కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలు
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్.. శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 25న తమిళనాడులోని కరూర్‌లో ఘనంగా జరిగాయి. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఒక లోగోను కూడా ఆవిష్కరించారు. బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ కె.వెంకటరామన్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 18 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. ట్రేడింగ్‌కు సంబంధించి కేవీబీ కమోడిటీ ప్లస్, కేవీబీ ఫుడ్ అండ్ ఆగ్రో ప్లస్ వంటివి ఇందులో ఉన్నాయి. 50 నెలల నుంచి 100 నెలల కాలవ్యవధితో అత్యధిక రిటర్న్ అందించే కేవీబీ సెంచురీ క్యాష్ సర్టిఫికేట్‌ను కూడా బ్యాంకు ఆవిష్కరించింది. బ్యాంక్ వ్యవస్థాపకులు ఎంఏ వెంకటరామ చెట్టియార్, ఆథి కృష్ణ చెట్టియార్‌లకు ఈ సందర్భంగా సిబ్బంది ఘన నివాళులు అర్పించారు.