
పోలీసు లాఠీకి.. పవర్ ‘పాంచ్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా పోలీస్ విభాగం కొత్త శక్తి సముపార్జించింది. కొత్తగా ఐదుగురు డీఎస్పీలు రావడంతో పరిపుష్టమైంది. దీన్ని సద్వినియోగించుకొని జిల్లాలో శాంతిభద్రతలను మరింత మెరుగుపరచాల్సిన గురుతర బాధ్యత ఇప్పుడు ఆ శాఖపై పడింది. జిల్లాలో డీఎస్పీ పోస్టులు పెరుగనున్నాయని గతంలోనే ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. అందుకు తగినట్లే సీఐల పదోన్నతుల్లో భాగంగా జిల్లాకు స్పెషల్ బ్రాంచ్, జిల్లా నేర గణాంకాల విభాగం (డీసీఆర్‌బీ), సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్), ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్లకు డీఎస్పీలను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, అక్రమ రవాణా నియంత్రణ, సీఐడీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలకు ఇంకా డీఎస్పీ స్థాయి అధికారులను నియమించాల్సి ఉంది.
ఎస్బీకి ఇద్దరు డీఎస్పీలు
గతంలో జిల్లాలో ఒకే స్పెషల్‌బ్రాంచ్ విభాగం ఉండేది. దీనికి సీఐ నేతృత్వం వహించేవారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఎస్బీ-ఎక్స్ (ఎక్ట్స్రిమిస్ట్స్) అనే మరో విభాగం పని చేస్తుండేది. ఇటీవలే స్థాయి పెరిగి డీఎస్పీ వచ్చారు. తాజా ఉత్తర్వులతో మరో డీఎస్పీ రానున్నారు. పోలీస్‌శాఖలో అవినీతిపరుల భరతం పట్టడంతో పాటు రహస్య నివేదికలు ఇవ్వడం, సభలు, సమావేశాలు, బంద్‌ల సమయాల్లో సిబ్బందికి డ్యూటీలేయడం, పాస్‌పోర్ట్ విభాగాన్ని పర్యవేక్షించడం, కొత్త పరిణామాలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడం తదితర బాధ్యతలు ఈ విభాగానివే. జిల్లా ఎస్పీకి ఈ విభాగం కళ్లు, చెవుల్లాంటిదని చెబుతారు. ఈ విభాగానికి నియమితులైన ఇద్దరు డీఎస్పీలు సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. 1992 బ్యాచ్‌కు చెందిన సీహెచ్ వివేకానంద ఇప్పుడు కొత్త అధికారిగా రానున్నారు. గతంలో విశాఖ ఎస్బీతోపాటు పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
లెక్కల నిధి డీసీఆర్‌బీ
రోడ్డు ప్రమాదాలు, ఇతర అన్ని రకాల నేర సంఘటనలు, వరకట్న వివాదాల గణాంకాలతోపాటు నేరగాళ్ల సమాచారం సేకరించి నిక్షిప్తం చేయడం డీసీఆర్‌బీ ప్రధాన బాధ్యత.జిల్లా పోలీస్ శాఖ జరిపే నెలవారీ సమీక్షల్లో డీసీఆర్‌బీ ఇచ్చే గణాంకాల ఆధారంగానే తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కిందిస్థాయి పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. శాంతిభద్రతల అదుపునకు భవిష్యత్తు వ్యూహాలు రచిస్తుంటారు. కోర్టు కేసులకు సంబంధించి కోర్టు మానిటరింగ్ సెల్ కూడా దీని పరిధిలోనే ఉంటుంది. ఇప్పటివరకు ఈ విభాగాన్ని సీఐ పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన పి. శ్రీనివాసరావే డీసీఆర్‌బీ డీఎస్పీగా రానున్నారు.
సీసీఎస్‌కు కొత్త డీఎస్పీ
జిల్లా కేంద్ర నేర విభాగం(సీసీఎస్) కూడా డీఎస్పీ పర్యవేక్షణలోకి వెళ్లనుంది. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా సీసీఎస్ సిబ్బంది అప్రమత్తమవుతారు. క్షణాల్లో అక్కడ వాలిపోయి నిందితులను గుర్తించేందుకు కృషి చేస్తారు. నేరం జరిగిన తీరును (ఎంవో) క్షణాల్లో పసిగట్టే సిబ్బంది ఈ విభాగంలో ఉంటారు. సీసీఎస్‌కు డీఎస్పీ పోస్టు అవసరమని ఎప్పుడో గుర్తించిన పోలీస్ బాస్‌లు ఆ మేరకు కె. వేణుగోపాలనాయుడును నియమించారు. ఈయన కూడా గతంలో ఇక్కడ పనిచేసినవారే కావడంతో ఆ అనుభవం ఉపయోగపడుతుంది.
పెరుగుతున్న ట్రాఫిక్
పట్టణం పెరుగుతోంది. వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొత్త రకం వాహనాలు రోడ్ల మీద రయ్‌మని దూసుకుపోతున్నాయి. వీఐపీల తాకిడి పెరుగుతోంది. రోడ్లు మాత్రం తగినంతగా విస్తరణకు నోచుకోలేదు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై భారం పడుతోంది. ఉన్న సిబ్బందితోనే పాట్లు పడుతున్న తరుణంలో డీఎస్పీ నియామకం శుభ పరిణామం. దీనివల్ల పర్యవేక్షణ పెరిగి, సిబ్బంది పూర్తిస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. గతంలో టెక్కలిలో సీఐగా పని చేసిన పి. శ్రీనివాసరావు ట్రాఫిక్ డీఎస్పీగా రానున్నారు.
మహిళలకు భరోసా
మహిళలకు సంబంధించిన కేసుల విచారణకు 2006లో మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల సాధారణ పోలీస్‌స్టేషన్లకు కొంత పనిభారం తప్పింది. వరకట్న వివాదాలు, లైంగిక దాడులు వంటి కేసుల్లో బాధిత మహిళలు ఇక్కడకు వస్తుంటారు. కుటుంబ వివాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు. క్రమంగా ఈ స్టేషన్లలో కేసుల సంఖ్య, పని భారం పెరుగుతోంది. ఇంతవరకు సీఐ పర్యవేక్షణలో ఉన్న ఈ స్టేషన్‌కు డీఎస్పీని నియమించడం సంతోషమే. అయితే స్టేషన్ అవసరాలకు సరిపడే సిబ్బంది, వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమకూరిస్తే ఈ స్టేషన్ పనితీరు మరింత మెరుగవుతుంది.