సాక్షి, పలాస (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యమైన నాయకులంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ పాలన ఇంకెన్నాళ్లంటూ కార్యకర్తలు సైతం పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఓటమి భయం వెంటాడుతోంది. గతంలో శివాజీ మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు మేలు చేయకపోయినా అంతగా సమస్యలు ఉండేవి కావని, ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారని సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకోవడం గమనార్హం.
ఎవరి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నామని లోలోపన మదనపడుతున్నారు. శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని అల్లుడు వెంకన్న చౌదరి చక్రం తిప్పడం, అతనికి వ్యాపార దృక్పథం తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు శిరీష ఎమ్మెల్యే అయితే పలాసలో ఉండరు సరికదా వెంకన్న వల్ల మరింతగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయని, ఇప్పటికే అతని వల్ల అవస్థలు పడిన ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు, ఎమ్మెల్యేకు మధ్య ఆది నుంచి కోల్డ్ వార్ జరిగి చివరకి పూర్ణచంద్రరావు పార్టీని విడిచిపెట్ట వలసి వచ్చింది.
తోటి కౌన్సిలర్లతో కలసి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి భర్త ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ కూడా ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. శిరీష అభ్యర్థిత్వాన్ని, వెంకన్న చౌదరి పెత్తనాన్ని నిరసిస్తూ వజ్రపుకొత్తూరు మండలంలో బలమైన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఆ పార్టీకి దూరమైంది. మందస మండలం ఎంపీపీ కొర్ల కవిత భర్త కొర్ల కన్నారావు కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. వెంకన్నచౌదరి పెట్టిన ఇబ్బందుల వల్లే బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కన్నారావు పార్టీని వీడవలసి వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరితో పాటు మందస మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్య, పలాస మాజీ జెడ్పీటీసీ వరిశ హరిప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీని వీడారు.
ప్రస్తుతం హరిప్రసాద్, అందాల శేషగరి, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. నాయకులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలంతా పార్టీకి దూరమవుతుండటంతో గౌతు కుటుంబా నికి ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో డబ్బులు ఎరజూ పుతూ అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. పలాస నియోజవర్గానికి గౌతు శిరీష స్థానికేతరం ఇక్కడి ప్రజల నుంచి స్పందన కరవవుతోంది. అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో తగిన ఆదరణ ఉండటంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి డాక్టరు సీదిరి అప్పలరాజు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గౌతు కుటుంబానికి ముచ్చెమట్లు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదుకునేవారినే ఆదరించండి
పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లా స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా దువ్వాడ శ్రీను, పలాస అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలాస అసోషియేషన్ అధ్యక్షుడు మన్నేళ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.
– కాశీబుగ్గ
వెంకన్న వేధింపులే కారణం
పార్టీని వీడడానికి ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి వేధింపులే ప్రధాన కారణం. పార్టీలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. రాజకీయంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారు. శివాజీ దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే పార్టీలో ఉండలేక బయటకు రావాల్సి వచ్చింది.
– కొర్ల కవిత, మాజీ ఎంపీపీ, మందస
అభివృద్ధిని పట్టించుకోలేదు
వజ్రపుకొత్తూరు మండలంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆశించాం. ఆశలన్నీ అడియాశలయ్యాయి. నామమాత్రంగానే జెడ్పీటీసీగా ఉండాల్సి వచ్చింది. అధికారాలన్నీ శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చేతిలో పెట్టుకున్నారు. రాకాసి గెడ్డ వంతెన నిర్మాణం చేయాలని కోరాను. పూండి మార్కెటును అభివృద్ధి చేయాలని చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మత్స్యకా రులకు ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఇస్తామన్నారు. ఇది కూడా నెరవేరలేదు. అం దుకే మత్స్యకారుల సామాజకవర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజుకు మద్దతు ఇస్తున్నాం.
– ఉప్పరపల్లి ఉదయకుమార్ (జెడ్పీటీసీ నీలవేణి భర్త), వజ్రపుకొత్తూరు
అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు
శివాజీ కుటుంబానికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. వారికి అదొక రాజకీయ సూత్రం. అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే వాటి వల్ల నాలాంటివాళ్లకు ప్రజాదరణ ఎక్కడ వచ్చేస్తుందోనన్న భయం వాళ్లది. అన్నీ అధికారాలు వారి వద్దనే ఉంచుకొని మిగిలిన వారిని ఆటబొమ్మల్లా చేసుకుంటారు. వారికి ఎవరూ పోటీ కాకూడదు. ముఖ్యంగా వెంకన్న చౌదరి వేధింపులు చాలా ఎక్కువ.
– కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస కాశీబుగ్గ
Comments
Please login to add a commentAdd a comment