కంచుకోటలో సీదిరి విజయభేరి | Seediri Appalraju Won In Palasa | Sakshi
Sakshi News home page

కంచుకోటలో సీదిరి విజయభేరి

Published Fri, May 24 2019 4:55 PM | Last Updated on Fri, May 24 2019 4:55 PM

Seediri Appalraju Won In Palasa - Sakshi

రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ పత్రం అందుకుంటున్న డాక్టర్‌ సీదిరి అప్పలరాజు దంపతులు

సాక్షి, పలాస (శ్రీకాకుళం): టీడీపీ కంచుకోట బద్దలైంది. వారసత్వ రాజకీయాలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం తర్వాత అత్యంత రాజకీయ చైతన్యం గల పలాస నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల్లో తమ చైతన్యాన్ని సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి రుచిచూపించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును 16001 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో పలాసతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫ్యాన్‌’ గాలి జోరుగా వీయడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పూండి, పలాస, మందస, ఎమ్మెల్యే స్వగ్రామం దేవునల్తాడల్లో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

లాభించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు..
పలాస ఎమ్మెల్యేగా గౌతు శివాజీ ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదు. దీనిని కూడా నిశితంగా ఇక్కడి ప్రజలు గమనించారు. ఆరు నెలల క్రితం వచ్చిన తిత్లీ తుపానులో నష్టపోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదు. పరిహారం అర్హులకు అందలేదు. గ్రామాల్లో రాజ్యాంగేతర శక్తులుగా చంద్రబాబు పెంచి పోషించిన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే అరకొర నష్టపరిహారం పంపిణీ జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులకే ముట్టజెప్పారు. పలాస నియోజకవర్గంలోనే ఉద్దానం ప్రాంతంగా చెప్పుకున్న వజ్రపుకొత్తూరు, మందస, పలాస, మండలాల్లోని రైతులు  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నది ఓట్ల లెక్కింపు సరళి తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా, గౌతు శ్యామసుందరశివాజీ తన కుమార్తె శిరీషను తన రాజకీయ వారసురాలిగా నిలబెట్టడాన్ని కూడా ఇక్కడ ఓటర్లు సమ్మతించలేదు. దీనికి తోడు శిరీష భర్త వెంకన్న చౌదరి తన మామ శివాజీని అడ్డంపెట్టుకుని చేసిన ఆర్థిక అరాచకాలను ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు.

ఏకపక్షంగా ఓట్లు..
ఎన్నికలకు కొద్ది నెలల క్రితం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఈ ప్రాంతంలో జరగడం, ఆయన ఇచ్చిన హామీలు ప్రజల హృదయాలను తాకాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రకు ఎంత ఆదరణ లభించిందో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు అంతే స్థాయిలో ఆదరణ వచ్చింది. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలను మరువలేని ప్రజలు మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తేనే లభిస్తాయన్న గంపెడు ఆశలతో ప్రజలు భావోద్వేగానికి లోనై ఏకపక్షంగా ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

బోసిపోయిన టీడీపీ కార్యాలయం..
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఓ పక్క ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుంది. ఒకప్పుడు పలాసలోని టీడీపీ కార్యాలయం కళకళలాడుతుండేది. ఎన్నికల లెక్కింపు వేళ గురువారం కార్యాలయం బోసిపోయింది. పైగా ఇటీవలే ఆ కార్యాలయానికి ఏసీ అమర్చిన నేతలు ప్రస్తుతం ఓటమి పాలవడంతో కార్యాలయం ముఖం చూడని పిరిస్థతి ఎదురైంది.

ఎమ్మెల్యేగా డిక్లరేషన్‌ పొందిన సీదిరి 
పలాస వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేగా డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు అత్యధిక ఓటు మెజారిటీ రావడంతో పలాస ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డి.అనితాదేవి గురువారం సాయంత్రం  డిక్లరేషన్‌ పత్రం అందజేశారు. అప్పలరాజు, సతీమణి శ్రీదేవిలు రిటర్నింగ్‌ అధికారి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement