ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’ | The public sector banks to the 'indradhanus' | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’

Published Sat, Aug 15 2015 5:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’

ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘ఇంద్రధనుష్’

నెలరోజుల్లోగా రూ. 20,088 కోట్లు
♦ హోల్డింగ్ కంపెనీ, బ్యాంక్ బోర్డు బ్యూరో
♦ రాజకీయ ప్రమేయం తగ్గింపు
♦ కేంద్రం ఏడు సూత్రాల ప్రణాళిక
 
 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం శుక్రవారం ఏడు సూత్రాల ప్రణాళిక ‘ఇంద్రధనుష్’ను ఆవిష్కరించింది. దీని కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13 పీఎస్‌బీలకు రూ. 25,000 కోట్లు అందించనుంది. ఇందులో రూ. 20,088 కోట్లు నెలరోజుల్లోగాను, మిగతా రూ. 5,000 కోట్లు ఆఖరు త్రైమాసికంలోనూ ఇవ్వనుంది. బ్యాంకుల్లో నియామకాల కోసం బోర్డు ఆఫ్ బ్యూరో ఏర్పాటు, మూలధనం సమకూర్చడం, మొండిబకాయిల తగ్గింపు చర్యలు, రాజకీయ ప్రమేయం తగ్గిస్తూ సాధికారత కల్పించడం, జవాబుదారీతనం పెంచడం, గవర్నెన్స్‌పరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం, హోల్డింగ్ సంస్థ ఏర్పాటు చేయడం అనే ఏడు అంశాలతో ఈ ఇంద్రధనుష్ ప్రణాళికను రూపొందించారు. ప్రణాళిక ప్రకారం కేంద్రం బ్యాంకుల్లో తన వాటాలకు సంబంధించి బ్యాంక్ ఇన్వెస్ట్ కమిటీ పేరిట ప్రత్యేక హోల్డింగ్ సంస్థను ఏర్పాటు చేస్తుంది. అలాగే పీఎస్‌బీల్లో ప్రొఫెషనలిజం తెచ్చే దిశగా ప్రభుత్వం 2 బ్యాంకులకు ప్రైవేట్ రంగ బ్యాంకర్లను సారథులుగా నియమించింది.

 మొండిబకాయిలపై ఆందోళన అక్కర్లేదు ..
 ఉక్కు, విద్యుత్, హైవేలు, డిస్కమ్‌లు, కొంత మేర చక్కెర తదితర రంగాల్లో మందగమనం వల్లే పీఎస్‌బీల్లో మొండి బకాయిల సమస్య పెరుగుతోందని, అయితే దీనిపై తీవ్రంగా ఆందోళన చెందనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యాపారపరమైన నిర్ణయాలు వ్యాపార దృక్పథంతోనే  తీసుకోవాలని, బ్యాంకుల వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించాలన్నదే తమ లక్ష్యమని జైట్లీ చెప్పారు. భారతీయ మహిళా బ్యాంకును ప్రభుత్వ రంగ ఎస్‌బీఐలో విలీనం చేయడంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన వివరించారు.

 ఏప్రిల్ 1 నుంచి బీబీబీ కార్యకలాపాలు..
 బ్యాంకింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన హోల్డింగ్ కంపెనీ ఏర్పాటయ్యే దాకా ఆ బాధ్యతలను బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో (బీబీబీ) చూస్తుందని జైట్లీ చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో బీబీబీ సభ్యులను ఎంపిక చేస్తామని, 2016 ఏప్రిల్ 1 నుంచి ఇది కార్యకలాపాలు మొదలుపెడుతుందని ఆయన వివరించారు. బ్యాంకులో డిజిన్వెస్ట్‌మెంట్ యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు.  రాజకీయ జోక్యం లేకుండా బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్‌ముఖ్ అధియా చెప్పారు. బ్యాంకుల్లో టాప్ మేనేజ్‌మెంటుకు ఎసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్) కూడా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

 ఎస్‌బీఐకి రూ. 5 వేలకోట్లు..
 కేంద్రం అందించే నిధుల్లో అత్యధికంగా ఎస్‌బీఐకి రూ. 5,531 కోట్లు లభించనున్నాయి. మిగతా వాటిల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,455 కోట్లు, ఐడీబీఐ (రూ. 2,229 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ. 2,009 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 1,786 కోట్లు), పీఎన్‌బీ (రూ.1,732 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫిండియా (రూ. 1,080 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 947 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 857 కోట్లు), దేనా బ్యాంకు (రూ. 407 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 394 కోట్లు), ఆంధ్రా బ్యాంకు (రూ. 378 కోట్లు), అలహాబాద్ బ్యాంకు (రూ. 283 కోట్లు) అందుకోనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్‌బీలకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చడంలో భాగంగా కేంద్రం ఈ నిధులను అందిస్తోంది. మరో రూ. 1.10 లక్షల కోట్లు అవి మార్కెట్ల నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది.
 
 5 బ్యాంకులకు కొత్త చీఫ్‌లు..
 ప్రభుత్వ రంగంలోని ఐదు బ్యాంకులకు కొత్త చీఫ్‌లను(ఎండీ-సీఈఓ) ప్రకటించింది. వీటిలో రెండు బ్యాంకులకు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ నిపుణులు నియమితులయ్యారు. ఈ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరాబ్యాంక్‌లు ఉన్నాయి. ఈ తరహా నియామకాలు ఇదే తొలిసారి.

 బ్యాంక్ ఆఫ్ బరోడా : వీబీహెచ్‌సీ వ్యాల్యూ హోమ్స్ సీఈఓ పీఎస్ జయకుమార్(53)ను బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమించారు.
 కెనరా బ్యాంక్ : ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా : ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు.
 ఐడీబీఐ : యూనియన్ బ్యాంక్ ఈడీ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
 పంజాబ్ నేషనల్ బ్యాంక్ : భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆమె శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement