Bank of Maharashtra
-
పెరిగిన బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44 శాతం ఎగసి రూ. 1,327 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో సంస్థ లాభం కేవలం రూ. 920 కోట్లు. మొత్తం ఆదాయం సైతం రూ. 5,736 కోట్ల నుంచి రూ. 6,809 కోట్లకు జంప్ చేసింది.నికర వడ్డీ ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ.2,807 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 3.98 శాతానికి బలపడ్డాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో బీవోఎం గరిష్ట మార్జిన్లు ఆర్జించినట్లు బ్యాంక్ ఎండీ నిధు సక్సేనా పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రూ. 5,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలున్నట్లు అంచనా వేశారు. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.19% నుంచి 1.84 శాతానికి, నికర ఎన్పీఏలు 0.23 % నుంచి 0.2 శాతానికి దిగివచ్చాయి. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫలితాలు బాగున్నాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2023–24 రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ2 లో నికర లాభం 72% జంప్‌చేసి రూ. 920 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నిర్వహణ లాభం 31% బలపడి రూ. 1,920 కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ ఏఎస్ రాజీవ్ పేర్కొన్నారు. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,317 కోట్ల నుంచి రూ. 5,796 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు 3.4% నుంచి 2.19%కి తగ్గాయి. -
నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్ మంజూరు చేసింది. నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్ జూన్ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు ఆర్అండ్బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్ ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. -
తగ్గిన వడ్డీ రేట్లు.. ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రద్దు.. బ్యాంక్ సంచలన నిర్ణయం!
Bank Of Maharashtra: ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అమాంతం మునిగిపోతారు. బ్యాంకుల వద్ద తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ అంటూ ఎన్నెన్నో వసూలు చేస్తారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఒక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులు తీసుకునే లోన్ మీద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వడ్డీ రేటుని కూడా భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అకౌంట్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హౌస్ అండ్ కార్ లోన్ వడ్డీ రేటుని 0.20 శాతం తగ్గించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మాఫీ చేసింది. దీంతో కారు లోన్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. హౌస్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి (0.10 శాతం తగ్గింపు) చేరింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రూల్స్ 2023 ఆగష్టు 14 నుంచి అమలులో ఉంటాయని తెలుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు కస్టమర్లతో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సహాయపడింది. అంతే కాకూండా లోనే తీసుకునే వారి సంఖ్య కూడా దీని వల్ల పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆర్బీఐ వదిలినా.. ఆ మూడు బ్యాంకుల ఖాతాదారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా మూడవసారి 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్ల పెంపువైపే మొగ్గుచూపుతుండడం గమనార్హం. వ్యవస్థలో తగిన రుణ డిమాండ్ ఉందన్న విషయాన్ని బ్యాంకుల తాజా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ నిర్ణయాలతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణరేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగ రుణాలు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి. తాజా మార్పుతో ఏడాది బ్యాంకింగ్ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల తీరిదీ... బీఓబీ: రుణ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరగనుంది. ఆగస్టు 12 నుంచి ఈ రేటు అమలవుతుంది. కెనరా బ్యాంక్: ఆగస్టు 12 నుంచి 8.65 శాతం నుంచి 8.7 శాతానికి పెరగనుంది. బీఓఎం: తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రేటు 10 బేసిస్ పాయింట్లు ఎగసి 8.60కి ఎగసింది. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
కస్టమర్‌ను దేవునిగా చూడండి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచాలని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా బ్యాంకులు తమ ఖాతాదారులను దేవుడిలా చూడాలని కోరారు. బ్యాంకులు కస్టమర్లకు వచ్చే ఇబ్బందులు తగ్గించడంపై పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిర్వహించిన కస్టమర్ మీట్ కార్యక్రమంలో కరాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బ్యాంకులు పటిష్టంగా ఉండడానికి కస్టమర్లూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా రుణాల చెల్లింపులో వారు పూర్తి క్రమశిక్షణను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) స్కీమ్‌ను మరింత మంది రైతులకు విస్తరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డిజిటలైజేషన్‌పై తమ బ్యాంక్ అత్యధిక దృష్టి సారిస్తున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న బీఓఎం మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి స్థూల రుణాలు రూ.1.57 లక్షల కోట్లకు ఎగశాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21.81 శాతం వృద్ధి అని బ్యాంక్ తెలిపింది. డిపాజిట్లు 11.69 శాతం అధికమై రూ.2.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ) 52.50 శాతంగా ఉంది. 2022 డిసెంబర్ చివరినాటికి మొత్తం వ్యాపారం 15.83% వృద్ధి చెంది రూ.3.65 లక్షల కోట్లను నమోదు చేసింది. చదవండి: పేటీఎం యూజర్లకు బంపరాఫర్ -
HYD: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పదిమందికి జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్ మేనేజర్‌తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రాడ్ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఇది. ఈ కేసులో సికింద్రాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుహాస్ కళ్యాణ్ రామ్‌దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు. శరత్, సుహాస్‌లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం -
లోన్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) 20 బేసిస్ పాయింట్లు లేక 0.2 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఎస్బీఐసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ రుణ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం బ్యాంక్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 7.60 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం రెట్టింపు!
ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మంచి పనితీరు ప్రదర్శించింది. స్టాండలోన్ లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.452 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.208 కోట్లు కావడం గమనించాలి. లాభంలో 117 శాతం వృద్ధిని చూపించినట్టు బ్యాంకు ఎండీ, సీఈవో ఏఎస్ రాజీవ్ తెలిపారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు ఉన్నా కానీ తాము మంచి ఫలితాలను సాధించినట్టు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికం నుంచి అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని, భవిష్యత్తు వృద్ధి పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతానికి పైగా పెరిగి రూ.1,686 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.05 శాతం నుంచి 3.28 శాతానికి పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 6.35 శాతం నుంచి 3.74 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 2.22 శాతం నుంచి 0.88 శాతానికి పరిమితమయ్యాయి. తాజాగా రూ.697 కోట్ల రుణాలు ఎన్పీఏల జాబితాలోకి చేరాయి. -
పెద్దలను ముట్టుకోరు... పేద రైతులపైనే ప్రతాపం
న్యూఢిల్లీ: బ్యాంకుల పనితీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘భారీ మొత్తాల్లో రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలను నిలదీయడానికి, వాళ్లమీద కేసులు పెట్టడానికి మీకు చేతులు రావు. పేద రైతులను మాత్రం వెంటపడి వేధిస్తారు’’ అంటూ తప్పుబట్టింది. మోహన్‌లాల్ పటీదార్ అనే రైతు తీసుకున్న రుణానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో సవాలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీరును తీవ్రంగా తప్పుబడుతూ సునిశిత విమర్శలు చేసింది. ‘‘పెద్దవాళ్లు తీసుకునే భారీ రుణాల వసూలుకు మీరు ప్రయత్నం చేయరు. రైతుల విషయంలో మాత్రమే మీకు చట్టం గుర్తొస్తుంది. ఓటీఎస్ పథకం కింద రూ.36.5 లక్షలు కట్టాలని ఆ రైతుకు మీరే ఆఫర్ చేశారు. అతను 95 శాతం పైగా చెల్లించాక కట్టాల్సిన మొత్తాన్ని రూ.50.5 లక్షలకు పెంచారు. పైగా దాన్ని వసూలు చేసుకునేందుకు కోర్టుకెక్కారు. మేమలాంటి ఏకపక్ష నిర్ణయం వెలువరించే సమస్యే లేదు. అది అర్థరహితమే కాదు, సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం’’ అంటూ తలంటింది. కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పు ఇస్తే అది అందరికీ సాకుగా మారుతుందన్న బ్యాంకు తరఫు న్యాయవాది గరిమా ప్రసాద్ చేసిన వాదనను తోసిపుచ్చింది. బ్యాంకు విజ్ఞప్తిని అంగీకరిస్తే పేద రైతు ఆర్థికంగా చితికిపోతాడని జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఆ బ్యాంకులో వడ్డీ రేటు 6.40% మాత్రమే!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎమ్) 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ కింద ప్రస్తుతం గృహ రుణాలపై ఉన్న వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, మార్కెట్ పోటీకి అనుగుణంగా కారు రుణాలపై ప్రస్తుతం ఉన్న 7.05 శాతం వడ్డీ రేటును కూడా 6.80 శాతానికి బ్యాంకు తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమల్లోకి ఉంటాయని బీఓఎమ్ ఒక ప్రకటనలో తెలిపింది. 'రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా' ఆఫర్ రేటు రుణగ్రహీతల క్రెడిట్ స్కోరుతో ముడిపడి ఉంటుందని తెలిపింది. బ్యాంకు ఇప్పటికే తన బంగారం, గృహ నిర్మాణం & కారు రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. "రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వల్ల వినియోగదారులు తమ రుణాలపై మరింత ఆదా చేసుకోవచ్చు అని, ఇది వారి జీవితాల్లో సంతోషాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని మేము నమ్ముతున్నాము" అని బీఓఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు. (చదవండి: మా మహేంద్రా ట్రాక్టరుతో ఇలా నడపాలంటే జర జాగ్రత్త!: ఆనంద్ మహీంద్రా) -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు -
కూలిన బ్యాంకు పైకప్పు..
షోలాపూర్ : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన భవనం పైకప్పు కూలిన ఘటనలో 20 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన షోలాపూర్‌కు సమీపంలోని కర్మాలాలో బుధవారం చోటుచేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 10 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మిగతా వారిని కూడా బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వేల కార్లను ఎటాచ్ చేసింది. వీటి విలువ 1610 కోట్ల రూపాయలు. సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్విఎల్ఎల్) సంస్థ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకులో చోటు చేసుకున్న రూ. 836.29 కోట్ల స్కాంకు సంబంధించి ఈడీ ఈ చర్య చేపట్టింది. నకిలీ పత్రాల, నకిలీ పేర్లతో భారీ ఎత్తు రుణాలు, నిధుల మళ్లింపుతోపాటు, అనేక అవతవకల ఆరోపణల నేపథ్యంలో ఎస్విఎల్ఎల్ కంపెనీపై 2016లో సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ కంపెనీ, దాని డైరెక్టర్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ రూప్‌చంద్ బైద్‌ను గతంలోనే అరెస్ట్ చేసింది. వ్యక్తిగత లాభాల కోసం సంస్థ ఉద్యోగులు, డ్రైవర్ల పేర్లతో, తప్పుడు పేపర్లను ఉపయోగించి బ్యాంకుల నుండి అనేక రుణాలు పొందిందనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈ అక్రమాల్లో రూప్‌చంద్ కీలక పాత్ర పోషించాడని, సంబంధిత సంస్థల వివిధ ఖాతాల ద్వారా రుణాలను పొంది, వాటిని దారి మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2002 నుంచి సిద్ధి వినాయక్ లాజిస్టిక్ లిమిటెడ్ ముంబై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చాలక్ సే మాలక్ (డ్రైవర్ టూది ఓనర్) పేరుతో పాత, కొత్త వాహనాల కొనుగోలుపై వివిధ రుణ సదుపాయాలందిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్‌సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నెట్ వర్క్ ఉంది. మరోవైపు ఇప్పటికే (2017, జూన్) 19 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ED attaches movable properties comprising 6170 vehicles worth Rs.1609.78 Crores of M/s Sidhi Vinayak Logistics Ltd (SVLL), Mumbai in a bank fraud case under PMLA, 2002. — ED (@dir_ed) June 18, 2019 -
51 బ్యాంక్ బ్రాంచులు మూత
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా తనకున్న 51 బ్రాంచులను మూసివేస్తోంది. బ్యాంకింగ్ పరిశ్రమలో అమలు చేస్తున్న వ్యయ కోత చర్యల్లో భాగంగా తమ 51 బ్రాంచులను మూసివేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు చెప్పారు. మూసివేసే అన్ని బ్రాంచులు కూడా పట్టణ సెంటర్లకు చెందినవే. భారీ నష్టాలు సంభవిస్తూ.. అసమర్థంగా పడి ఉన్న బ్రాంచులను తాము గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. 51 బ్రాంచుల్లో కొన్నింటిన్నీ పూర్తిగా మూసివేస్తుండగా.. కొన్నింటిన్నీ పక్క బ్రాంచుల్లో విలీనం చేస్తున్నారు. ప్రజా సౌలభ్యం కోసమే ఈ బ్రాంచులను మూసివేయడం, విలీనం చేయడం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ బ్రాంచుల ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లను కూడా రద్దు చేశారు అధికారులు. అన్ని సేవింగ్స్ అకౌంట్లను, కరెంట్ అకౌంట్లను, ఇతర బ్యాంక్ అకౌంట్లను విలీనం చేసిన బ్రాంచులకు బదిలీ చేశామని అధికారులు తెలిపారు. నవంబర్ 30 వరకు కస్టమర్లందరూ పాత ఐఎఫ్ఎస్సీ/ఎంఐసీఆర్ కోడ్లతో ఉన్న తమ చెక్-బుక్‌లను మూత పడే బ్రాంచులు వద్ద డిపాజిట్ చేయాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆదేశించింది. కొత్త బ్రాంచుల వద్ద ఐఎఫ్ఎస్సీ/ఎంఐసీఆర్ కోడ్లతో ఉన్న తమ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్లను సేకరించుకోవాలని చెప్పింది. డిసెంబర్ 31 నుంచి శాశ్వతంగా పాత ఐఎఫ్ఎస్సీ/ఎంఐసీఆర్ కోడ్లను రద్దు చేయనుంది. ఇక అప్పటి నుంచి బ్యాంక్ లావాదేవీలన్నీ కొత్త ఐఎఫ్ఎస్సీ/ఎంఐసీఆర్ కోడ్లతోనే జరగాల్సి ఉంటుంది. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తొలగింపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) తాజాగా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి.మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె.గుప్తాలను పదవుల నుంచి తొలగించింది. బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.సి.రౌత్.. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని బ్యాంక్ పేర్కొంది. పుణే పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరాఠే, గుప్తాలను రూ.2,043 కోట్ల స్కామ్‌కు సంబంధించి చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. -
బ్యాంకర్లను వేధించే ఉద్దేశం లేదు
ముంబై: రియల్ ఎస్టేట్ సంస్థ డీఎస్కే గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, ఈడీల అరెస్టులు అసాధారణమైనవని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఉదంతం ఆధారంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులను కేంద్రం వేధిస్తోందని భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఏఐఐబీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అధికారి ఈ వివరాలు తెలిపారు. డీఎస్కే గ్రూప్ అధినేత డీఎస్ కులకర్ణితో కుమ్మక్కై రుణ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై బీవోఎం ఎండీ రవీంద్ర మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర గుప్తా, జోనల్ మేనేజర్ నిత్యానంద్ దేశ్‌పాండే, మాజీ చైర్మన్ సుశీల్ మునూత్ తదితరులు అరెస్టయిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన ఈ అరెస్టులపై బ్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సమాఖ్య విధానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సీబీఐకి రిఫర్ చేయాలే తప్ప రాష్ట్ర స్థాయి పోలీసులు ఎకాయెకిన అరెస్టులు చేయడానికి ఉండదని అధికారి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగులపై చర్యలకు సంబంధించి కేంద్రం కూడా సదరు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. మరోవైపు, ఆర్థిక అవకతవకల కేసుల్లో సీనియర్ బ్యాంకర్లను అరెస్టులు చేయాల్సి వస్తే ప్రత్యేక విధానమంటూ ఉండేలా ఎక్స్టర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలన్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు. అసాధారణంగా ఏదో ఒకసారి జరిగిన దాన్ని సంచలనం చేయరాదని, ఇలాంటివి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు. -
అవినీతి ఉచ్చులో మరో బ్యాంకరు
పుణె: కార్పొరేట్ కంపెనీల రుణాల ఎగవేత కుంభకోణంలో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా డీఎస్ కులకర్ణి గ్రూప్ డిఫాల్ట్ కేసుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, సీఈవో రవీంద్ర మరాఠేతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తాను పుణెలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్ట్ చేసింది. బ్యాంకు మాజీ సీఎండీ సుశీల్ మునోత్‌ను కూడా అదుపులోకి తీసుకుంది. డీఎస్కే గ్రూప్‌తో కుమ్మక్కైన బీవోఎం అధికారులు మోసపూరిత లావాదేవీల ద్వారా రుణాలిచ్చారని ఆరోపణలున్నాయి. బ్యాంకు సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రుణాల కింద మంజూరు చేసిన నిధులు దారి మళ్లాయని ఈవోడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 3,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర తదితర అభియోగాలపై ఈవోడబ్ల్యూ అరెస్ట్ చేసింది. సుమారు రూ.2,892 కోట్ల బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, 4,000 మంది పైచిలుకు ఇన్వెస్టర్లను రూ. 1,154 కోట్ల మేర మోసగించడం తదితర ఆరోపణలపై బిల్డరు డీఎస్ కులకర్ణి, ఆయన భార్య హేమంతి ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ అధికారులతో పాటు డీఎస్కే గ్రూప్‌కి చెందిన మరో ఇద్దరిని కూడా ఈవోడబ్ల్యూ అదుపులోకి తీసుకుంది. ఇందులో చార్టర్డ్ అకౌంటెంట్ సునీల్ ఘట్పాండే, ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద్ దేశ్‌పాండే ఉన్నారు. ఇన్వెస్టర్లను మోసగించినందుకు కులకర్ణి, ఆయన భార్యతో పాటు డీఎస్కే గ్రూప్‌లోని ఇతర కీలక అధికారులకు చెందిన 124 ప్రాపర్టీలు, 276 బ్యాంకు ఖాతాలు, 46 వాహనాలు జప్తు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. -
చిక్కులో మరో టాప్ బ్యాంకర్
పుణే : వీడియోకాన్ రుణ వివాద కేసులో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ అయిన చందాకొచర్ తీవ్ర ఇరకాటంలో పడగా.. మరో టాప్ బ్యాంకర్ కూడా చిక్కుల్లో కూరుకున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఈఓ, ఎండీ రవీంద్ర మరాథేను ఆర్థిక నేరాల వింగ్ అరెస్ట్ చేసింది. రూ.3 వేల కోట్ల డీఎస్కే గ్రూప్ రుణ ఎగవేత కేసులో రవీంద్ర మరాథేతో పాటు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తాను ఆర్థిక నేరాల వింగ్ అదుపులోకి తీసుకుంది. ఈ రుణ ఎగవేత కేసుతో సంబంధం ఉన్న జైపూర్‌కు చెందిన బ్యాంక్ మాజీ సీఎండీ సుశిల్ మునోట్ కూడా పట్టుబడ్డారు. అరెస్ట్ అయిన ఈ ముగ్గురిపై చీటింగ్, ఫోర్జరీ నేర కుట్ర, నమ్మకాన్ని ఒమ్ము చేయడం వంటి వాటిపై కేసు బుక్ చేసినట్టు పోలీసులు తెలిపారు. డీఎస్కే గ్రూప్‌తో కలిసి ఈ అధికారులు, మోసపూరిత లావాదేవీలు చేశారని పుణేకు చెందిన ఆర్థిక నేరాల వింగ్ ఆరోపిస్తోంది. 4వేల మంది ఇన్వెస్టర్లను రూ.1,154 కోట్లకు మోసం చేసినందుకు గాను, పుణేకు చెందిన డీఎస్ కులకర్ని, అతని భార్య హేమంతీని ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అంతేకాక రూ.2,892 కోట్ల రుణాలను కూడా వీరు దారి మళ్లించినట్టు తెలిసింది. డీఎస్కే డెవలపర్స్ లిమిటెడ్‌తో కలిసి బ్యాంక్ అధికారులు, వారి అధికారాన్ని, అథారిటీని దుర్వినియోగం చేశారని ఆర్థిక నేరాల వింగ్ ఆరోపిస్తోంది. రుణాలను మోసపూరిత ఉద్దేశ్యంతో జారీచేశారని, రద్దు చేసిన రుణాలను వీరు వారికి మంజూరు చేశారని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు చెందిన మాజీ, ప్రస్తుత అధికారులు మాత్రమే కాక, డీఎస్కే గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా ఆర్థిక నేరాల వింగ్ అదుపులోకి తీసుకుంది. డీఎస్కే గ్రూప్ సీఏ సునిల్ ఘట్పాండే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ నేవాస్కర్ను, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ నిత్యానంద్‌ను ఆర్థిక నేరాల వింగ్ అరెస్ట్ చేసింది. గత నెలలోనే కులకర్ని, ఆయన భార్య, డీఎస్కే గ్రూప్‌కు చెందిన ఇతర అధికారుల 124 ప్రాపర్టీలను, 276 బ్యాంక్ అకౌంట్లను, 46 వాహనాలను మహారాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. -
లాకర్లలో అక్రమ కోట్లు వెలుగులోకి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమ సొమ్ము, లెక్కతేలని సొమ్ము బయటపడుతోంది. ఇప్పటి వరకు బడా బాబుల ఇళ్లల్లో ఈ నల్లడబ్బు బయటపడుతుండగా ఇప్పుడు ఏకంగా బ్యాంకుల్లో వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో లెక్కతేలని కోట్లు బయటపడ్డాయి. అది కూడా ఓ బ్యాంకు లాకర్లో లభించడంతో అధికారులు ఖిన్నులయ్యారు. రాష్ట్రంలోని పుణెలోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పార్వతీ బ్రాంచ్‌లో బుధవారం ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు లాకర్లు తెరిచి చూడగా అందులో పది కోట్ల రూపాయలు లెక్కతేలనివి బయటపడ్డాయి. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ డబ్బును చూసి ఐటీ అధికారులు సైతం అవాక్కయ్యారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి బ్యాంకు అధికారులే ఈ పని చేసి నల్ల డబ్బుకు ఆశ్రయం ఇచ్చి ఉంటారా అనే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ లాకర్ల యజమానుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదునంతా తమ స్వాధీనం చేసుకొని మరిన్ని లాకర్లు తెరిచే పని చేస్తున్నారు. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో
500 పీవో పోస్టులు ప్రధాన జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ (జేఎంజీఎస్)-1 ప్రొబేషనరీ ఆఫీసర్ల (పీవోల) నియామకానికి అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ఏడాది పాటు (మూడు నెలల ఇంటర్న్‌షిప్‌తో కలిపి) శిక్షణ ఇచ్చి అనంతరం పీవోలుగా నియమిస్తారు. ట్రైనింగ్‌ను సొంత ఖర్చులతో పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ బ్రాంచ్‌ల్లో మూడు నెలల పాటు నిర్వహించే ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 20,000 చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌పై స్పెషల్ ఫోకస్.. ఖాళీల వివరాలు: పోస్టుల సంఖ్య 500. ఇందులో ఎస్సీ-50, ఎస్టీ-37, ఓబీసీ-135, జనరల్-253. మొత్తం మీద 15 పోస్టులను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. వేతనం: నెలకు రూ.23,700-42020 పేస్కేల్‌తోపాటు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ వంటి అలవెన్సులన్నీ కలుపుకొని వార్షిక వేతనం రూ.8 లక్షల 50 వేలు చెల్లిస్తారు. విద్యార్హత: 2016, జూలై 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి: 2016, జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆన్లైన్ టెస్ట్ (రాత పరీక్ష): 120 నిమిషాల (రెండు గంటల) వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ఈ ప్రశ్నలు నాలుగు విభాగాల నుంచి వస్తాయి. ఇంగ్లిష్ మినహా ఇతర విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్తో పాటు హిందీలోనూ ఉంటాయి. ప్రతి అభ్యర్థి ప్రతి విభాగంలోనూ, మొత్తం మీద కనీస మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రశ్నల సంఖ్య, మార్కుల వివరాలు.. క్ర.సం. సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య మార్కులు 1. రీజనింగ్ ఎబిలిటీ 50 50 2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 3. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50 4. జనరల్ అవేర్నెస్ 50 50 (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యత) మొత్తం 200 200 ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని పోస్టుల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత ట్రైనింగ్‌కు ఎంపిక చేసేందుకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. శిక్షణ రుసుం: పీజీడీబీఎఫ్ కోర్సు శిక్షణకు సుమారు రూ.3.14-3.50 లక్షలు ఖర్చవుతుంది. లాడ్జింగ్, బోర్డింగ్, కోర్సు మెటీరియల్, ల్యాబ్ చార్జీలు/ప్రాక్టికల్స్, వైద్య సేవలు, ఎగ్జామ్ ఫీజు, సర్టిఫికెట్ ఫీజు అన్నీ ఇందులో ఉన్నాయి. శిక్షణ కేంద్రాలు: రెండు చోట్ల శిక్షణ ఇస్తారు. అభ్యర్థిని ఏ క్యాంపస్‌కు పంపాలనేది బ్యాంక్ నిర్ణయిస్తుంది. 1. ఎన్ఐఐటీ యూనివర్సిటీ, నీమ్రానా, ఎన్‌హెచ్-8, ఢిల్లీ-జైపూర్ హైవే, అల్వార్ జిల్లా, రాజస్థాన్, పిన్‌కోడ్ నంబర్: 301705 2. మణిపాల్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, జైపూర్ దెహ్మి కలాన్, నియర్ జీవీకే టోల్ ప్లాజా, జైపూర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ హైవే, జైపూర్, రాజస్థాన్, పిన్‌కోడ్ నంబర్: 303007. రుణ సౌకర్యం: కోర్సు ఫీజును చెల్లించేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. ఎడ్యుకేషన్ లోన్‌ను మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని శిక్షణ పూర్తయిన తర్వాత 60 వాయిదాల్లో (60 నెలల-ఐదేళ్ల వ్యవధి లోపు) చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం: ఆన్లైన్ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100; ఇతరులకు రూ.600. దరఖాస్తుకు చివరి తేది: 2016 సెప్టెంబర్ 6 వెబ్సైట్: దరఖాస్తు, ఇతర వివరాలకు www.bankofmaharashtra.in చూడొచ్చు. -
బీవోఎం నుంచి మహా మొబైల్ యాప్
* లక్ష యూజర్ల నమోదు లక్ష్యం * వచ్చే ఏడాది ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూ ఆలోచన * బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్.ఆత్మారామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుత లావాదేవీల్లో 50 శాతం ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుండగా వచ్చే ఏడాదిలో ఇది 75 శాతం దాటుతుందని అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘మహా మొబైల్’పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బీవోఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్ ఆత్మారామ్ ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగిస్తున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అందిస్తున్న చాలా సేవలు మొబైల్ బ్యాంక్ ద్వారా వినియోగించుకోవచ్చని, దీంతో సెలవు రోజుల్లో కూడా నగదు పంపవచ్చన్నారు. ఏడాదిలోగా లక్ష మంది ఖాతాదారులను మహా మొబైల్ యాప్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఇష్యూకి.. వ్యాపార విస్తరణకు వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు అవసరమవుతాయని ఆత్మారామ్ తెలిపారు. కేంద్రం నిధులు సమకూర్చకపోతే మార్కెట్ పరిస్థితులను బట్టి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు వస్తామన్నారు. ప్రస్తుతం షేరు ధర చాలా చౌక ట్రేడ్ అవుతుడటంతో ఇష్యూ ఆలోచన లేదని, ధర పెరిగితే ఇష్యూకు వస్తామన్నారు. అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదలించుకొని ఇదే సమయంలో అధిక వడ్డీ లభించే రుణాలపై దృష్టిసారించడం ద్వారా బ్యాంకు లాభదాయకతను పెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వ్యాపారంలో 12-15 శాతం వృద్ధిని, వచ్చే ఏడాది 18% వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. రుణ రేటు పావుశాతం తగ్గవచ్చు..:మంగళవారంఆర్‌బీఐ మరో పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.