మళ్లీ కదులుతోంది
► తెరపైకి నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం
► కోర్టును ఆశ్రయించిన నిందితులు, బ్యాంకర్లపై ఫిర్యాదు
రాజాం: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని కరూర్ వైశ్యాబ్యాంకులో నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఘటన వారం రోజుల క్రితం కలకలం రేపగా బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు రాజాం కోర్టుకు కేసును అప్పగించారు. ఈ లోగా నిందితుల్లోని ఓ వ్యక్తి రాజాం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. బ్యాంకు అధికారులు, పోలీసులు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది గురువారం కరూర్ వైశ్యాబ్యాంకుకు చేరుకొని మళ్లీ దర్యాప్తు నిర్వహించినట్టు తెలిసింది. అయితే పోలీసులు గాని, బ్యాంకు అధికారులు గాని ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు ఇప్పటికీ బ్యాంకులో రుణాలు కోసం బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులు విడిపించుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.