![Gold collateral loans have also increased in banks](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/gold.jpg.webp?itok=g_pf0orj)
అప్పుల కోసం పుత్తడి తాకట్టు వైపు జనం మొగ్గు
సురక్షిత సాధనంగా అవతరించిన పసిడి
బంగారంపై తీసుకునే రుణాల్లో దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగం
రూ.1,72,581 కోట్ల రుణాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి..
ఏడాదిలో బంగారం రుణ మార్కెట్ వృద్ధి 71.3%
సాక్షి, బిజినెస్ బ్యూరో: బంగారం ధర ఒక్కటే కాదు.. బ్యాంకుల్లో పసిడి తాకట్టు రుణాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్‌లో రూ.1,01,552 కోట్లుగా ఉన్న బంగారు రుణాలు.. డిసెంబర్ నాటికి రూ.1,72,581 కోట్లకు చేరాయి. అదే 2023 డిసెంబర్‌తో పోలిస్తే బంగారం రుణాల్లో ఏకంగా 71.3 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. అంతకుముందు ఏడాదిలో ఇది 17 శాతమే.
భారత్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మొత్తం పసిడి రుణాలు డిసెంబర్ నాటికి 41.66 శాతం పెరిగి.. రూ.43,745 కోట్లకు చేరాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న గోల్డ్ లోన్స్ తీరును ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. పసిడి ధరలకు రెక్కలు రావడంతో ఆభరణాలపై అందుకునే లోన్ విలువ కూడా పెరిగింది.
రుణ గ్రహీతలు తమకు ఉన్న ఇతర రుణాల చెల్లింపుల కోసం గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతు న్నాయి. పెట్టుబడికే కాదు చదువులు, ఆరోగ్యం, వివాహం ఇలా ఏ అవసరంలోనైనా ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం కొనిపెట్టుకోవడం, అవసరానికి తాకట్టు పెట్టడం పెరుగుతోంది.
బంగారం లాంటి సౌలభ్యం!
ఎవరైనా ఇతర రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ హిస్టరీ తప్పదు. పైగా ప్రతి నెల ఈఎంఐ రూపంలో వడ్డీ, అసలు కట్టాల్సిందే. అదే గోల్డ్ లోన్‌కు ఏ అడ్డంకీ లేదు. నగలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత రుణం. చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుంది. నిర్దేశిత కాల పరిమితి ముగిసే సమయానికి బాకీపడ్డ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు, తీసుకునే మొత్తాన్ని బట్టి వార్షిక వడ్డీ 9 నుంచి 26 శాతం వరకు ఉంది.
ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు. 10 నిమిషాల్లో అప్పు పుడుతుంది. ఇంటికొచ్చి మరీ బంగారం రుణాలిస్తుస్న సంస్థలూ ఉన్నాయి. ఆభరణాల స్వచ్ఛతను బట్టి విలువలో 75 శాతం వరకు రుణం అందుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు 90 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి.
నెల నెలా వడ్డీ కట్టే విధానంగానీ, కాలపరిమితి ముగిశాక ఒకేసారి అసలు, వడ్డీ చెల్లించే విధానంగానీ ఎంచుకోవచ్చు. రుణం చెల్లించడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తారు. అయినా స్పందించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తారు.
బంగారం, రుణాల లెక్కలివీ..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం... 2024లో దేశంలో బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా నమోదైంది. 2023లో ఇది 761 టన్నులు మాత్రమే. భారతీయుల వద్ద మొత్తంగా సుమారు 25,000 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నట్టు అంచనా. ఇందులో 5.6 శాతం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. 2023–24లో పుత్తడి రుణ విపణి రూ.7.1 లక్షల కోట్లుగా ఉంటే.. రెండేళ్లలోనే రెండింతలైంది.
మొత్తం బంగారం రుణాల్లో రూరల్ వాటా 35%, సెమీ అర్బన్ 42%, అర్బన్ వాటా 23 శాతంగా నమోదైంది. ఇక ఎన్‌బీఎఫ్‌సీలు అందిస్తున్న బంగారం రుణాల్లో రూ.30,000లోపు తీసుకునేవే 50శాతం దాకా ఉన్నాయి. అన్‌సెక్యూర్డ్ లోన్స్, క్రెడిట్ కార్డుల కంటే గోల్డ్ లోన్ చవక. బంగారం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 63 శాతంకాగా.. మిగిలినది ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకులది.
ఇతర రుణాలు కఠినతరం కావడంతో..
బ్యాంకుల కఠిన నిబంధనల కారణంగా పర్సనల్ లోన్లు, క్రెడిట్‌కార్డులు వంటి అన్‌సెక్యూర్డ్ రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణగ్రహీతలు ప్రత్యామ్నాయంగా బంగారం రుణాలపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత రుణాల విభాగం 2023 డిసెంబర్‌లో నమోదైన 20.8%తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో వృద్ధి 9.7 శాతమే కావడం గమనార్హం.
క్రెడిట్ కార్డ్ రుణాలు 2024 డిసెంబర్‌లో 15.6% పెరిగాయి. ముందటి ఏడాదిలో ఇది 32.6%. గృహ, వాహనాలు, క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు సహా రిటైల్ లోన్ విభాగంలో బ్యాంకుల రుణాల వృద్ధి 2023 డిసెంబర్‌లో 17.6% నుంచి 2024డిసెంబర్‌లో 14.9 శాతానికి తగ్గిపోయిందని రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
స్టేట్ బ్యాంకులో గోల్డ్‌లోన్ ఇలా..
ఎస్‌బీఐ.. 18–22 క్యారెట్ల ఆభరణాల స్వచ్ఛతను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ప్రతి 10 గ్రాములకు రూ.45,000 వరకు రుణం ఇస్తోంది. రుణ గ్రహీత మూడేళ్ల వరకు వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత లోన్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్ రీపేమెంట్ విధానంలో 6 నెలలు లేదా 12 నెలల వ్యవధిని ఎంచుకోవచ్చు.
ఈ విధానంలో గరిష్టంగా 10 గ్రాములకు రూ.48,000 వరకు లోన్ అందుకోవచ్చు. ప్రతి నెలా నిర్ధేశిత వడ్డీ చెల్లించాలి. టెన్యూర్ ముగిసే ముందు అసలు మొత్తాన్ని కట్టి లోన్‌ను క్లోజ్ చేసుకోవాలి. అయితే గోల్డ్ లోన్‌పై 90 రోజులపాటు వడ్డీ చెల్లించకపోతే ఖాతా ఎన్‌పీఏ (మొండి బకాయి) అవుతుంది. ఆ తర్వాత 90 రోజుల దాకా కూడా కస్టమర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే బంగారాన్ని వేలం వేస్తారు.
ధర పెరిగి.. ఎక్కువ రుణం..
పసిడి ధర పెరిగిపోతుండటంతో దానిపై అందుకునే లోన్ మొత్తమూ పెరుగుతోంది. దీనితో జనం తమ అవసరాల కోసం బంగారం లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పుత్తడి ధర హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.87,650 దాటింది. గతేడాది ధర సుమారు రూ.64,000 మాత్రమే కావడం గమనార్హం.
బంగారంపై రుణాల తీరు ఇదీ..
వార్షిక వడ్డీ: 9% నుంచి 26% వరకు
రుణమిచ్చేది: కనిష్టంగా రూ.1,500 నుంచి గరిష్టంగా రూ.5 కోట్ల వరకు
కాల పరిమితి: 7 రోజుల నుంచి 4 ఏళ్ల వరకు..
ఆభరణం విలువలో రుణం: గరిష్టంగా 75 శాతం
Comments
Please login to add a commentAdd a comment