కొత్తవిద్యుత్ కేంద్రాలపై నీలినీడలు..
-
కేంద్ర మంత్రి గోయల్ కీలక వ్యాఖ్యలు..
-
ప్రశ్నార్థకంగా మారిన ‘బీపీఎల్’ భూములు
-
బీథర్మల్ విస్తరణకు అవకాశాలు సన్నగిల్లినట్లేనా?
రామగుండం : డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడం.. మార్కెట్‌లో యూనిట్ ధర తక్కువగా ఉండడంతో నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ ఇటీవల చేసిన నిరాసక్తమైన వ్యాఖ్యలతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనతో సాంకేతికపరమైన అంశాలు తెరపైకి రావడం, నిర్మాణాల్లో ఆటంకాలు ఎదురవడం, ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గడువులోగా పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉండడం తదితర అంశాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు అంతగా అవసరం లేదనే వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త కేంద్రాల స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుందా..?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రామగుండంలో అదనంగా నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్టీపీసీకి గ్రీన్ సిగ్నల్ సైతం లభించింది. ఈ క్రమంలో ఇప్పటికే 800 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన రెండు కేంద్రాల పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల స్థాపనకు గతంలోనే రామగుండంలోని బీపీఎల్ భూములు పరిశీలించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనతో నూతన కేంద్రాల స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. రామగుండంలో కాలం చెల్లిన బీథర్మల్ విద్యుత్ కేంద్రం ఒకవేళ మూతపడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం ప్రతిపాదిత ‘బీపీఎల్’ స్థాపనకు...
1994లో అప్పటి ప్రభుత్వం బ్రిటీష్ ఫిజికల్ లాబోరోటరీ (బీపీఎల్)ను బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జపాన్)కు దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ‘ఏ’పవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి ప్రహారీ నిర్మాణాలు చేపట్టి రూ.150 కోట్ల వ్యయం చేసింది. ఇందుకోసం మొత్తంగా 1817.03 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేట్ భూములు 1271.38 ఎకరాలు, ప్రభుత్వ భూములు 543.05 ఎకరాల విస్తీర్ణంగా ఉంది. ప్రస్తుతం వీటి పరిస్థితి గందరగోళంగా మారింది.
తెలంగాణకు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరం...
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణకు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. కాగా ప్రస్తుతం జెన్‌కో ఆధ్వర్యంలో కేవలం 2,687 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడల్ ద్వారా 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నా కేవలం వర్షాకాలం సీజన్‌పైనే ఆధారం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఒప్పందం మేరకు సింహాద్రి కేంద్రం నుంచి ఐదు మెగావాట్లు, ఎన్టీపీసీ నుంచి 600 మెగావాట్లు, ఇతర సీమాంధ్ర అగ్రిమెంట్ల నుంచి మరో 400 మెగావాట్లు తెలంగాణకు సరఫరా అవుతున్నట్లు ఓ విద్యుత్ జేఏసీ నాయకుడు తెలిపారు. మరిన్ని అవసరాలకు సమయాన్ని బట్టి ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.
యూనిట్ ధర తగ్గుదలే కారణం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి కావడంతో రూ.2.50కే యూనిట్ లభ్యం కావడంతో నూతన కేంద్రాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్లకు గాను ప్రస్తుతం అదే ప్లాంటు ఆవరణలో 800 సామర్ధ్యంతో రెండు కేంద్రాలు స్థాపించనుండగా, మరో 2400 మెగావాట్లకు స్థల సేకరణ ప్రక్రియలో వేగం తగ్గిందని చెప్పుకోవచ్చు. రెండేళ్ల క్రితం రామగుండంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్రతిపాదిత బీపీఎల్ స్థలాలను యుద్ధప్రాతిపదికన సర్వే చేయించిన ప్రభుత్వం తాజాగా ఎందుకు వెనకాడుతుందో కేంద్ర మంత్రి గోయల్ ప్రకటనతో స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.