gm rao
-
విమానాశ్రయాలపై రూ.20,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.20,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్మాణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను ఏర్పరిచామని కంపెనీ వార్షిక నివేదికలో గ్రూప్ చైర్మన్ జీఎం రావు తెలిపారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మౌలిక వసతుల విస్తరణ, టెర్మినల్ వార్షిక సామర్థ్యం 10 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంపు పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 3ఏ విస్తరణ 2023 జూన్ నాటికి పూర్తి కానుంది. 2022 సెప్టెంబర్ నాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వార్షిక సామర్థ్యం 3.5 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుకుంటుంది’ అని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కర్ణాటకలోని బీదర్, ఫిలి ప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. నాగ్‌పూర్ విమానాశ్రయం..: నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో జీఎంఆర్‌కు అనుకూలంగా బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కంపెనీ తదుపరి ప్రణాళిక వెల్లడించింది. నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధిలో భాగంగా వార్షిక సామర్థ్యాన్ని రాబోయే కాలంలో 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేర్చనున్నారు. నాలుగేళ్లలో పూర్తి కానున్న తొలి దశలో 40 లక్షల ప్రయాణికులు, 20,000 మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించే స్థాయికి విమానాశ్రయం చేరనుంది. -
కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలు
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్.. శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 25న తమిళనాడులోని కరూర్‌లో ఘనంగా జరిగాయి. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఒక లోగోను కూడా ఆవిష్కరించారు. బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ కె.వెంకటరామన్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 18 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు. ట్రేడింగ్‌కు సంబంధించి కేవీబీ కమోడిటీ ప్లస్, కేవీబీ ఫుడ్ అండ్ ఆగ్రో ప్లస్ వంటివి ఇందులో ఉన్నాయి. 50 నెలల నుంచి 100 నెలల కాలవ్యవధితో అత్యధిక రిటర్న్ అందించే కేవీబీ సెంచురీ క్యాష్ సర్టిఫికేట్‌ను కూడా బ్యాంకు ఆవిష్కరించింది. బ్యాంక్ వ్యవస్థాపకులు ఎంఏ వెంకటరామ చెట్టియార్, ఆథి కృష్ణ చెట్టియార్లకు ఈ సందర్భంగా సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. -
దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ
ముంబై: దాతృత్వంలో బిల్‌గేట్స్ అంతటి స్థాయిలో కాకపోయినా దేశీ కార్పొరేట్లు కూడా వందలు, వేల కోట్ల రూపాయల విరాళాలిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రూ. 8వేల కోట్లు విరాళమిచ్చి ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉండగా.. మన తెలుగువారైన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎంరావు రూ. 740 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన హురున్ రిపోర్ట్ 2013కి సంబంధించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఏడాది కాలంలో అజీం ప్రేమ్‌జీ రూ.8,000 కోట్లు విరాళమిచ్చారు. హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్మన్ శివ నాడార్ రూ.3,000 కోట్లతో రెండో స్థానంలో నిల్చారు. వెనుకబడిన బాలల విద్యాభ్యాసానికి తోడ్పాటం దించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జీఎం రావు రూ.740 కోట్లు విరాళమిచ్చా రు. రూ. 530 కోట్ల విరాళంతో నందన్ నీలేకని, రోహిణి నీలేకని దంపతులు 4వ స్థానంలో ఉండగా, స్వదేశ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.470 కోట్లు వెచ్చించి రోనీ స్క్రూవాలా అయిదో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చ్ 31లోగా రూ. 10 కోట్లకు మించి నగదు, తత్సమాన విరాళాలు ఇచ్చిన 31 మంది భారతీయులతో హురున్ ఇండియా ఈ జాబితా రూపొందించింది. -
అభివృద్ధిలో యువత పాత్ర కీలకం
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: ఆర్థికంగా భారత్ శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎం రావు పేర్కొన్నారు. త్వరలో మన దేశం మూడో స్థానానికి చేరుకుంటుందని, ఇందులో యువత పాత్ర కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో డాక్టర్ ఆర్ఆర్-డీఆర్‌ఎస్‌ఆర్ వేల్‌టెక్ వర్శిటీ మూడో వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్శిటీ వ్యవస్థాపకుడు కల్నల్ డాక్టర్ రంగరాజన్ అధ్యక్షత వహించారు. వైస్ చైర్మన్ శకుంతల అధ్యక్షోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎం రావు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్ సత్యమూర్తి హాజరయ్యారు. సమాజసేవలో జీఎం రావుకు,సత్యమూర్తికి గౌరవ డాక్టరేట్లను వేల్‌టెక్ వర్శిటీ అందజేసింది. ఈ సందర్భంగా జీఎం రావు మాట్లాడుతూ ఆర్థికంగా ముందుకు దూసుకుపోతున్న భారత్ రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు సవాల్ విసరనుందన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 500 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయని, ఇక్కడున్న మౌలిక సదుపాయాలకు మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విజయాల్లో యువత పాత్ర కీలకమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. పాజిటీవ్ దృక్పథంతో విద్యార్థులు ముందుకుసాగాలన్నారు. విజ యం రోజుల్లో రాదని, నిరంతరం కష్టపడాలన్నారు. విద్యార్థులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని, సమాజసేవకు సహకారం అందించాలని డాక్టర్ సత్యమూర్తి సూచించారు. యూనివర్శిటీ స్థాయిలో ర్యాంకులు సాధించిన 53 మంది విద్యార్థులకు బంగారు పతకాలను, 1110 మందికి డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌కిషోర్‌కుమార్, రంగరాజన్ మహలక్ష్మి, ఛాన్సలర్ బాజ్‌పాయి, పట్టాబిరామన్, వీసీ బీలాసత్యనారాయణతో పాటు విద్యార్థులు హాజరయ్యారు.