లాకర్లలో అక్రమ కోట్లు వెలుగులోకి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమ సొమ్ము, లెక్కతేలని సొమ్ము బయటపడుతోంది. ఇప్పటి వరకు బడా బాబుల ఇళ్లల్లో ఈ నల్లడబ్బు బయటపడుతుండగా ఇప్పుడు ఏకంగా బ్యాంకుల్లో వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని ఓ బ్యాంకులో లెక్కతేలని కోట్లు బయటపడ్డాయి. అది కూడా ఓ బ్యాంకు లాకర్లో లభించడంతో అధికారులు ఖిన్నులయ్యారు. రాష్ట్రంలోని పుణెలోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పార్వతీ బ్రాంచ్‌లో బుధవారం ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఐదు లాకర్లు తెరిచి చూడగా అందులో పది కోట్ల రూపాయలు లెక్కతేలనివి బయటపడ్డాయి. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈ డబ్బును చూసి ఐటీ అధికారులు సైతం అవాక్కయ్యారు. కొంత మంది ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి బ్యాంకు అధికారులే ఈ పని చేసి నల్ల డబ్బుకు ఆశ్రయం ఇచ్చి ఉంటారా అనే దిశగా ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ లాకర్ల యజమానుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ నగదునంతా తమ స్వాధీనం చేసుకొని మరిన్ని లాకర్లు తెరిచే పని చేస్తున్నారు.