
ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అనుమానం వస్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇ-మెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారు మీ ఖాతాలను దర్యాప్తు చేయవచ్చు.
ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకానమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 132 ప్రకారం, పన్ను ఎగవేత ఉద్దేశంతో ఎవరైనా తన ఆదాయం, ఆస్తులు లేదా ఆర్థిక వివరాలను దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే పన్ను అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేయవచ్చు.
అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్ లు, లాకర్లు పగులగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారాలు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావవంతంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనలను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment