణామం చోటు చేసుకుందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. -
ప్రైవేట్ బ్యాంకులకు షాక్: ఏఐబీఓసీ సంచలన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) సంచలన డిమాండ్ చేసింది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో సంక్షోభం, వివిధ కుంభకోనాల నేపథ్యంలో దేశంలోని ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ప్రతి ఏడాది కార్పొరేట్ సెక్టారుకు ఇస్తున్న కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌తో ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఈ వ్యవహారంలో కల్పించుకోవాలని కోవాలని కోరింది. ఈ బ్యాంకులను జాతీయ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని సూచించింది. అంతేకాదు జాతీయం చేయడం వలన వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం కలుగుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఏఐబీఓసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా పార్లమెంటుకు అందించిన సమాచారం ప్రకారం గత మూడేళ్ల కాలంలో రూ.2లక్షల 41వేల కోట్ల రుణాలను రద్దు చేసిన వైనాన్ని పేర్కొన్న సంస్థ బడా బాబులు కోట్ల రూపాయల రుణాలను పొందుతున్నారు. ఫలితంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటూ, ఇందుకు యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకును ఉదాహరణగా పేర్కొంది. దీంతో కుటీర పరిశ్రమలు, చిన్నసంస్థలు, రైతులు రుణాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని ఏఐబీఓసీ వాదించింది. అలాగూ స్టార్ట్ అప్ సంస్థలకూడా రుణాల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా 1969లో 14 ప్రయివేటు బ్యాంకులను,1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసిన సంగతిని గుర్తు చేసింది. -
వడ్డీ రేట్లు తగ్గించిన మరిన్ని బ్యాంకులు
0.35 శాతం దాకా బేస్ రేటు తగ్గింపు న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను దాదాపు 0.35 శాతం దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగానికి చెందిన యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బేస్ రేటును 9.9 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గించింది. ఇది అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అటు సిండికేట్ బ్యాంక్ బేస్ రేటును 0.30 శాతం తగ్గించడంతో ఇది 9.70 శాతానికి దిగి వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం తగ్గించి బేస్ రేటును 9.70 శాతానికి పరిమితం చేసింది. కొత్త రేటు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుంది. కరూర్ వైశ్యా బ్యాంక్ 0.35 శాతం బేస్ రేటును తగ్గించడంతో ఇది 10.40 శాతానికి దిగి వచ్చింది. ఈ రేటు అక్టోబర్ 5 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. యూనియన్ బ్యాంక్ బేస్ రేటును 0.35 శాతం తగ్గించింది. దీంతో అక్టోబర్ 5 నుంచి కొత్త బేస్ రేటు 9.65 శాతం అమల్లోకి వస్తుందని బ్యాంకు పేర్కొంది. ఇండియన్ బ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బేస్ రేటు 9.65 శాతానికి తగ్గింది. ఇది అక్టోబర్ 7 నుంచి అమల్లోకి వస్తుంది. రుణాలపై వడ్డీ రేటును నిర్ణయించడానికి బేస్ రేటే ప్రామాణికంగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లూ తగ్గింపు.. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ కాలపరిమితులు గల ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను 0.25-0.50 శాతం మేర తగ్గించింది. అక్టోబర్ 5 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయి. అటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వివిధ మెచ్యూరిటీల ఎఫ్డీలపై 0.25 శాతం మేర వడ్డీ రేటు తగ్గించింది. కొత్త రేటు ఈ నెల 5 నుంచి అమల్లోకి వస్తుంది. అటు, ప్రభుత్వం నుంచి లభించిన అదనపు మూలధనానికి గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రానికి రూ. 3,534 కోట్ల విలువ చేసే ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించాయి. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’
నెలరోజుల్లోగా రూ. 20,088 కోట్లు ♦ హోల్డింగ్ కంపెనీ, బ్యాంక్ బోర్డు బ్యూరో ♦ రాజకీయ ప్రమేయం తగ్గింపు ♦ కేంద్రం ఏడు సూత్రాల ప్రణాళిక న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం శుక్రవారం ఏడు సూత్రాల ప్రణాళిక ‘ఇంద్రధనుష్’ను ఆవిష్కరించింది. దీని కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 పీఎస్బీలకు రూ. 25,000 కోట్లు అందించనుంది. ఇందులో రూ. 20,088 కోట్లు నెలరోజుల్లోగాను, మిగతా రూ. 5,000 కోట్లు ఆఖరు త్రైమాసికంలోనూ ఇవ్వనుంది. బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటు, మూలధనం సమకూర్చడం, మొండిబకాయిల తగ్గింపు చర్యలు, రాజకీయ ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడం, జవాబుదారీతనం పెంచడం, గవర్నెన్స్‌పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం, హోల్డింగ్ సంస్థ ఏర్పాటు చేయడం అనే ఏడు అంశాలతో ఈ ఇంద్రధనుష్ ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం కేంద్రం బ్యాంకుల్లో తన వాటాలకు సంబంధించి బ్యాంక్ ఇన్వెస్ట్ కమిటీ పేరిట ప్రత్యేక హోల్డింగ్ సంస్థను ఏర్పాటు చేస్తుంది. అలాగే పీఎస్బీల్లో ప్రొఫెషనలిజం తెచ్చే దిశగా ప్రభుత్వం 2 బ్యాంకులకు ప్రైవేట్ రంగ బ్యాంకర్లను సారథులుగా నియమించింది. మొండిబకాయిలపై ఆందోళన అక్కర్లేదు .. ఉక్కు, విద్యుత్, హైవేలు, డిస్కమ్‌లు, కొంత మేర చక్కెర తదితర రంగాల్లో మందగమనం వల్లే పీఎస్బీల్లో మొండి బకాయిల సమస్య పెరుగుతోందని, అయితే దీనిపై తీవ్రంగా ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యాపారపరమైన నిర్ణయాలు వ్యాపార దృక్పథంతోనే తీసుకోవాలని, బ్యాంకుల వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలన్నదే తమ లక్ష్యమని జైట్లీ చెప్పారు. భారతీయ మహిళా బ్యాంకును ప్రభుత్వ రంగ ఎస్బీఐలో విలీనం చేయడంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన వివరించారు. ఏప్రిల్ 1 నుంచి బీబీబీ కార్యకలాపాలు.. బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ ఏర్పాటయ్యే దాకా ఆ బాధ్యతలను బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో (బీబీబీ) చూస్తుందని జైట్లీ చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో బీబీబీ సభ్యులను ఎంపిక చేస్తామని, 2016 ఏప్రిల్ 1 నుంచి ఇది కార్యకలాపాలు మొదలుపెడుతుందని ఆయన వివరించారు. బ్యాంకులో డిజిన్వెస్ట్‌మెంట్ యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. రాజకీయ జోక్యం లేకుండా బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. బ్యాంకుల్లో టాప్ మేనేజ్మెంటుకు ఎసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్) కూడా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఎస్బీఐకి రూ. 5 వేలకోట్లు.. కేంద్రం అందించే నిధుల్లో అత్యధికంగా ఎస్బీఐకి రూ. 5,531 కోట్లు లభించనున్నాయి. మిగతా వాటిల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,455 కోట్లు, ఐడీబీఐ (రూ. 2,229 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ. 2,009 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 1,786 కోట్లు), పీఎన్బీ (రూ.1,732 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫిండియా (రూ. 1,080 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 947 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 857 కోట్లు), దేనా బ్యాంకు (రూ. 407 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 394 కోట్లు), ఆంధ్రా బ్యాంకు (రూ. 378 కోట్లు), అలహాబాద్ బ్యాంకు (రూ. 283 కోట్లు) అందుకోనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్బీలకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చడంలో భాగంగా కేంద్రం ఈ నిధులను అందిస్తోంది. మరో రూ. 1.10 లక్షల కోట్లు అవి మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. 5 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు.. ప్రభుత్వ రంగంలోని ఐదు బ్యాంకులకు కొత్త చీఫ్‌లను(ఎండీ-సీఈఓ) ప్రకటించింది. వీటిలో రెండు బ్యాంకులకు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ నిపుణులు నియమితులయ్యారు. ఈ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరాబ్యాంక్‌లు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు ఇదే తొలిసారి. బ్యాంక్ ఆఫ్ బరోడా : వీబీహెచ్సీ వ్యాల్యూ హోమ్స్ సీఈఓ పీఎస్ జయకుమార్(53)ను బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమించారు. కెనరా బ్యాంక్ : ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా : ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. ఐడీబీఐ : యూనియన్ బ్యాంక్ ఈడీ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ : భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆమె శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.1,978 కోట్లు
ఆదాయం 23 శాతం పెరుగుదల ముంబై : ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.1,978 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.1,667 కోట్లు)తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్ బ్యాంక్ బీఎస్ఈకి నివేదించింది. గత క్యూ1లో రూ.9,980 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 23 శాతం వృద్ధితో రూ.12,234 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ ఆదాయం రూ.8,289 కోట్ల నుంచి రూ.9,936 కోట్లకు, ఇతర ఆదాయం (వడ్డీయేతర) రూ.1,691 కోట్ల నుంచి రూ.2,298 కోట్లకు వృద్ధి చెందాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.34% నుంచి 1.38%కి... నికర మొండి బకాయిలు 0.44 శాతం నుంచి 0.48 శాతానికి పెరిగాయని తెలిపింది. స్థూల మొండి బకాయిలు రూ.3,463 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు ఎగిశాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 0.5% క్షీణించి రూ.580 వద్ద ముగిసింది. -
ఉత్తమ కార్పొరేట్ నిర్వహణ... ప్రైవేటు బ్యాంకుల బలం
* తక్కువ మొండిబకాయిలపై కేసీ చక్రవర్తి కామెంట్ * ప్రభుత్వ బ్యాంకులకన్నా మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణ ముంబై: బ్యాంకింగ్ రంగానికి పెద్ద సమస్యగా ఉన్న మొండిబకాయిల (ఎన్పీఏ) విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ రంగరాజన్ పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెర్స్తో పాటు ఎన్పీఏల అత్యుత్తమ నిర్వహణ, జవాబుదారీతనం, కష్టించి పనిచేసే తత్వం వంటి అంశాలు ఎన్పీఏలను కట్టడి చేయడంలో ప్రైవేటు బ్యాంకులకు కలిసి వస్తున్న అంశాలని శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు. పదవీవిరమణ సమయానికి రెండు నెలల ముందుగానే ఏప్రిల్ చివరివారంలో రాజీనామా చేసిన చక్రవర్తి నిర్మొహమాటంగా మాట్లాడతారనే పేరుంది. గణాంకాలను చూస్తే... గత డిసెంబర్లో ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక ప్రకారం, 2015 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు మొత్తం రుణాల్లో 4.9 శాతానికి పెరుగుతున్నాయి. ప్రైవేటు రంగం విషయంలో ఈ రేటు 2.7 శాతంగా ఉండనుంది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 2015 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 4.4 శాతానికి చేరనున్నాయి. 2013 సెప్టెంబర్‌లో ఈ రేటు 4.2 శాతం. పాత తరం ప్రైవేటు రంగ బ్యాంకుల సంగతి పక్కనబెడితే, కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు కేవలం 1 శాతం వద్ద ఎన్పీఏలను కట్టడి చేయగలుగున్నాయి. నిర్వహణ లోపమే మొండిబకాయిల సమస్యకు ప్రధాన కారణమని చక్రవర్తి పేర్కొన్నారు. ఒకవైపు ఆర్థికపరమైన, మరోవైపు నియంత్రణ పరమైన రెండు సమస్యలూ ఇందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఒక విస్పష్ట విధానం అవసరమని పేర్కొన్నారు.