న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...
నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్...
రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది.
కెనరా బ్యాంక్
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్‌ఎల్‌ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్‌ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్‌ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్‌ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్
రెపో ఆధారిత రుణ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది.
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
Published Tue, May 10 2022 6:20 AM | Last Updated on Tue, May 10 2022 7:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment