Karur Vysya Bank
-
కరూర్ వైశ్యా లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 289 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,497 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం మెరుగుపడి 1.58 శాతానికి చేరాయి. గత క్యూ3లో 2.7 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు సైతం 0.9 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. వృద్ధి, లాభదాయకత, రుణాల నాణ్యత తదితర అంశాలలో మరోసారి నిలకడైన, పటిష్ట పనితీరును ప్రదర్శించగలిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో బి.రమేష్ బాబు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో శనివారం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 170 వద్ద ముగిసింది. -
కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..
ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది. ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) -
కరూర్ వైశ్యా బ్యాంక్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ స్టార్ట్.. ఎక్కడంటే?
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) తమ 800వ శాఖను చెన్నైలో ప్రారంభించింది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు (తెలంగాణలోని గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి) తమిళనాడులో ఇంకో ఆరు బ్రాంచీలను తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 808కి చేరిందని బ్యాంకు ఎండీ రమేష్ బాబు తెలిపారు. అటు తొలి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డీబీయూ)ని కూడా చెన్నైలో ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సేవింగ్స్ ఖాతాలను తెరవడం, రిటైల్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం, టర్మ్ డిపాజిట్లు తదితర లావాదేవీలన్నింటినీ నిర్వహించుకోవచ్చని రమేష్ బాపు చెప్పారు. కేవీబీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,40,806 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. రూ. 1,106 కోట్ల లాభం ఆర్జించింది. -
కరూర్ వైశ్యా బ్యాంక్‌పై ఆర్బీఐ కొరడా! రూ.30 లక్షల జరిమానా..
ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝులిపించింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించింది. మోసం వర్గీకరణ, రిపోర్టింగ్‌కు సంబంధించి తమ ఆదేశాలను పాటించడంలో కరూర్ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ తనిఖీలో వెల్లడైంది. దీంతో మార్చి 24న రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! ఆర్బీఐ సెలెక్ట్ స్కోప్ ఇన్స్పెక్షన్ (ఎస్ఎస్ఐ) నిర్వహించగా కరూర్ వైశ్యా బ్యాంక్‌లో కొన్ని ఫ్రాడ్ అకౌంట్లను గుర్తించింది. వాటికి సంబంధించిన వివరాలను వారం రోజుల్లోగా అందించాలని జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్దేశించగా అందులో కరూర్ వైశ్యా బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు! తాము జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని కరూర్ వైశ్యా బ్యాంకుకు ఆర్బీఐ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, విచారణ సమయంలో చేసిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తరువాత తమ ఆదేశాలను సదరు బ్యాంక్ పాటించలేదని నిర్ధారణకు వచ్చి జరిమానా విధించినట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటనలో పేర్కొంది. -
కరూర్ వైశ్యా బ్యాంక్ లాభం 52 శాతం అప్
చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 250 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 165 కోట్లతో పోలిస్తే సుమారు 52 శాతం వృద్ధి సాధించింది. ఇక నికర వడ్డీ ఆదాయం దాదాపు 21 శాతం పెరిగి రూ. 680 కోట్ల నుంచి రూ. 821 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.07 శాతానికి పెరిగింది. నికర మొండి బాకీలు (ఎన్పీఏ) 2.99 శాతం నుంచి 1.36 శాతానికి దిగివచ్చినట్లు బ్యాంకు ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వ్యాపార పరిమాణం దాదాపు 14 శాతం పెరిగి రూ. 1,35,460 కోట్లకు చేరినట్లు వివరించారు. దశాబ్ద కాలంలో వ్యాపారం రెట్టింపైనట్లు పేర్కొన్నారు. -
అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 229 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) క్యూ1లో కేవలం రూ. 109 కోట్లు ఆర్జించింది. వడ్డీ మార్జిన్లు బలపడటం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.55 శాతం నుంచి 3.82 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.97 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.69 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చాయి. ఈ బాటలో ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 247 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు వెనకడుగు వేశాయి. క్యూ1లో ఆభరణ రుణ పోర్ట్‌ఫోలియో 13 శాతం పుంజుకుని రూ. 14,873 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం లాభపడి రూ. 55.35 వద్ద ముగిసింది. చదవండి: Canara Bank: వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్! -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
కరూర్ వైశ్యా బ్యాంకు ద్వారా కస్టమ్స్ సుంకాల చెల్లింపు
ముంబై: కస్టమ్స్ సుంకాలను తమ ఖాతాదారులు ఇకపై ఐస్గేట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) వెల్లడించింది. ఇందుకోసం కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు చెందిన ఐస్గేట్లో (ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్‌వే) లింకు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ పోర్టల్‌లో తమ బ్యాంకును ఎంచుకోవడం ద్వారా ఖాతాదారులు నేరుగా కస్టమ్స్ సుంకాలను చెల్లించవచ్చని కేవీబీ ఎండీ బి. రమేష్ బాబు తెలిపారు. కొత్తగా కరెంటు అకౌంటు కస్టమర్లను పెంచుకునేందుకు కూడా తమకు ఈ సదుపాయం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పన్నుల వసూళ్లకు అధీకృత బ్యాంకుల జాబితాలో సీబీఐసీ గతంలో కేవీబీని కూడా చేర్చింది. -
వ్యాపారం పేరుతో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్ : వ్యాపార విస్తరణ పేరుతో తమ వద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడంతో పాటు గ్యారంటీగా పెట్టిన ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా విక్రయించారంటూ కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. సదరు బ్యాంకును రూ.25 కోట్ల మేర ముంచారనే ఆరోపణలపై సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారుల్ని అధికారులు ఇందులో నిందితులుగా చేర్చారు. ఈ గోల్మాల్ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రను అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఎస్డీ రోడ్లో ఉన్న వర్చ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను జైన్ హితీష్ రమేష్ కుమార్, రమేష్ కుమార్ ఒట్రమాల్ జైన్ డైరెక్టర్లుగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ, విస్తరణ కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ సికింద్రాబాద్ శాఖ నుంచి 2014లో రూ.15 కోట్ల రుణం పొందారు. దీంతో పాటు మరో రూ.15 కోట్లకు బ్యాంక్ గ్యారంటీగా (ఐలాండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్) తీసుకున్నారు. వ్యాపారంలో ముడిసరుకుల ఖరీదు, ఇతర అంశాల్లో ఐఎస్‌సీని వినియోగించుకుంటారు. ఇలా మొత్తం రూ.30 కోట్లు పొందిన రుణాన్ని 2015లో రూ.40 కోట్లకు పెంచారు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు (2017 వరకు) ఈ రుణాలను రెన్యువల్ చేస్తూ వెళ్లారు. రుణాలు పొందే సమయంలో బ్యాంకు గ్యారంటీగా హైదరాబాద్, సంగారెడ్డి, గుంటూరు, కర్నూలు, మెదక్ జిల్లాల్లో ఉన్న ఏడు స్థిరాస్తుల్ని బ్యాంకునకు దఖలు చేశారు. 2017 తర్వాత ఈ రుణాలకు సంబంధించి చెల్లింపులు, ఇతర అంశాలు ఆగిపోవడంతో బ్యాంకు అధికారులు తదుపరి కార్యాచరణ ప్రారంభించారు. 2018 మార్చ్‌లో ఈ రుణాలకు సంబంధించిన ఖాతాలను నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ కిందికి చేర్చారు. రుణాల వసూలులో భాగంగా బ్యాంకు అధికారులు సర్ఫేసీ యాక్ట్ ప్రకారం తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తుల్లో నాలుగింటిని విక్రయించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు తీసుకున్న రుణానికి, వాళ్లు తాకట్టు పెట్టిన ఆస్తులకు పొంతన లేదని తేలింది. ఆస్తుల విలువ చాలా తక్కువగా, అప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ష్యూరిటీగా పెట్టిన ఆస్తుల విక్రయం పోను వ్యాపారులు బ్యాంకునకు రూ.24.13 లక్షలకు పైగా చెల్లించాల్సినట్లు తేల్చారు. దీంతో ఆ సంస్థకు చెందిన బ్యాంకు స్టేట్మెంట్లు, వ్యాపార లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఫలితంగా వ్యాపారం కోసం తీసుకున్న రుణం పక్కదారి పట్టిందని, ఉద్దేశపూర్వకంగా ఆ దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ ఆరోపణలతో వ్యాపారులపై సీసీఎస్‌లో కరూర్ వైశ్యా బ్యాంకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు నేరం జరిగినట్లే తేల్చారు. దీంతో నిందితులపై చీటింగ్ సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం సికింద్రాబాద్ కరూర్ వైశ్యా బ్యాంకు పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యారంటీ పెట్టిన ఆస్తుల విలువకు, అప్పులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా గుర్తించలేకపోయారు? నిందితుల తమ ఆస్తులకు చూపిన మార్కెట్ విలువను రుణం మంజూరు సమయంలో ఎలా ధ్రువీకరించుకున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో కొందరికి నోటీసులు జారీ చేయడానికి సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
మళ్లీ కదులుతోంది
► తెరపైకి నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం ► కోర్టును ఆశ్రయించిన నిందితులు, బ్యాంకర్లపై ఫిర్యాదు రాజాం: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని కరూర్ వైశ్యాబ్యాంకులో నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఘటన వారం రోజుల క్రితం కలకలం రేపగా బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు రాజాం కోర్టుకు కేసును అప్పగించారు. ఈ లోగా నిందితుల్లోని ఓ వ్యక్తి రాజాం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. బ్యాంకు అధికారులు, పోలీసులు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది గురువారం కరూర్ వైశ్యాబ్యాంకుకు చేరుకొని మళ్లీ దర్యాప్తు నిర్వహించినట్టు తెలిసింది. అయితే పోలీసులు గాని, బ్యాంకు అధికారులు గాని ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు ఇప్పటికీ బ్యాంకులో రుణాలు కోసం బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులు విడిపించుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. -
పసిడి పేరుతో బురిడీ!
- బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు - రూ.19.40 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్న ఘనుడు జమ్మికుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కరూర్ వైశ్యాబ్యాంక్‌లో పసిడి పేరుతో ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.19.40 లక్షల వరకు గోల్డ్‌లోన్ తీసుకున్నాడు. ఇతనికి బ్యాంకులో పనిచేసే అప్రైజర్ సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కరూర్ వైశ్యాబ్యాంకులో కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన ముక్క సునీల్ కుమార్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ.5 కోట్ల వరకు పలువురికి బ్యాంకు నుంచి గోల్డ్‌లోన్ ఇప్పించాడు. 2016 జూలై నుంచి ఫిబ్రవరి 2017 వరకు పట్టణానికి చెందిన వ్యాపారి చిటికేశి జయప్రకాశ్ ద్వారా కిలో బంగారం తాకట్టు పెట్టించి రూ.19.40 లక్షల వరకు రుణం ఇప్పించాడు. మొదట రూ.80 వేలు రుణంగా తీసుకున్న జయప్రకాశ్.. నకిలీ బంగారాన్ని తాకట్టుపెడుతూ.. భారీ ఎత్తున నగదు తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో వైజాగ్ రీజియన్ కార్యాలయం నుంచి వచ్చిన వారు లాకర్లు తనిఖీ చేయగా, నకిలీ బంగారం బయట పడింది. విషయాన్ని బయటకు పొక్క కుండా వెంటనే అప్రైజర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రశ్నించారు. రికవరీ కోసం సునీల్ సస్పెన్స్ ఖాతాలో రూ.20 లక్షల వరకు రెండు చెక్కులతో డబ్బులను డిపాజిట్ చేయించుకున్నారు. ఖాతాను ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, బ్యాంకు మేనేజర్ సాయిబాబు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తనను బలిపశువు చేశారంటూ సునీల్‌కుమార్ మనోవేదనతో అనారోగ్యం పాలై హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రుణం తీసుకున్న జయప్రకాశ్ పరారీలో ఉన్నాడు. -
ఘరానా మోసం!
► నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ ► రూ. 1.33 కోట్లæ వరకూ టోకరా ► కరూర్ వైశ్యాబ్యాంకులో ఘటన ► రాజాంలో కలకలం ► బంగారు ఆభరణాల పరిశీలకుడే సూత్రధారి! జీతం ఇస్తున్న బ్యాంకుకే నష్టం కలిగించేలా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. రుణం కోసం బ్యాంకుకు తీసుకొచ్చే బంగారం అసలా..నకలీదా అని తేల్చాల్సిన వ్యక్తి కక్కుర్తికిపోయి..నకలీని అసలైనదిగా చెప్పి రుణాలు ఇప్పించేశాడు. తీరా తాకట్టు పెట్టిన బంగారాన్ని సమయం గడుస్తున్నా విడిపించకపోవడంతో అధికారులు వేలం వేసేందుకు సన్నద్ధమయ్యారు. మరోసారి బంగారాన్ని పరిశీలించగా నకలీదని తేలడంతో గుట్టురట్టయింది. 40 మంది ఖాతాదారుల ద్వారా నకిలీ బంగారం తాకట్టు పెట్టించి.. ఒకకోటీ 33 లక్షల 55 వేల రూపాయలను రుణాలుగా తీసుకెళ్లడానికి బంగారు ఆభరణాల పరిశీలకుడే కారకుడంటూ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘరానా మోసం రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న కరూర్ వైశ్యాబాంక్లో చోటుచేసుకుంది. మంగళవారం ఈ సంఘటన వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. రాజాం: రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. అయితే గడువు ముగుస్తున్నా చాలామంది బంగారాన్ని విడిపించలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ చంద్రమౌళిరెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో నోటీసులు పంపించారు. అయినా స్పందించలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీగా తేలడంతో విషయం బయటపడింది. అప్రైజరే కారకుడు.. బ్యాంకులో బంగారు ఆభరణాల ధ్రువీకరణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రాజాంకు చెందిన గాదల ఆనందరావు దీనికి కారకుడిగా అధికారులు గుర్తించారు. గత రెండేళ్లుగా అనుమానంగా ఉన్న బంగారు ఆభరణాలపై ఆరా తీయడంతో పాటు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 40 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 1, 33, 55,000 రుణాల రూపంలో ఖాతాదారులతో కలసి బ్యాంకు నుంచి తీసుకున్నట్టు గుర్తించారు. వెంటనే మేల్కొన్న బ్యాంకు మేనేజర్ మంగళవారం రాజాం సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్ వద్ద ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అప్రైజర్‌ను విచారించారు. అప్రైజర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాల ప్రకారం ఖాతాదారులను విచరించనున్నట్లు సీ తెలిపారు. రాజాంలో అలజడి బ్యాంకు రుణాలు నిమిత్తం నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టిన విషయం బయటకు రావడంతో రాజాంలో అలజడి ఏర్పడింది. ఈ ఘరానా మోసగాళ్లు ఎంత మంది ఉన్నారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. చాలా మంది వడ్డీ వ్యాపారులు బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చిన సంఘటనలు రాజాంలో ఉన్నాయి. ఇప్పుడు వీరంతా తమ తాకట్టుకు వచ్చిన ఆభరణాలు నకిలీవా, అసలువా అనే సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుకుంటున్నారు. మిగిలిన బ్యాంకుల్లో కూడా... నకిలీ బంగారం మిగిలిన బ్యాంకుల్లో కూడా ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులు సహకారంతోనే నకిలీ బంగారు రుణాలు ఇవ్వడం, మోసాలు జరిగి ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ...
-
కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి మూడు కొత్త సర్వీసులు
చెన్నై: వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా మూడు కొత్త టెక్నాలజీ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూపీఐ, బీబీపీఎస్ అనే సేవలను ఆవిష్కరించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ భాగస్వామ్యంతో ఫాస్టాగ్ సేవలను ఆవిష్కరించామని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె.వెంకటరమణ్ తెలిపారు. ‘ముందుగానే లోడ్ చేసిన ట్యాగ్స్‌ను వాహనాలకు అతికిస్తా రు. టోల్‌ప్లాజాలు సెన్సార్ల సాయంతో టోల్ అమౌంట్‌ను ఈ ట్యాగ్స్ ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్ చేసుకుంటాయి. తర్వాత ట్యాగ్స్‌ను డబ్బులతో మళ్లీ నింపుకోవచ్చు. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద అనుమతిస్తారు’ అని వివరించారు. అలాగే మొబైల్ ద్వారా ఇంటర్‌బ్యాంక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ కోసం ‘కేవీబీ యూపీఐ’ యాప్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఇక భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా యూజర్లు యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
బైక్‌లో దాచిన రూ.నాలుగున్నర లక్షలు మాయం
బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా డబ్బులు కాజేసిన సంఘటన గుంటూరు నగరంలోని నల్లచెరువు 9వ లైన్ మెయిన్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రూపేశ్ కాటన్ మిల్లులో పనిచేసే మురళి అనే వ్యక్తి గురువారం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.నాలుగున్నర లక్షలు డ్రా చేశాడు. ఇంటికి వెళ్లే దారిలో ఓ రేషన్ షాపు వద్ద బైక్‌ను ఆపి బియ్యం సంచి తీసుకెళ్దామని రేషన్ షాపులోకి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్ బ్యాగులో ఉంచిన నగదు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఉద్యోగాలు
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్.. మార్కెటింగ్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 4. వివరాలకు www.kvb.co.in చూడొచ్చు. ఎంఎన్ఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ఐటీ).. నాన్ టీచింగ్ విభాగంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.mnit.ac.in చూడొచ్చు. పోస్టల్ డిపార్టమెంట్లో స్పోర్ట్స కోటాలో.. డిపార్టమెంట్ ఆఫ్ పోస్ట్స్ కర్ణాటక సర్కిల్.. స్పోర్ట్స కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 20. వివరాలకు www.indiapost.gov.in చూడొచ్చు. బెంగళూరు ఈఎస్ఐసీలో ఖాళీలు బెంగళూరులోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్స్/ఫుల్‌టైం స్పెషలిస్ట్/పార్టటైం స్పెషలిస్ట్, పార్ట టైమ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 19. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 3, 4. వివరాలకు www.esipgirnr.kar.nic.in చూడొచ్చు. ఢిల్లీ నిట్‌లో ఫ్యాకల్టీ ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ (ఖాళీలు-5), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.nitdelhi.ac.in చూడొచ్చు. రామ్జాస్ కాలేజీలో నాన్ టీచింగ్ అసిస్టెంట్లు ఢిల్లీలోని రామ్జాస్ కాలేజ్.. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), సీనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-1), అసిస్టెంట్ (ఖాళీలు-1), జూనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-3), ప్రొఫెషనల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), ల్యాబ్ అసిస్టెంట్ (ఖాళీలు-4), ఎంటీఎస్ (ఖాళీలు-3) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.ramjascollege.edu చూడొచ్చు. ప్లాంట్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో పోస్టులు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ అసోసియేట్ (ఖాళీలు-5), సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు- 6) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 26. వివరాలకు niphm.gov.in చూడొచ్చు. రాజస్థాన్ ఓఎన్జీసీలో జూనియర్ అసిస్టెంట్లు రాజస్థాన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) జోధ్‌పూర్ ఫ్రంటియర్ బేసిన్.. వివిధ విభాగాల్లో ఏ-2 లెవల్ (ఖాళీలు-1), ఏ-1 లెవల్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖా స్తుకు చివరి తేది నవంబర్ 6. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు. ‘సెంట్రల్ మైన్ ప్లానింగ్’లో వికలాంగులకు... రాంచీలోని సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 14. వివరాలకు www.cmpdi.co.in చూడొచ్చు. -
కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలు
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్.. శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 25న తమిళనాడులోని కరూర్‌లో ఘనంగా జరిగాయి. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఒక లోగోను కూడా ఆవిష్కరించారు. బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ కె.వెంకటరామన్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 18 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. ట్రేడింగ్‌కు సంబంధించి కేవీబీ కమోడిటీ ప్లస్, కేవీబీ ఫుడ్ అండ్ ఆగ్రో ప్లస్ వంటివి ఇందులో ఉన్నాయి. 50 నెలల నుంచి 100 నెలల కాలవ్యవధితో అత్యధిక రిటర్న్ అందించే కేవీబీ సెంచురీ క్యాష్ సర్టిఫికేట్‌ను కూడా బ్యాంకు ఆవిష్కరించింది. బ్యాంక్ వ్యవస్థాపకులు ఎంఏ వెంకటరామ చెట్టియార్, ఆథి కృష్ణ చెట్టియార్లకు ఈ సందర్భంగా సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. -
డీసీ చైర్మన్, డెరైక్టర్లకు నాంపల్లి కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) దాఖలు చేసిన చెక్‌బౌన్స్ కేసులో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్లు పీకే అయ్యర్, వినాయక్ రవిరెడ్డిలతోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లు, ఇతర ఉద్యోగులకు నాంపల్లి కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. వీరందరినీ ఈ నెల 16న ప్రత్యక్షంగా హాజరై... చెల్లని చెక్కును ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణా యంత్రం కొనుగోలు కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.75 కోట్ల రుణాన్ని డీసీహెచ్ఎల్ తీసుకుంది. రుణ చెల్లింపుల్లో భాగంగా రూ.50 కోట్లకు చెక్కులిచ్చింది. అయితే డీసీహెచ్ఎల్ ఖాతాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఈ చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా బెంగళూరులోని ముద్రణా యంత్రంపై యాజమాన్య హక్కులను తమకు బదలాయించాలని కోరుతూ కేవీబీ రుణ వసూళ్ల ట్రిబ్యునల్(డీఆర్టీ)ను కూడా ఆశ్రయించింది. ఈ కేసు ఈ నెల 27న విచారణకు రానుంది.