
ముంబై: రియల్ ఎస్టేట్ సంస్థ డీఎస్‌కే గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, ఈడీల అరెస్టులు అసాధారణమైనవని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఉదంతం ఆధారంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులను కేంద్రం వేధిస్తోందని భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఏఐఐబీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అధికారి ఈ వివరాలు తెలిపారు. డీఎస్‌కే గ్రూప్ అధినేత డీఎస్ కులకర్ణితో కుమ్మక్కై రుణ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై బీవోఎం ఎండీ రవీంద్ర మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర గుప్తా, జోనల్ మేనేజర్ నిత్యానంద్ దేశ్‌పాండే, మాజీ చైర్మన్ సుశీల్ మునూత్ తదితరులు అరెస్టయిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన ఈ అరెస్టులపై బ్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
సమాఖ్య విధానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సీబీఐకి రిఫర్ చేయాలే తప్ప రాష్ట్ర స్థాయి పోలీసులు ఎకాయెకిన అరెస్టులు చేయడానికి ఉండదని అధికారి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగులపై చర్యలకు సంబంధించి కేంద్రం కూడా సదరు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. మరోవైపు, ఆర్థిక అవకతవకల కేసుల్లో సీనియర్ బ్యాంకర్లను అరెస్టులు చేయాల్సి వస్తే ప్రత్యేక విధానమంటూ ఉండేలా ఎక్స్‌టర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలన్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదనను ఆయన కొట్టిపారేశారు. అసాధారణంగా ఏదో ఒకసారి జరిగిన దాన్ని సంచలనం చేయరాదని, ఇలాంటివి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment