ఘరానా మోసం!
ఘరానా మోసం!
Published Wed, Mar 22 2017 5:30 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
► నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
► రూ. 1.33 కోట్లæ వరకూ టోకరా
► కరూర్ వైశ్యాబ్యాంకులో ఘటన
► రాజాంలో కలకలం
► బంగారు ఆభరణాల పరిశీలకుడే సూత్రధారి!
జీతం ఇస్తున్న బ్యాంకుకే నష్టం కలిగించేలా ప్రవర్తించాడు ఓ ఉద్యోగి. రుణం కోసం బ్యాంకుకు తీసుకొచ్చే బంగారం అసలా..నకలీదా అని తేల్చాల్సిన వ్యక్తి కక్కుర్తికిపోయి..నకలీని అసలైనదిగా చెప్పి రుణాలు ఇప్పించేశాడు. తీరా తాకట్టు పెట్టిన బంగారాన్ని సమయం గడుస్తున్నా విడిపించకపోవడంతో అధికారులు వేలం వేసేందుకు సన్నద్ధమయ్యారు. మరోసారి బంగారాన్ని పరిశీలించగా నకలీదని తేలడంతో గుట్టురట్టయింది. 40 మంది ఖాతాదారుల ద్వారా నకిలీ బంగారం తాకట్టు పెట్టించి.. ఒకకోటీ 33 లక్షల 55 వేల రూపాయలను రుణాలుగా తీసుకెళ్లడానికి బంగారు ఆభరణాల పరిశీలకుడే కారకుడంటూ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘరానా మోసం రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న కరూర్ వైశ్యాబాంక్‌లో చోటుచేసుకుంది. మంగళవారం ఈ సంఘటన వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది.
రాజాం: రాజాంలోని కరూర్ వైశ్యాబ్యాంకులో గత ఏడాదిన్నర నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు ముమ్మరంగా అందించారు. అయితే గడువు ముగుస్తున్నా చాలామంది బంగారాన్ని విడిపించలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ చంద్రమౌళిరెడ్డికి అనుమానం వచ్చింది. దీంతో నోటీసులు పంపించారు. అయినా స్పందించలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ ఆరా తీయడం ప్రారంభించారు. మరోవైపు ఈ ఆభరణాలు వేలం వేసేందుకు గడువు రావడంతో బ్యాంకుకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజులు క్రితం బ్యాంకుకు చేరుకొని వేలంవేసే ఆభరణాలపై ఆరా తీశారు. వాటిని పరిశీలించగా నకిలీగా తేలడంతో విషయం బయటపడింది.
అప్రైజరే కారకుడు..
బ్యాంకులో బంగారు ఆభరణాల ధ్రువీకరణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రాజాంకు చెందిన గాదల ఆనందరావు దీనికి కారకుడిగా అధికారులు గుర్తించారు. గత రెండేళ్లుగా అనుమానంగా ఉన్న బంగారు ఆభరణాలపై ఆరా తీయడంతో పాటు వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 40 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 1, 33, 55,000 రుణాల రూపంలో ఖాతాదారులతో కలసి బ్యాంకు నుంచి తీసుకున్నట్టు గుర్తించారు. వెంటనే మేల్కొన్న బ్యాంకు మేనేజర్ మంగళవారం రాజాం సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు
సమాచారం తెలుసుకున్న సీఐ శంకరరావు బ్యాంకుకు చేరుకొని ఆరా తీశారు. మేనేజర్ వద్ద ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అప్రైజర్‌ను విచారించారు. అప్రైజర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు సంబంధించి అప్రైజర్ పాత్రతోపాటు బ్యాంకు మేనేజర్ ఇచ్చిన వివరాల ప్రకారం ఖాతాదారులను విచరించనున్నట్లు సీ తెలిపారు.
రాజాంలో అలజడి
బ్యాంకు రుణాలు నిమిత్తం నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టిన విషయం బయటకు రావడంతో రాజాంలో అలజడి ఏర్పడింది. ఈ ఘరానా మోసగాళ్లు ఎంత మంది ఉన్నారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. చాలా మంది వడ్డీ వ్యాపారులు బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చిన సంఘటనలు రాజాంలో ఉన్నాయి. ఇప్పుడు వీరంతా తమ తాకట్టుకు వచ్చిన ఆభరణాలు నకిలీవా, అసలువా అనే సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుకుంటున్నారు.
మిగిలిన బ్యాంకుల్లో కూడా...
నకిలీ బంగారం మిగిలిన బ్యాంకుల్లో కూడా ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులు సహకారంతోనే నకిలీ బంగారు రుణాలు ఇవ్వడం, మోసాలు జరిగి ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement