new power
-
ఐటీ అధికారులకు కొత్త అధికారాలు
ఆదాయ పన్ను శాఖ అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అనుమానం వస్తే మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇ-మెయిల్స్, బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ ఖాతాలపై దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఆదాయపు పన్ను శాఖకు ఉంటుంది. మీరు పన్నులు ఎగ్గొట్టారని లేదా ఏదైనా అప్రకటిత ఆస్తులు, నగదు, బంగారం, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అనుమానం వస్తే వారు మీ ఖాతాలను దర్యాప్తు చేయవచ్చు.ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు కింద ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఎకానమిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఆర్థిక మోసాలు, అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడంలో భాగంగా డిజిటల్ యుగానికి అనుగుణంగా పన్ను దర్యాప్తు ప్రక్రియకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 132 ప్రకారం, పన్ను ఎగవేత ఉద్దేశంతో ఎవరైనా తన ఆదాయం, ఆస్తులు లేదా ఆర్థిక వివరాలను దాచినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే పన్ను అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేయవచ్చు.అప్రకటిత ఆస్తులు, ఆర్థిక రికార్డులు దాగి ఉన్నాయని అనుమానం వస్తే తలుపులు, సేఫ్ లు, లాకర్లు పగులగొట్టి దర్యాప్తు చేసే అధికారం ఇప్పటి వరకు వారికి ఉండేది. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ అధికారాలు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తారు. అంటే పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా అధికారులకు ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు డిజిటల్ గా మారడంతో పన్ను అధికారుల దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. పన్ను దర్యాప్తులో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం చెబుతోంది. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడంలో ఈ మార్పు ప్రభావవంతంగా ఉంటుందా లేక గోప్యత ఆందోళనలను లేవనెత్తుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
కొత్తవిద్యుత్ కేంద్రాలపై నీలినీడలు..
కేంద్ర మంత్రి గోయల్ కీలక వ్యాఖ్యలు.. ప్రశ్నార్థకంగా మారిన ‘బీపీఎల్’ భూములు బీథర్మల్ విస్తరణకు అవకాశాలు సన్నగిల్లినట్లేనా? రామగుండం : డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడం.. మార్కెట్లో యూనిట్ ధర తక్కువగా ఉండడంతో నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ ఇటీవల చేసిన నిరాసక్తమైన వ్యాఖ్యలతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనతో సాంకేతికపరమైన అంశాలు తెరపైకి రావడం, నిర్మాణాల్లో ఆటంకాలు ఎదురవడం, ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గడువులోగా పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉండడం తదితర అంశాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు అంతగా అవసరం లేదనే వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త కేంద్రాల స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందా..? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రామగుండంలో అదనంగా నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్టీపీసీకి గ్రీన్ సిగ్నల్ సైతం లభించింది. ఈ క్రమంలో ఇప్పటికే 800 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన రెండు కేంద్రాల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల స్థాపనకు గతంలోనే రామగుండంలోని బీపీఎల్ భూములు పరిశీలించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనతో నూతన కేంద్రాల స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. రామగుండంలో కాలం చెల్లిన బీథర్మల్ విద్యుత్ కేంద్రం ఒకవేళ మూతపడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం ప్రతిపాదిత ‘బీపీఎల్’ స్థాపనకు... 1994లో అప్పటి ప్రభుత్వం బ్రిటీష్ ఫిజికల్ లాబోరోటరీ (బీపీఎల్)ను బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)కు దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ‘ఏ’పవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి ప్రహారీ నిర్మాణాలు చేపట్టి రూ.150 కోట్ల వ్యయం చేసింది. ఇందుకోసం మొత్తంగా 1817.03 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేట్ భూములు 1271.38 ఎకరాలు, ప్రభుత్వ భూములు 543.05 ఎకరాల విస్తీర్ణంగా ఉంది. ప్రస్తుతం వీటి పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణకు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరం... ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణకు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. కాగా ప్రస్తుతం జెన్కో ఆధ్వర్యంలో కేవలం 2,687 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడల్ ద్వారా 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నా కేవలం వర్షాకాలం సీజన్‌పైనే ఆధారం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఒప్పందం మేరకు సింహాద్రి కేంద్రం నుంచి ఐదు మెగావాట్లు, ఎన్టీపీసీ నుంచి 600 మెగావాట్లు, ఇతర సీమాంధ్ర అగ్రిమెంట్ల నుంచి మరో 400 మెగావాట్లు తెలంగాణకు సరఫరా అవుతున్నట్లు ఓ విద్యుత్ జేఏసీ నాయకుడు తెలిపారు. మరిన్ని అవసరాలకు సమయాన్ని బట్టి ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. యూనిట్ ధర తగ్గుదలే కారణం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి కావడంతో రూ.2.50కే యూనిట్ లభ్యం కావడంతో నూతన కేంద్రాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్లకు గాను ప్రస్తుతం అదే ప్లాంటు ఆవరణలో 800 సామర్ధ్యంతో రెండు కేంద్రాలు స్థాపించనుండగా, మరో 2400 మెగావాట్లకు స్థల సేకరణ ప్రక్రియలో వేగం తగ్గిందని చెప్పుకోవచ్చు. రెండేళ్ల క్రితం రామగుండంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్రతిపాదిత బీపీఎల్ స్థలాలను యుద్ధప్రాతిపదికన సర్వే చేయించిన ప్రభుత్వం తాజాగా ఎందుకు వెనకాడుతుందో కేంద్ర మంత్రి గోయల్ ప్రకటనతో స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
పోలీసు లాఠీకి.. పవర్ ‘పాంచ్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా పోలీస్ విభాగం కొత్త శక్తి సముపార్జించింది. కొత్తగా ఐదుగురు డీఎస్పీలు రావడంతో పరిపుష్టమైంది. దీన్ని సద్వినియోగించుకొని జిల్లాలో శాంతిభద్రతలను మరింత మెరుగుపరచాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు ఆ శాఖపై పడింది. జిల్లాలో డీఎస్పీ పోస్టులు పెరుగనున్నాయని గతంలోనే ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. అందుకు తగినట్లే సీఐల పదోన్నతుల్లో భాగంగా జిల్లాకు స్పెషల్ బ్రాంచ్, జిల్లా నేర గణాంకాల విభాగం (డీసీఆర్బీ), సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్), ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్లకు డీఎస్పీలను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, అక్రమ రవాణా నియంత్రణ, సీఐడీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలకు ఇంకా డీఎస్పీ స్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. ఎస్బీకి ఇద్దరు డీఎస్పీలు గతంలో జిల్లాలో ఒకే స్పెషల్‌బ్రాంచ్ విభాగం ఉండేది. దీనికి సీఐ నేతృత్వం వహించేవారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఎస్బీ-ఎక్స్ (ఎక్ట్స్రిమిస్ట్స్) అనే మరో విభాగం పని చేస్తుండేది. ఇటీవలే స్థాయి పెరిగి డీఎస్పీ వచ్చారు. తాజా ఉత్తర్వులతో మరో డీఎస్పీ రానున్నారు. పోలీస్‌శాఖలో అవినీతిపరుల భరతం పట్టడంతో పాటు రహస్య నివేదికలు ఇవ్వడం, సభలు, సమావేశాలు, బంద్‌ల సమయాల్లో సిబ్బందికి డ్యూటీలేయడం, పాస్‌పోర్ట్ విభాగాన్ని పర్యవేక్షించడం, కొత్త పరిణామాలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం తదితర బాధ్యతలు ఈ విభాగానివే. జిల్లా ఎస్పీకి ఈ విభాగం కళ్లు, చెవుల్లాంటిదని చెబుతారు. ఈ విభాగానికి నియమితులైన ఇద్దరు డీఎస్పీలు సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. 1992 బ్యాచ్‌కు చెందిన సీహెచ్ వివేకానంద ఇప్పుడు కొత్త అధికారిగా రానున్నారు. గతంలో విశాఖ ఎస్బీతోపాటు పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. లెక్కల నిధి డీసీఆర్బీ రోడ్డు ప్రమాదాలు, ఇతర అన్ని రకాల నేర సంఘటనలు, వరకట్న వివాదాల గణాంకాలతోపాటు నేరగాళ్ల సమాచారం సేకరించి నిక్షిప్తం చేయడం డీసీఆర్బీ ప్రధాన బాధ్యత.జిల్లా పోలీస్ శాఖ జరిపే నెలవారీ సమీక్షల్లో డీసీఆర్బీ ఇచ్చే గణాంకాల ఆధారంగానే తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కిందిస్థాయి పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. శాంతిభద్రతల అదుపునకు భవిష్యత్తు వ్యూహాలు రచిస్తుంటారు. కోర్టు కేసులకు సంబంధించి కోర్టు మానిటరింగ్ సెల్ కూడా దీని పరిధిలోనే ఉంటుంది. ఇప్పటివరకు ఈ విభాగాన్ని సీఐ పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన పి. శ్రీనివాసరావే డీసీఆర్బీ డీఎస్పీగా రానున్నారు. సీసీఎస్‌కు కొత్త డీఎస్పీ జిల్లా కేంద్ర నేర విభాగం(సీసీఎస్) కూడా డీఎస్పీ పర్యవేక్షణలోకి వెళ్లనుంది. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా సీసీఎస్ సిబ్బంది అప్రమత్తమవుతారు. క్షణాల్లో అక్కడ వాలిపోయి నిందితులను గుర్తించేందుకు కృషి చేస్తారు. నేరం జరిగిన తీరును (ఎంవో) క్షణాల్లో పసిగట్టే సిబ్బంది ఈ విభాగంలో ఉంటారు. సీసీఎస్‌కు డీఎస్పీ పోస్టు అవసరమని ఎప్పుడో గుర్తించిన పోలీస్ బాస్‌లు ఆ మేరకు కె. వేణుగోపాలనాయుడును నియమించారు. ఈయన కూడా గతంలో ఇక్కడ పనిచేసినవారే కావడంతో ఆ అనుభవం ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ పట్టణం పెరుగుతోంది. వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొత్త రకం వాహనాలు రోడ్ల మీద రయ్‌మని దూసుకుపోతున్నాయి. వీఐపీల తాకిడి పెరుగుతోంది. రోడ్లు మాత్రం తగినంతగా విస్తరణకు నోచుకోలేదు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై భారం పడుతోంది. ఉన్న సిబ్బందితోనే పాట్లు పడుతున్న తరుణంలో డీఎస్పీ నియామకం శుభ పరిణామం. దీనివల్ల పర్యవేక్షణ పెరిగి, సిబ్బంది పూర్తిస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. గతంలో టెక్కలిలో సీఐగా పని చేసిన పి. శ్రీనివాసరావు ట్రాఫిక్ డీఎస్పీగా రానున్నారు. మహిళలకు భరోసా మహిళలకు సంబంధించిన కేసుల విచారణకు 2006లో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల సాధారణ పోలీస్స్టేషన్లకు కొంత పనిభారం తప్పింది. వరకట్న వివాదాలు, లైంగిక దాడులు వంటి కేసుల్లో బాధిత మహిళలు ఇక్కడకు వస్తుంటారు. కుటుంబ వివాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు. క్రమంగా ఈ స్టేషన్లలో కేసుల సంఖ్య, పని భారం పెరుగుతోంది. ఇంతవరకు సీఐ పర్యవేక్షణలో ఉన్న ఈ స్టేషన్‌కు డీఎస్పీని నియమించడం సంతోషమే. అయితే స్టేషన్ అవసరాలకు సరిపడే సిబ్బంది, వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమకూరిస్తే ఈ స్టేషన్ పనితీరు మరింత మెరుగవుతుంది.