సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసు శాఖలో పెద్ద చిన్న తరతమ భేదాలు లేవని.. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు ఒకటే నిబంధన వర్తిస్తుందని.. నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేసి ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కొత్త ఎస్పీ గ్రేవెల్ నవదీప్‌సింగ్ అన్నారు. ఏఎస్పీ పనసారెడ్డి నుంచి శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయని, చివరి పది రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. జిల్లాపై అవగాహన కలిగించుకునేందుకు విస్తృతంగా పర్యటించి సిబ్బంది, అధికారులు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటానని, అన్ని పార్టీల నాయకుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కేంద్ర బలగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయని మరికొన్ని బలగాలు త్వరలో వస్తాయని, వీరితోపాటు, తమ సిబ్బందికి కూడా వారి విధి విధానాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
జిల్లాలో మరిన్ని చెక్‌పోస్టులు అవసరమని, గుర్తిస్తే వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బైండోవర్ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని ఈ జాబితాను మేజిస్ట్రేట్‌కు అందజేస్తామని, వారి ముందు వ్యక్తులు హాజరై విషయాలను తెలియజేస్తే న్యాయమూర్తి బైండోవర్ విధించాలా లేదా అన్నది నిర్ణయిస్తారని, దాని మేరకు పోలీసు శాఖ నడుచుకుంటుందన్నారు. గతంలో కంటే మూడింతలమందిపై బైండోవర్ విధించారని, జిల్లాలో గడచిన అయిదేళ్లుగా ఎటువంటి కేసులు లేని వారిని కూడా మినహాయించలేదని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకు రాగా, దీనిపై పరిశీలన జరుపుతానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సేవలు కూడా వినియోగించుకుంటామని ఎన్నికల సంఘాన్ని, ఉన్నతాధికారులను అడిగామని, దీనిపై వివరణ రావాల్సి ఉందన్నారు. మాజీ సైనికోద్యోగుల సేవలు వినియోగించుకొనేందుకు అనుమతి వచ్చిందని, జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి ఎంపిక చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు, సిబ్బంది సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment